భూవివాదాలకు పరిష్కారం

Updated By ManamTue, 06/19/2018 - 02:07
ktr
  • 15 రోజుల్లోగా అన్ని సమస్యలు పరిష్కరించండి.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటీఆర్

  • 20 కాలనీల భూవివాదాలపై సమగ్ర సమీక్ష.. వక్ఫ్ భూములకు సంబంధించి త్వరలో భేటీ

ktrహైదరాబాద్ సిటీ:  ఎల్బీనగర్ నియోజకవర్గంలో దశాబ్ధకాలంగా ఉన్న భూవివాదాలకు పరిష్కారం లభించనుంది.  రాష్ట్ర  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చొరవతో ఎన్నో ఏళ్లుగా కొలిక్కిరాని సమస్యలు పదిహేను రోజుల్లో పరిష్కారం కానున్నాయి.  ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. బీఎన్‌రెడ్డి నగర్, సాహెబ్‌నగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఎల్‌బీనగర్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రెవెన్యూ శాఖమంత్రి మహమూద్ అలీతో కలిసి కేటీఆర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 20 కాలనీలు, బస్తీలకు చెందిన వివాదంలో ఉన్న భూములపై క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అసైన్‌డ్, వక్ఫ్, ఎండోమెంట్స్, ఎఫ్‌టీఎల్‌లకు సంబంధిత వివాదాలు అధికంగా ఉన్నాయని, వీటిలో పాలన సంబంధిత అంశాలను పదిహేను రోజుల్లోగా పరిష్కరించనున్నట్టు స్పష్టం చేశారు. ఆర్డీవో స్థాయిలో కేవలం రికార్డుల సవరణ చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయని, ఈ రికార్డులను వెంటనే సవరించాలని ఆర్డీవోలను ఆదేశించారు. అదే విధంగా చట్టాలను సవరించాల్సి వస్తే వాటికి సంబంధించి తీర్మానాలను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చింశీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేపట్టే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల విషయంపై తగు అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. వక్ఫ్ భూముల వివాదాలకు సంబంధించి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి తగు నిర్ణయం చేపడతామని, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులకు కేటాయించిన భూములను విక్రయాలు జరిపి పదేళ్లకు పైగా ఉన్న నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనువుగా ఎన్‌వోసీలను జారీచేయడానికి చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. అయితే చెరువుల ఎఫ్.టి.ఎల్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో, కన్జర్వేషన్ జోన్లలో ఉన్న నిర్మాణాలపై జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. మన్సూరాబాద్ సర్వే నెం-44,45లలో సీలింగ్ భూముల్లో ఉన్న నిర్మాణాలకు 2007లో ఉన్న రిజిస్ట్రేషన్  విలువ ప్రకారం క్రమబద్ధీకరించాలని ఆయా కాలనీలవాసులు విజ్ఞప్తి చేయగా ఈ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. నాగోల్ సాయి నగరంలోని 101,102 సర్వేలలో ఉన్న 1952 ఇళ్లకు సంబంధించి భూ రికార్డులలో తప్పుగా పేర్కొన్నందున ఇప్పటికీ సమస్యగా ఉన్నందున వెంటనే ఈ రికార్డులను పదిహేను రోజుల్లోగా సవరించాలని రంగారెడ్డి ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్‌వీరెడ్డిని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నందున ఎఫ్.టీ.ఎల్, కన్జర్వేషన్ జోన్ల జోలికి తాము వెళ్లమని స్పష్టం చేశారు. గ్రీన్ పార్కు కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న 3,200 గజాల స్థలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని కార్పొరేటర్ ఎం.శ్రీనివాసరావు చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ ఈ భూమి విషయంలో ఏ విధమైన వివాదం లేకపోతే నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిం దిగా జోనల్ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. 58,59 జీ.వోల కింద గతంలో దరఖాస్తు చేసుకోనివారికి మరో సారి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహ న్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి, సీసీఎల్‌ఏ రాజేశ్వర్ తివారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ ఎన్‌వీరెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags
English Title
Settlement of landlord




Related News