సత్తా చూపిన టాటా పవర్

Updated By ManamMon, 06/11/2018 - 22:23
tata-power

tata-powerముంబై: మహారాష్ట్రలో 150 మెగావాట్ల సౌర విద్యుదుత్పాదన ప్రాజెక్టును దక్కించుకున్నట్లు టాటా పవర్ సోమవారం వెల్లడించింది. టాటా అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీకి ఈ కాంట్రాక్టు లభించింది. మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీ (ఎం.ఎస్.ఇ.డి.సి.ఎల్) నుంచి అది వచ్చింది. పంపిణీ కంపెనీతో 25 ఏళ్ళ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై టాటా రెన్యూవబుల్ కంపెనీ సంతకం చేయనుంది. గ్రిడ్‌తో అనుసంధానమైన 1,000 మెగావాట్ల సౌర శక్తి ప్రాజెక్టులలో భాగంగా ఉన్న ఈ ప్రాజెక్టుకి పోటీదాయక బిడ్డింగ్ ప్రక్రియ, 25 ఏళ్ళ కాలానికి ఈ-రివర్స్ వేలం ద్వారా పంపిణీ కంపెనీ బిడ్లను ఆహ్వానించింది. ‘‘పునరుత్పాదక ఇంధన వనరులపై మేం ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. ఈ రంగంలో, ముఖ్యంగా సౌర శక్తి కార్యకలాపాలను విస్తరించడానికి ఎదురు చూస్తున్నాం. మేం ముందుకు సాగుతున్న కొద్దీ, నూతన టెక్నాలజీ వచ్చి పడుతోంది. దాని ఊతంతో ఉత్పాదక సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో మరింత మెరుగుదల సాధించగలమని భావిస్తున్నాం’’ అని టాటా పవర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీర్ సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ మొత్తం విద్యుదుత్పాదన సామర్థ్యంలో 35-40 శాతం 2025 సంవత్సరం నాటికి శిలాజేతర ఇంధన వనరుల నుంచి ఉండాలని టాటా పవర్ దార్శనికతగా పెట్టుకుంది. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి కంపెనీ ఉత్పాదక సామర్థ్యం 2,000 మెగావాట్లను దాటింది.  కంపెనీ (సౌర, పవన, జల విద్యుత్, వ్యర్థ తాప రికవరీలతో కూడిన) హరిత పోర్ట్‌ఫోలియో 3,400 మెగావాట్ల స్థాయిని దాటింది.

Tags
English Title
Tata Power
Related News