మార్చి నెలాఖరు వరకు ఓ.ఎం.ఓలు కొనసాగుతాయి

rbi
  • బ్యాంకులకు లిక్విడిటీ సమకూర్చేందుకు ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నం

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు  ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ (ఓ.ఎం.ఓ) కొనుగోళ్ళ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోకి లిక్విడిటీని చొప్పించడాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) కొనసాగిస్తుందని దాని డిప్యూటి గవర్నర్ విరాల్ ఆచార్య చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బ్యాంక్ రూ. 1.36 ట్రిలియన్‌ల మేరకు ఓ.ఎం.ఓ కొనుగోళ్ళను నిర్వహించింది. గత మూడు నెలల్లోనే రూ. 1 ట్రిలియన్‌కు పైగా మొత్తం చొప్పించడం జరిగింది. లిక్విడిటీ అవసరాలు తీర్చేందుకు డిసెంబర్‌లో రూ. 40,000 కోట్ల మేర ఓ.ఎం.ఓ కింద ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్ళు జరుపుతామని ఆర్.బి.ఐ గత నెల చివరలో ప్రకటించింది. ‘‘ఓ.ఎం.ఓ కింద పెరుగుతున్న కొనుగోళ్ళ విడతలు, కొనుగోలు మొత్తాలు మార్చి ముగిసేవరకు అవసరం పడవచ్చని మేం భావిస్తున్నాం. కానీ, కచ్చితంగా ఎంత మొత్తాన్ని అమరుస్తారనేది చెలామణీలో ఉన్న కరెన్సీ నడతలో వచ్చే నిలదొక్కుకోగలిగిన మార్పులపైన, విదేశీ మారక ద్రవ్య అమ్మకాలు లేదా కొనుగోళ్ళను ఆర్.బి.ఐ ఎంత పరిమాణంలో నిర్వహించవలసి ఉంటుందనేదానిపైన ఆధారపడి ఉంటుంది. విదేశీ రంగ పరిస్థితులను బట్టి ఫారెక్స్ అవసరాలు నిరంతరం పరిణామం చెందుతూ ఉంటాయి’’ అని ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం అనంతరం బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆచార్య అన్నారు. బ్యాంకులకు ఇచ్చే రుణాల వడ్డీ రేటు (రెపో)ను మార్చకుండా ఆర్.బి.ఐ 6.5 శాతం వద్దనే ఉంచింది. లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (ఎల్.ఏ.ఎఫ్) ద్వారా ఎప్పుడూ ఉండే మార్గం ద్వారానే కాకుండా, టెరమ్ రెపో ద్వారా ఉదారంగా లిక్విడిటీని చొప్పించడానికి ఆర్.బి.ఐ అవకాశం కల్పించిందని ఆచార్య చెప్పారు. ‘‘తాత్కాలిక ద్రవ్యత డిమాండ్‌ను తీర్చేందుకు అదనపు దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలను నిర్వహించేందుకు కూడా మేం ప్రణాళిక రూపొందించాం. ముందస్తు పన్ను చెల్లింపుల్లో మూడో భాగం కారణంగా ఈ నెలలో రానున్న రోజుల్లో లిక్విడిటీకి డిమాండ్ ఏర్పడవచ్చు’’ అని ఆయన అన్నారు. నాన్-బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫినాన్స్ కంపెనీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ, ఆగస్టు నెలాఖరు నుంచి మార్కెట్ పరిణామాలను ఆర్.బి.ఐ గమిస్తూ వస్తోందని ఆచార్య అన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్లు వాటిలో మదుపు చేసిన వారికి చెల్లించవలసి వచ్చే మొత్తాలు, పర్యవసానంగా ఎన్.బి.ఎఫ్.సిలు, హెచ్.ఎఫ్.సిలకు ఏర్పడగల రిస్కులను మదింపు చేసేందుకు భారతీయ సెక్యూరిటీలు, ఎక్చ్సేంజి బోర్డు (సెబి)తో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని ఆచార్య చెప్పారు. 
 

Tags

సంబంధిత వార్తలు