ఆశ నిరాశల మధ్య చెరకు రైతు

Updated By ManamWed, 06/13/2018 - 01:16
former

imageచెరకు రైతుల పట్ల కరుణ కురిపించే విధంగా కేంద్రం ముందుకు అడుగులు వేస్తుంది. అందుకు సంబంధించిన ప్రకటన ఒకటి వెలువరించింది. దేశవ్యాప్తంగా చెరకు రైతులకు ఫ్యాక్టరీలు బాకీ పడిన మొత్తాలను చెల్లించే ప్రయత్నం చేస్తుంది. అందుకవసరమైన చర్యలు చేపడు తుంది. జూన్ 7వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం చెరకు రైతులకు సహాయపడే ఒక ప్రణాళికను ఆమోదించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆ ప్యాకేజీ వివరాలను మీడియాకు వివరించారు. ఈ విష యంపై ముందుగానే ప్రచారం జరిగింది. కేంద్రం ప్రకటించే ప్యాకేజీతో లబ్దిపొంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని రైతులు ఉబలాట పడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి విడుదల చేసిన ప్రకటన రైతుల్ని నిరాశ పరచింది. నిస్పృహకు గురయ్యారు. ‘కక్కలేక మింగలేక’ అవస్థలు పడుతున్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ‘కరిమింగిన వెలగపండు’లా వుందని పరిశీలకులు అభి ప్రాయపడుతున్నారు. ఈ ప్యాకేజీ వల్ల సామాన్య రైతుకు లబ్దిచేకూరే అవకాశం ఇసుమంత కూడా లేదని, ఫ్యాక్టరీలకు నిధులు సమకూర్చి పెట్టేందుకు మాత్రమే ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.

దేశంలో ఒకప్పుడు 450 ఫ్యాక్టరీలు చెరకును క్రషింగ్ చేసి, పంచదారను ఉత్పత్తి చేసేవి. పలు కారణాల వల్ల చాలా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో 38 పంచదార కర్మాగారాలు పనిచేస్తుండేవి. రాష్ట్ర విభజన తర్వాత 29 ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చి, మిగిలినవి తెలంగాణాలో వుండిపోయాయి. చెరకు సాగులో ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అగ్రభాగంలో నిలిచింది. ఆసియా ఖండంలోనే గుర్తింపు పొందింది. అలాంటి రాష్ట్రంలో పది ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇలా చాలా రాష్ట్రాలలో ఫ్యాక్టరీలు మూతపడి వుంటాయి. క్రషింగ్ చేసిన ఫ్యాక్టరీలు రైతులకు బాకీ పడిన మొత్తం రూ.22 వేల కోట్లని అంచనా. ఆ విషయం స్వయంగా వ్యవ సాయ శాఖ కేంద్రమంత్రివర్యులే ప్రకటించారు. ‘నిండు కుండ లాంటి’ పంచదార ఫ్యాక్టరీలు ఈ విధంగా రైతు లకు బకాయి పడటానికి కారణాలు ఏమిటని ఆలోచిం చిన వారు ఒక్కరు కూడా లేరు. ‘దున్న ఈనింది అంటే దూడను కట్టేయండి’ అన్న విధంగా అందరూ అదే పాట పాడుతున్నారు. అది సరే! ప్రస్తుతానికి దాన్నలా వుంచు దాము. ఫ్యాక్టరీలు రైతులకు బాకీ రూ.22వేల కోట్లు కాగా, కేంద్రం ప్రకటించిన ఫ్యాకేజీ రూ.8,500 కోట్లు మాత్రమే. రైతుల బాకీలు పూర్తిగా తీరాలంటే ఇంకో రూ.13,500 కోట్లు అవసరమౌతాయి. ఆ మొత్తం ఫ్యాక్టరీ లకు ఎలా సమకూరుతుంది? మొత్తం రైతుల బాకీలు ఎలా తీరుస్తారు? చక్కర పరిశ్రమ దేశంలో ప్రధాన మైనది, ప్రాధాన్యత సంతరించుకొన్నది. ప్రపంచ దేశాల్లో అయిదు లేదా ఆరవ స్థానంలో భారత్ కొనసాగుతోంది. ఒకప్పుడు లక్షల టన్నులు విదేశాలకు పంచదారను ఎగుమతి చేసి, కోట్లాది రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్యం సమకూర్చిపెట్టింది. మన పంచదార. అలాంటి దేశంలో ఇప్పుడు రైతులకు ఫ్యాక్టరీలు బకా యిలు పడ్డాయనటం సిగ్గుచేటయిన విషయం. ఒకప్పుడు ఎగుమతి చేసిన మనదేశం ఇప్పుడు దిగుమతి చేసుకోవటం మరో నగుబాటు విషయం. ఆ విషయం సరే! ఇప్పుడీ రూ.8,500 కోట్లను రూ.22వేల కోట్ల బకాయిలకు ఎలా పంపిణీ చేస్తారు? అన్నదే సామాన్యుని ప్రశ్న. ఈ 8,500 కోట్లు రైతులకు పంపిణీ చేయాలంటే కొన్ని రాష్ట్రాలనైనా మినహా యించాలి లేదా కొందరు రైతులనైనా కుదించాలి. లేదం టే నిష్పత్తి దామాషాలో పంపిణీ చేయాలి. అలా చేస్తే వంద రూపాయలు బాకీ ఉన్న రైతుకి సుమారుగా 38 రూపాయలే అందుతుంది. అందువల్ల రైతుల ఇబ్బం దులు తీరతాయా? ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడగలడా? 

ఇథనాల్ ఉత్పత్తికి కేంద్రం సుముఖత వ్యక్తం చేయటం శుభసూచకం. అయితే, అది అంత సులువైన విషయం కాదు. ఇథనాల్ ఉత్పత్తి ప్రక్రియ ఈనాటిది కాదు. పాతికేళ్ళకు ముందే మనదేశంలో మొదలైంది. 15 ఏళ్ళ క్రితమే ఆంధ్రదేశంలో ప్రారంభించబడింది. ఎంత వరకు ముందుకు సాగింది? ఎంత ఆదాయం సమకూర్చ గలిగింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. బ్రెజిల్ లాంటి దేశం ఇథనాల్ ఉత్పత్తి కోసమే చెరకు పండిస్తు న్నారు. మనదేశంలో అదనంగా ఉత్పత్తయిన చెరుకుకు ఇథనాల్ తయారీకి ఉపయోగిస్తామని మంత్రి చెపుతున్నా రు. బ్రెజిల్  పెట్రోలులో 25 శాతం ఇథనాల్ కలిపి వాడే ప్రక్రియ 10 ఏళ్ళ క్రితమే మొదలైంది. అక్కడ పండే చెరుకులో 30 నుంచి 35 శాతం ఇథనాల్ ఉత్పత్తికే తరలిస్తున్నారనే సమాచారం ఉంది. మనదేశంలో పెట్రో లులో 5 శాతం మాత్రమే డీజిల్ కలిపి, వినియో గించాలనే నిబంధన చాలాకాలం కొనసాగింది. 10 శాతంకు పెంచటానికి యు.పి.ఎ. ప్రభుత్వం మీన మే షాలు లెక్కించింది. ఎన్.డి.ఎ. అధికారంలోకి వచ్చి నాలు గేళ్ళు గడిచాకైనా ఇథనాల్ ఉత్పత్తి వైపు కేంద్రం దృష్టి సారించటం శుభసూచకమే. ఇథనాల్ ఉత్పత్తి పెంచటం సులువే. అందుకవసరమైన ముడిసరుకును పుష్కలంగా అందించగల రైతులున్నారు. ఉత్పత్తి చేయ గల పరిశ్రమ లున్నాయి. వాడకం విషయంలో ఇబ్బంది తప్పకుండా ఎదురవుతుంది. ఇథనాల్ వాడకం పెరిగితే పెట్రోలు వాడకం తగ్గితీరుతుంది. అందుకు ఆ పరిశ్రమాధిప తులు అంగీకరించారు. గతంలో జరిగింది కూడా అదే. పెట్రో పరిశ్రమాధిపతులకు వ్యతిరేకంగా కేంద్రం ముం దుకు సాగలేక ఇథనాల్‌ను త్రిశంకుస్వర్గంలో వుంచింది. 

- దాసరి ఆళ్వారస్వామి

English Title
Sugarcane farmer between hope despair
Related News