ఆశావాదం

Updated By ManamSun, 11/04/2018 - 07:00
story

storyఎన్నికల తేదీలు ప్రకటించడంతో ఊరిలో మైకు సెట్లు, గోడ మీద పోస్టర్లు, బ్యానర్లు, నాయకుల కటౌట్లతో హడావిడి మొదలైంది. చిన్నపాటి తిరునాళ్లలా ఉంది ఊరిలో వాతావరణం. ఊళ్లో కుర్రాళ్లకి అభ్యర్థుల వెంట తిరిగి నాలుగు రాళ్లు సంపాదించే సమయం ఇదే కాబట్టి రోజూ ఏదో ఒక పార్టీ తరపున ఇంటికి వచ్చి వెళ్తున్నారు, తప్పకుండా తమ పార్టీకే ఓటు వెయ్యాలని. ‘ఎందుకు ఈ హడావిడి? మా జీవితాల్లో ఏం మార్పు వస్తుంది గనుక?’ అనుకున్నాను నేను.story ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి అరచేతిలో స్వర్గం చూపించిన నాయకులే కానీ తమ మాటలు నిలబెట్టుకున్న వాళ్లు ఒక్కరు లేరు. మా నియోజకవర్గంలో మా ఊరితో కలుపుకొని ఎన్నో ఊళ్లలో తాగునీటి ఎద్దడి ఉంది. పిల్లల కోసం సరైన బడి లేదు. బస్సులొచ్చి వెళ్లటానికి సరైన రోడ్లు లేవు. ఎన్నికలు వచ్చాయి, వెళ్లాయి. కానీ మా కనీస అవసరాలని కూడా పట్టించుకున్న నాయకుడే లేడు. అందుకే ఈ నైరాశ్యం. ఒక రోజు కొంత మంది కుర్రాళ్లు మా ఇంటికి వచ్చారు. వాళ్లలో ఒకబ్బాయి ‘‘నా పేరు రవి అండి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రేపు మార్కెట్ సెంటర్లో ప్రజలతో మాట్లాడటానికి ఒక సభ ఏర్పాటు చేశాం. మీరు తప్పకుండా రావాలి’’ అని ఆహ్వానించి వెళ్లిపోయాడు. చూడ్డానికి ఆ అబ్బాయి చాలా చిన్నవాడిలా ఉన్నాడు. నిండా ముప్పై ఏళ్లు కూడా ఉండవేమో. ‘ఎందుకు వీళ్లకి ఈ రాజకీయాల గొడవ?’ అనుకున్నాను. ఢిల్లీలో ఇంజనీరింగ్ చదువుతున్న మా అబ్బాయి వంశీ సెలవులకి ఇంటికి రావడంతో మా ఆవిడ పిండి వంటలు చేసే కార్యక్రమం తలపెట్టింది. కిరాణా సామానుల కోసం వంశీ, నేను మార్కెట్‌కి వెళ్లాం. అదే సమయంలో నిన్న వచ్చిన కుర్రాడి సభ జరుగుతోంది. వంశీ ఆగుదాం అంటే సభ దగ్గర ఆగాం. పెద్దగా జనం లేరు. స్టేజి లాంటిది కూడా లేదు. ఆ అబ్బాయి దిమ్మ మీద నిల్చుని మాట్లాడుతున్నాడు. తను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చిందీ, తాను చేద్దామనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాల గురించీ చెప్పాడు. 

‘‘నాన్నా! రవి మా ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థి. చాలా తెలివిగలవాడు. ఆదర్శ భావాలున్న మనిషి. కాలేజి రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా ఉంటూ అందరికీ అండగా ఉండేవాడు. సమాజానికి ఏదన్నా చెయ్యాలన్న తపన తనలో అప్పట్లోనే ఉండేది. సంవత్సరానికి యాభై లక్షలు పైనే జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాడు. రవి వాళ్లది మన పక్క ఊరే నాన్నా.. సాతులూరు. అతను పోటీ చెయ్యడం మన అదృష్టం. అతను గెలిస్తే మన నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చినట్టే’’ అన్నాడు వంశీ. ‘‘రాజకీయాలు ఎవరినైనా మార్చేస్తాయిరా వంశీ. స్వలాభమే కానీ ప్రజల గురించి ఎవరూ పట్టించుకోరు’’ అన్నాను నేను, నా ధోరణిలో. ‘‘నాన్నా! మన కోసం ఏమి చెయ్యనివాణ్ణి ఏం అనం. పైగా వెళ్లి వాడికే ఓటేసి గెలిపిస్తాం. ‘మంచి చేస్తాను, అభివృద్ధి తీసుకు వస్తాను’ అని ఎవరన్నా ముందుకి వస్తే వాణ్ణి అనుమానిస్తాం, అపనమ్మకంగా మాట్లాడతాం. ఇలా అయితే మనం ఎప్పటికీ బాగుపడం నాన్నా’’ అన్నాడు వంశీ.  ‘‘నీ చిన్నప్పుడు గుర్తుంది కదా.. ఒకసారి కలుషితమైన నీళ్లు తాగి వందమందికి పైగా చనిపోయారు. అప్పుడు మనకి కనీసం మంచి రోడ్లు ఉండి, రవాణా సౌకర్యం ఉండి ఉంటే కొంత మందినైనా బతికించుకునే వాళ్లం. పేరుకి వచ్చి పరామర్శించిన నాయకులే కానీ, మన సమస్యల్ని పరిష్కరించిన వాళ్లు లేరు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో ప్రతి నాయకుడు అది చేస్తాం, ఇది చేస్తాం అని మాటలు చెప్పిన వాడే కానీ ఒక్కడు కూడా చేతల్లో చూపించలేదు. ఇంక ఎలా నమ్మమంటావ్?’’ అడిగాను. ‘‘నమ్మాలి నాన్నా నమ్మాలి.. వంద సార్లు మోసపోయాం కదా అని నమ్మడం మానేస్తే మన బతుకుల్లో మార్పు వచ్చే అవకాశమే ఉండదు. వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు.. అని మన న్యాయశాస్త్రం ఎలా చెప్తుందో అలానే వంద మంది నాయకులు మోసం చేశారు కదా అని ఒక మంచి నాయకుణ్ణి నమ్మడం మానెయ్యకూడదు. అదే ఆశావాదం. నాన్నా.. మనం మధ్య తరగతి వాళ్లం. ఎంత కష్టపడినా మధ్యతరగతిలోనే ఉంటాం కదా అని కష్టపడటం మానేస్తున్నామా.. లేదు కదా. ఎందుకంటే మనం ఆశాజీవులం. మన జీవితాన్ని మెరుగు పర్చుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాం. అదే ఆశావాదంతో మనకి ఒక మంచి నాయకుడు వస్తాడు అని నమ్ముదాం. నువ్వే అన్నావ్ కదా మాటలే కానీ చేతల్లో చూపించిన వాడు ఒక్కడు లేడని. అందుకే పోయేదేముంది. ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఓటు ఈ సారి రవికి వేద్దాం’’ అన్నాడు దృఢంగా.

‘‘ఏమోరా వంశీ.. ఈ మాటలు అన్నీ నీకు కొత్తేమో కానీ, నేను ఇలాంటివి ఎన్నో చూశాను. ప్రజలకి ఆవగింజంత కూడా ఉపయోగపడిన వాడు లేడు. ఉడుకు రక్తం వల్ల అలా మాట్లాడుతున్నావ్. ఒక రెండు ఎన్నికలు చూస్తే నీకే అర్థమవుతుంది. అప్పుడు నువ్వే చల్లబడతావ్. సర్లే పద, ఇప్పటికే ఆలస్యం అయింది. ఇంటి దగ్గర మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది’’ అని ఇంటి వైపు నడిచాను. రవి వెంట తిరగ సాగాడు వంశీ. ప్రతిరోజూ రాత్రి భోజనాల సమయంలో రవి గురించి, అతను చేస్తానని చెప్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించే వాడి మాటలన్నీ.

‘‘ప్రచారం చివరి రోజుల్లో ఉంది నాన్నా. తిరగాల్సిన ఊళ్లూ చాలా ఉన్నాయి. అందరం డబ్బులు వేసుకుని వ్యాన్ మాట్లాడుకున్నాం. ఒక పది రోజులు ఇంటికి రాను. ప్రచారం అయిపోయాక ఇంటికొస్తాను’’ అన్నాడు వంశీ. ‘‘ఎందుకురా ఇవన్నీ నీకు.. ఇంటి పట్టున ఉండక..’’ అని మా ఆవిడ తల్లి ప్రేమతో అడ్డు చెప్పబోయినా, ‘‘వాడి ఇష్టానికి వదిలేయి జానకి’’ అని నేను అనడంతో మా ఆవిడ ఊరుకుంది. ఏదైనా స్వానుభవంతో నేర్చుకుంటే అది జీవితాంతం గుర్తుండి పోతుందని నా నమ్మకం. అందుకే వాడే తెలుసుకుంటాడులే అని నేను అడ్డు చెప్పలేదు. మర్నాడు వంశీ తెల్లవారక ముందే లేచి తయారయ్యాడు. వ్యాన్ వచ్చి మా ఇంటి ముందు ఆగింది. మా వాడు ఎక్కాక వ్యాన్ మా ఇంటి నుండి రెండు ఇళ్లు దాటగానే పశువుల కాపరి సుబ్బిగాడు వ్యాన్‌కి ఎదురుగా పరిగెత్తుకుని రావడంతో వ్యాన్ ఆగింది. కుర్రాళ్లందరూ కిందికి దిగారు. ‘‘అయ్యా.. తమరే సాయం చెయ్యాలయ్యా.. మా ఇంటి దానికి నొప్పులు ఎక్కువయ్యాయి. ఊళ్లో డాటరు బాబు ఇంకో రెండు గంటల లోపల పట్నం తీసుకెళ్లకపోతే పెద్ద ప్రాణానికే ప్రమాదం అన్నాడు.. కొంచెం తమరు పెద్ద మనసు చేసుకుని సాయం చేస్తే వ్యాన్‌లో మా ఆవిడని పట్నం తీసుకు వెళ్తాను అయ్యగారూ’’ అని వేడికోలుగా అడిగాడు సుబ్బిగాడు. మా ఊరి నుండి పట్నానికి రెండే బస్సులు ఉన్నాయి. ఒకటి తెల్లవారక ముందే ఉంటుంది. అది ఇందాకే వెళ్లిపోయింది. ఇంకోటి సాయంత్రం ఉంటుంది. ముందు మాట్లాడుకుంటే తప్పితే ఆటోలు కూడా ఊళ్లోకి రావు. ‘‘కుదరదు సుబ్బిగా. వేరే బండి చూసుకో. ఇది ఎలక్షన్ పార్టీ బండి. ఇంకా చాలా ఊళ్లు వెళ్లాలి మేము’’ అని చెప్పాడు డ్రైవర్. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారే కానీ ఎవరు ఏం మాట్లాడట్లేదు.  రవి సుబ్బిగాడి దగ్గరకి వచ్చి ‘‘నీ భార్య, పుట్టబోయే బిడ్డకి ఏం కాదు..’’ అని ధైర్యం చెప్పాడు.

‘‘అరే సుదీప్.. నీ డాక్టర్ డిగ్రీ ఉపయోగించే సమయం వచ్చింది. నువ్వు ఇతనితో వెళ్లు’’ అని తన ఫ్రెండ్ సుదీప్‌కు చెప్పి, ‘‘డ్రైవర్.. ఇతణ్ణి వెంటనే పట్నంలో హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లు. మేము వేరే ఏర్పాట్లు చేసుకుంటాం’’ అని చెప్పి వాళ్లని పంపించాడు. రవి స్నేహితుల్లో ఒక కుర్రాడు ‘‘అరే రవీ! మనకి ఎలారా? ఇంకో వెహికల్ కోసం మన దగ్గర డబ్బులు కూడా లేవు’’ అన్నాడు. ‘‘మన స్వార్థం చూసుకుంటే ఆ తల్లీబిడ్డలకి ఏమన్నా అయితే? రెండు నిండు ప్రాణాల్ని కాపాడలేకపోయాక మనం ఎన్నికల్లో గెలిస్తే ఎంత.. గెలవకపోతే ఎంత? మీ అందరిలోనూ వాళ్లకి సాయం చెయ్యాలనే ఉందన్న విషయం నాకు తెలుసురా. కానీ ‘మనకెలా?’ అన్న స్వార్థం అడ్డువచ్చి తటపటాయించారు. అందుకే మనందరి తరపున నేను ముందుకు వచ్చి మాట్లాడాను. మన స్వార్థాన్ని వదులుకున్నప్పుడే ప్రజలకు వాగ్దానం చేసిన నిస్వార్థమైన సేవను అందించగలుగుతాం’’ అని తన స్నేహితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు రవి. ‘‘ముందుకు వచ్చావ్ కాబట్టే నువ్వు నాయకుడివి అయ్యావ్‌రా’’ అని ఆట పట్టించారు స్నేహితులు. ‘‘నన్ను పొగిడింది చాల్లే కానీ జరగాల్సిన పని చూద్దాం. మన దగ్గర ఇప్పుడు డబ్బులు ఎక్కువ లేవు. సమయం కూడా లేదు. మనం ఇరవై మందిమి ఐదు జట్లుగా విడిపోయి తలా నాలుగు ఊళ్లు తిరుగుదాం’’ చెప్పాడు రవి. ‘‘రవీ! నువ్వు జనాలకి కొత్త. చాలా మందికి నీ ముఖం కూడా తెలీదు. అలాంటిది నువ్వు లేకుండా వెళ్లి అడిగితే ఎవరు మాత్రం మనకి ఓటు వేస్తార్రా?’’ అన్నాడు ఒక ఫ్రెండ్. ‘‘తెలుసురా.. కానీ ఈ పరిస్థితుల్లో ఇదొక్కటే పరిష్కారం లాగా కనిపిస్తోంది. పర్లేదురా.. నిరుత్సాహ పడకండి. మనం చెయ్యగలిగినంత చేద్దాం’’ అని వాళ్లని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశాడు రవి. ఇదంతా చూసిన, ముఖ్యంగా తన స్వార్థం చూసుకోకుండా వ్యాన్‌ని సుబ్బిగాడి కోసం పంపడం చూసిన నాలో రవి అంటే ఉన్న అపనమ్మకం పోయింది. ‘అతను గెలిస్తే బాగుండు.. వంశీ అన్నట్టు మాకు మంచి రోజులొస్తాయి’ అని చిన్న ఆశ కలిగింది. వేకువ సూర్యుడు మెల్లగా పైకి వస్తున్నాడు. నా మీద పడుతున్న ఆ సన్నని రవి కిరణాలు నాలో కల్గిన ఆ చిన్న ఆశకి ప్రతీకలుగా అనిపించాయి. నేను కూడా నా వంతుగా రవి తరపున ప్రచారం చేయదలచాను. 

ఇంతలో ఒక అద్భుతం జరిగింది. సుబ్బిగాడికి రవి చేసిన సాయం, రవికీ, తన స్నేహితులకీ జరిగిన సంభాషణ అంతా మాకు రెండు ఇళ్ల అవతల ఉండే టీవీ రిపోర్టర్ లాల్ తన సెల్ ఫోన్‌లో ఎప్పుడు వీడియో తీశాడో కానీ, అది వాళ్ల చానల్లో ప్రసారమైంది. రవి నేపథ్యం, అతని ఆశయాల గురించి కూడా టీవీలో చెప్పడంతో ఒక్కసారిగా రవికి వేలమంది అభిమానులు తయారయ్యారు. రాష్ట్రం నలుమూలల నుండి జనాలు.. ముఖ్యంగా కుర్రాళ్లు మా నియోజకవర్గానికి వచ్చి రవి తరపున ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఈ నాటకీయ పరిణామాల తర్వాత రవికి నియోజకవర్గంలో అనూహ్యమైన ప్రజాదరణ వచ్చింది. అతని గెలుపు దాదాపు ఖాయమైపోయింది. అనుకున్నట్లే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాడు రవి. గిర్రున మూడేళ్లు తిరిగిపోయాయి. ఈ మూడేళ్లలో ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు తక్కువే అయినా వాటిని సక్రమంగా వినియోగించాడు రవి. రోడ్లు వేసే పనిని కాంట్రాక్టర్లకి ఇవ్వకుండా ఒక స్వచ్ఛంద సంస్థకి అప్పగించడంతో చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన రోడ్లు పడ్డాయి. కూలీలుగా మా నియోజకవర్గం మనుషుల్నే తీసుకోవాలని ఒప్పందం చేసుకోవడంతో మా వాళ్లకి పని దొరికినట్టు కూడా అయింది. ఇప్పుడు బస్సులు, ఆటోలు వచ్చి వెళ్లడం సులభం అవడంతో ప్రయాణ సౌకర్యం బాగా మెరుగుపడింది. తన స్నేహితులు, దాతలు ఇచ్చిన విరాళాలతో పాఠశాల భవనాలు కట్టించాడు రవి. ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి పట్టణాల్లో ఉండే పేరు పొందిన ఉపాధ్యాయులతో కంప్యూటర్ ద్వారా వీడియో కోచింగ్ ప్రారంభించాడు. రైతులకి అధిక దిగుబడుల కోసం ఉపయోగించాల్సిన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కోసం వ్యవసాయ కాలేజీ ప్రొఫెసర్లతో సలహాలు, సూచనలు ఇప్పించాడు. వ్యవసాయ కాలేజీ విద్యార్థులు వాళ్ల ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా రైతులతో కలిసి పొలంలో పని చేసే ఏర్పాటు చేశాడు. ఇవి రైతుల పంట దిగుబడులు రెండింతలు కావడానికి దోహద పడ్డాయి. విద్యార్థులకి తాము తరగతి గదిలో నేర్చుకున్నది పొలంలో ఉపయోగించే అవకాశం కల్గింది. తీవ్ర విద్యుత్ కొరతకి పరిష్కారంగా సౌరశక్తితో పనిచేసే మోటార్లు, ఫ్యానులు, బల్బులు చౌక ధరల దుకాణాల ద్వారా తక్కువ ధరలకి పంపిణీ చేయించాడు. తాగునీటి కోసం నీటిని శుభ్రం చేసే ప్లాంట్‌ని కట్టించి రోజూ ప్రతి ఇంటికి నాలుగు బిందెల మంచి నీరు అందే ఏర్పాటు చేశాడు. మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయని నిరూపించాడు రవి. అవరోధాలు ఎన్ని ఎదురైనా తన సంకల్ప బలంతో వాటికి పరిష్కారాలు కనుగొన్నాడు. త్రికరణ శుద్ధిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడ్డాడు. నా జీవితంలో నిస్వార్థంగా, నిజాయితీతో ప్రజలకు సేవచేసే రాజకీయ నాయకుణ్ణి చూడగలనా అనుకున్నాను. ప్రజలచే ఎన్నుకోబడి, ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తూ, ప్రజల యొక్క నాయకుడిగా మా అందరి గుండెల్లో నిలిచాడు రవి. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏంటో మాకు తెలిసింది ఈ ఎన్నికల్లోనే. రవి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సూర్యుని కాంతి రేఖల వలె మా అందరి జీవితాల్లో వెలుగుని నింపుతున్నాయి. అందుకే ఆశావాదంతో జీవనం సాగిద్దాం. మార్పుని ఆహ్వానిద్దాం. అభివృద్ధికి బాటలు వేద్దాం.
సెల్: 5038032361

Tags
English Title
Optimism
Related News