తమిళనాడు బంద్

Updated By ManamFri, 05/25/2018 - 22:21
tamilnadu
  • డీఎంకే సారథ్యంలో ప్రతిపక్షాల ఆందోళన

  • తూత్తుకుడి కాల్పులు ఘటనపై నిరసన

tamilnaduచెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసుల కాల్పుల ఘటనను నిరసిస్తూ.. డీఎంకే సారథ్యంలోని ప్రతిపక్షాల పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర బంద్ చేపట్టారు. డీఎంకే, కాంగ్రెస్, ఐయూఎంఎల్ పార్టీలతో పాటు ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఎంఎంకే పార్టీల నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. తమిళనాడుతో పాటు పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ బంద్ చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తూత్తుకుడి సంఘటనకు బాధ్యతగా ముఖ్యమంత్రి పళనిస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చెన్నైలో డీఎంకే నేతలు ఎంపీ కనిమొళి, మాజీ మేయర్ సుబ్రమణ్యన్, వీసీకే చీఫ్ తిరుమవలవన్, ఎంఎంకే నేత జవహిరుల్లా తదితరులు నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బంద్ నేపథ్యంలో చెన్నైలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తమిళనాడులో ముందుజాగ్రత్తగా అన్ని జిల్లాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా తూత్తుకుడిలో స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ.. స్థానికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. పోలీసులు కాల్పుల్లో 11 మంది మరణించగా, 65 మందికిపైగా గాయపడ్డారు. ఇందుకు నిరసనగా ప్రతిపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం తూత్తుకుడిలో పరిస్థితి కుదుటపడుతోంది. గురు, శుక్రవారాల్లో ఎలాంటి హింసా చోటు చేసుకోలేదు. 

ఎన్‌హెచ్‌ఆర్‌సీదే నిర్ణయం: ఢిల్లీ హైకోర్టు
తూత్తుకుడిలో కాల్పుల ఘటనపై విచారించడానికి స్వతంత్ర దర్యాప్తు సంస్థలో న్యాయవాది ప్రాతినిధ్యంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నిర్ణయానికి వదిలివేసినట్టు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇప్పటికే ఈ ఘటనపై స్వతంత్ర విచారణ చేపట్టిందని, నివేదిక ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ శక్‌దెర్ పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన న్యాయవాదిని తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ సూచించిందని తెలిపారు. తూత్తుకుడి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం చేసుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ రాజరాజన్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తూత్తుకుడిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, పోలీసులు అన్యాయంగా అమాయకులను చంపుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించాల్సిందిగా సూచించాలని కోరారు.

సంయమనం పాటించండి: రాజ్‌నాథ్
తూత్తుకుడి జిల్లా వాసులు సంయుమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దంటూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. కాల్పుల ఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ‘‘తూత్తుకుడిలో ఆందోళన సందర్బంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు సానూభూతి తెలియుజేస్తున్నా. క్షతగాత్రలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. తూత్తుకుడి జిల్లా వాసులు సంయుమనం పాటించాలని విన్నవిస్తున్నా’’ అని ఓ ప్రకటనలో రాజ్‌నాథ్ పేర్కొన్నారు. 

Tags
English Title
Tamil Nadu Bandh
Related News