నేరం కాదంటే.. ద్వేషం పోతుంది!

Updated By ManamThu, 07/12/2018 - 23:47
supreme-court
  • స్వలింగ సంపర్క చట్టంపై సుప్రీంకోర్టు

  • నేర భావన వల్లే సామాజిక ద్వేషభావం.. సెక్షన్ 377పై విచారణలో బెంచి వ్యాఖ్యలు

supreme-courtన్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరం కాదని ఒక్కసారి చెబితే.. ఎల్‌జీబీటీక్యూ వర్గాల పట్ల సమాజంలో ఉన్న ద్వేషభావం కూడా పోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ సమాజంలో ఉన్న వాతావరణం కారణంగా ఈ వర్గాల పట్ల వివక్ష తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఐపీసీ సెక్షన్ 377ను రద్దుచేయాలంటూ దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. స్వలింగ సంపర్కంలో ఉన్నవాల్లు ఇతరులకు ఉన్న హక్కులను పొందకుండా అడ్డుకునేలా ఏదైనా చట్టం, నిబంధన, నియమం లేదా మార్గదర్శక సూత్రాలు ఉన్నాయా అని పిటిషనర్ తరఫున వాదిస్తున్న మనేకా గురుస్వామిని ధర్మాసనం ప్రశ్నించింది. అలాంటివి ఏమీ లేవని అందుకు ఆమె బదులిచ్చారు. దాంతో.. అంగీకారంతో కూడిన స్వలింగ సంపర్కం నేరం కావడం వల్లే వాళ్లు సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నారని ధర్మాసనం చెప్పింది. ఇది నేరం కాదని ఒక్కసారి చెబితే, ఇక వాళ్లకున్న అడ్డంకులు, సామాజిక ద్వేషభావం అన్నీ పోతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టంలో ఉన్న కొన్ని అంశాలను బెంచి ప్రస్తావిస్తూ.. కేవలం లైంగిక కారణాలను చూపించి ఇలాంటివారిపై వివక్ష చూపడం తగదని స్పష్టం చేసింది. సెక్షన్ 377ను రద్దుచేసినంత మాత్రాన ఎల్‌జీబీటీక్యూ వర్గాల పట్ల వివిధ రంగాల్లో ఉన్న వివక్ష తొలగిపోదని సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ వాదించారు. కేవలం ఈ కారణం చూపించి వారికి సరైన వైద్య సంరక్షణ కూడా ఇవ్వడం లేదని, వైద్యనిపుణులు కనీసం వ్యక్తిగత రహస్యాలను కూడా సరిగా నిర్వహించడం లేదని జస్టిస్ మల్హోత్రా అన్నారు. వయోజనులు వ్యక్తిగతంగా, పరస్పర అంగీకారంతో చేసుకునే చర్యల గురించి నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నామని చెప్పిన కేంద్రం.. వారి మధ్య పెళ్లిళ్లు, దత్తత తీసుకోవడం లాంటి విషయాలను మాత్రం ప్రస్తుతం చర్చించకపోవడం మంచిదని సూచించింది. ఆ వాదనతో సుప్రీం ధర్మాసనం కూడా ఏకీభవించింది. తాము ఇతర అంశాలను విచారించడం లేదని, సెక్షన్ 377ను మాత్రమే చూస్తున్నామని తెలిపింది. 

English Title
Not guilty of hate!
Related News