చక్కెర తింటే మధుమేహం రాదు

Updated By ManamSat, 06/09/2018 - 11:23
Sugar Not Linked To Diabetes

Sugar Not Linked To Diabetesమధుమేహం.. వాడుక భాషలో చెప్పాలంటే ‘చక్కెర వ్యాధి’. తియ్యగా శరీరాన్ని అటాక్ చేసి.. తియతియ్యగా శరీరంలోని అవయవాలను ప్రభావితం చేస్తుంది. మధుమేహం ఉన్నవాళ్లు చక్కెర, తీపి పదార్థాలు తినకూడదు అని చెబుతుంటారు. వాస్తవమే.. మధుమేహం ఉన్నోళ్లు తీపి పదార్థాలు తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. ఇంకో విషయమేంటంటే.. చక్కెర తింటే మధుమేహం వస్తుందంటుంటారు. అది మాత్రం నిజం కాదంటున్నారు పరిశోధకులు. చక్కెర వల్ల చక్కెర వ్యాధి రాదంటున్నారు. మరి, ఎలా వస్తుంది అనే కదా డౌటు..

మధుమేహం రెండు రకాలు టైప్ 1, టైప్ 2. టైప్ 1 మధుమేహం క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ కణాలను మన సొంత రోగ నిరోధక వ్యవస్థ నాశనం చేయడం వల్ల వస్తుంది. టైప్ 2 మధుమేహం.. క్లోమ గ్రంథి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల, ఉత్పత్తి చేసినా దానిని శరీరం వినియోగించుకోలేకపోవడం వల్ల వస్తుంది. ఎలా వచ్చినా కామన్ రిజల్ట్ మాత్రం.. ఒకటే. శరీరంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోతాయి. అలాంటప్పుడు చక్కెర పదార్థాలు తినకూడదు. కానీ, రెండు సందర్భాల్లోనూ చక్కెర తినడం వల్ల మధుమేహం రాదు అని అంటున్నారు పరిశోధకులు. దానికి ప్రధాన కారణం మారుతున్న జీవన విధానం, ఆహారపుటలవాట్లేనంటున్నారు. మధుమేహానికి ప్రధాన కారణం ఊబకాయమని చెబుతున్నారు.

నేటి తరం జంక్ ఫుడ్‌కు బాగా అలవాటు పడిపోవడంతో బరువు పెరిగిపోతున్నారని చెబుతున్నారు. అయితే, చక్కెరతో మధుమేహం రాదంటూనే పరోక్షంగా అది చక్కెరతో ముడిపడి ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఊబకాయానికి ప్రధాన కారణం తింటున్న ఆహారమే. జంక్ ఫుడ్‌ల వల్ల అది మరింత తీవ్రమవుతోంది. ఆ జంక్ ఫుడ్‌లలో చక్కెర మోతాదులు ఉంటున్నాయి. ఆ చక్కెర వల్ల ఊబకాయం వస్తుంది. ఆ ఊబకాయం మధుమేహానికి దారి తీస్తుంది. ఇలా మధుమేహంతో చక్కెరకు పరోక్ష సంబంధం ఉందని చెబుతున్నారు.

అయితే, నేరుగా చక్కెర వల్ల మధుమేహం మాత్రం రాదని అంటున్నారు. కానీ, మధుమేహం ఉన్నవాళ్లు చక్కెర పదార్థాలు, తీపికి  కొంచెం దూరంగా ఉంటేనే మంచిది అని సూచిస్తున్నారు. పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, రోజూ కొద్ది మోతాదుల్లో తీసుకుంటే మంచిదని, మొత్తం దూరం పెట్టాల్సిన అవసరం లేదని, సమతుల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. 

English Title
Sugar Not Linked To Diabetes
Related News