‘విధాన’ విలయం

Updated By ManamTue, 08/21/2018 - 01:01
Kerala floods

imageప్రకృతి ప్రకోపానికి పర్యాటకుల స్వర్గ ధామం కేరళ కకావికలమై పోయింది. కుండపోత వర్షాలు, కనీవినీ ఎరుగని వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అధికారిక లెక్కల ప్రకారం 400 మందికి పైగా చని పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మృత్యువిలయ వాస్తవ అంచ నాలు అనూహ్యంగా ఉన్నాయి. ఈ ప్రకృతి బీభత్సాన్ని వెన్నంటి అనేక రోగా లు విరుచుకుపడనున్నాయని ఆందోళన చెందుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు, త్రివిధ దళాలు, అనేక స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో బాధి తుల రక్షణ, పునరావాసం కల్పించేందుకు అహోరాత్రుళ్లు కృషిచేస్తున్నా పరి స్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. కేరళ వరదల వల్ల ఆ రాష్ట్రంలో 300 కోట్ల డాలర్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. ఏనాడో 1924లో మూడు వారాలపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు సంభవించిన జల విల యంలో వెయ్యి మందికి పైగా కొట్టుకుపోయిన ఘోరకలిని నేటి ప్రకృతి విలయం గుర్తుకు తెస్తోంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రెండు వేల కోట్ల రూపాయలు అందించాలని కోరగా, కేంద్రం ప్రాథమిక సహాయంగా రూ. 500 కోట్లు ప్రకటించగా, అది సరిపోదని కేరళ వరదలను ‘జాతీయ విప త్తు’గా ప్రకటించాలని కాంగ్రెస్ అధ్యక్షులు చేసిన డిమాండ్‌కు సోషల్ మీడియా సహా అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

కేరళ రాష్ట్ర ప్రభుత్వం నీటి ప్రాజెక్టు నిర్వహణలో లోపభూయిష్టత కారణంగానే కేరళ జల విలయం సంభవించినట్లు నిపుణులు విమర్శిస్తున్నారు. 12 ప్రాజె క్టులలోనూ ప్రమాద స్థాయికి చేరేదాకా నీటి నిల్వ చేసి ఆ ప్రాజెక్టు గేట్లన్నిటినీ ఒక్కసారిగా తెరవడం వల్ల ప్రమాదకర వరదలు సంభవించాయని వారు చెబుతున్నారు. అనూహ్యంగా కుండపోత వర్షాలు కురుస్తున్నపుడే డ్యాం గేట్లను తెరచి నీటి ప్రవాహాన్ని వెళ్ళనిచ్చి ఉంటే ఈ దుస్థితి ఏర్పడి ఉండేది కాదు. ప్రాజెక్టుల మేనేజ్‌మెంట్ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని కేంద్రం చేతులు దులుపుకోవడం సరికాదు. వాతావరణ మార్పు, రుతుపవనాల వైప రీత్యం, అతివృష్టి-అనావృష్టి పరిస్థితులతో పోరు అనే అంశాన్ని కేంద్ర ప్రభు త్వమే జాతీయ విపత్తుగా పరిగణించి, దాన్ని ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వేగంగా అమలు చేయాలి. 

వాతావరణ మార్పు రీత్యా భారత్‌లో ఏకకాలంలోనే వరదలు, కరవు పరిస్థితులు సంభవించనున్నాయని వాతావరణవేత్తల హెచ్చరికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల అపార ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. 125 వాతావరణ జోన్‌లున్న భారత్ లో నాలుగు కోట్ల హెక్టార్ల సాగు భూమికి వరద ముంపు, 68 శాతం భూమికి కరవు ముప్పు పొంచివుందని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అదే విధంగా జర్మన్ వాచ్ సంస్థ 2017 నవంబర్‌లో విడుదల చేసిన అధ్య య నం ప్రకారం వాతావరణ మార్పుల దుష్ప్రభావానికి అత్యధికంగా గురయ్యే దేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో ఉందని వెల్లడించగా, ప్రకృతి ఉత్పా తాల సంఖ్యాపరంగా ప్రపంచంలోని తొలి నాలుగు దేశాలలో భారత్ ఒకటని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిస్తోంది. 2005-14 మధ్య కాలంలో భారత్ లో సంభవించిన 167 ప్రకృతి వైపరీత్య ఘటనలలో రూ. 3 లక్షల 25 వేల కోట్లు ఖర్చయినట్లు అంచనా. 1950-2016 మధ్య కాలంలో సంభవిం చిన వరదల సమాచారాన్ని కేంద్రం క్రోడీకరించి వరద ప్రాంతాల జాబితాలో పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్, యూపీ, ఏపీ, హర్యానాల తర్వాతి స్థానంలో కేరళ ఉందని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాబితాలో పేర్కొం ది. త్వరలో గోవాకు కూడా ఇదే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచివుందనిపర్యావరణవేత్త గాడ్గిల్ హెచ్చరించడం గమనార్హం.

ప్రకృతి వైపరీత్యాల వల్ల గానీ, మానవ తప్పిదాల వల్లగానీ, ప్రమాదాల వల్లగానీ అపార ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్’ను తీసు కొచ్చింది. అయితే అందులో జాతీయ విపత్తు, రాష్ట్రస్థాయి లేదా జిల్లాస్థాయి లేదా స్థానిక విపత్తులను సవ్యంగా నిర్వచించలేదు. జాతీయ విపత్తులు సంభ విస్తూ లక్షాలాది మంది మరణాలకు, కోట్లాది రూపాయల ఆస్తినష్టాలు సంభ విస్తున్న దేశంలో వాటిని నిర్వహించడానికి లేదా పిలవడానికి చట్టపరంగా, కార్యనిర్వాహకపరంగా ఎలాంటి నియమనిబంధనలు, కనీసం సూచనలు కూడా లేకపోవడం విచారకరం. ఆర్థిక సహాయాన్ని అందించడంలోనే కాకుం డా వరదలను జాతీయ విప త్తుగా పేర్కొనడంలోనూ రాజకీయ వివక్షలు కొనసాగడం క్షమించరానిది. 

‘దేవుని ఆవాసం’గా ప్రసిద్ధిగాంచిన కేరళలో సంభవించిన ప్రకృతి వైప రీత్యానికి స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులు, అక్రమ వ్యాపారుల అనుకూల ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం. పశ్చిమ కనుమల్లో పర్యావరణానికి హాని కలిగిస్తున్న అక్రమ మైనింగ్, ప్రైవేట్ తోటల పెంపకం నేడు కేరళలో (క)న్నీటి విలయంగా విరుచుకుపడింది. ప్రపంచ వారసత్వ సంపదగా, భూగోళంపై ‘మహాజీవ వైవిధ్య ప్రాంతం’గా ‘ఐక్యరాజ్య సమితి విద్య వైజ్ఞా నిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తించిన గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల తీరం వెంబడి లక్షా అరవై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1600 కిలోమీటర్ల పొడవున విస్తరించిన పశ్చి మ కనుమలు (సహ్యాద్రి పర్వత పంక్తులు) పర్యావరణ సంక్షోభంలో కూరు కుపోయాయి. హెక్టారు కంటె తక్కువగా వుండే క్వారీలకు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో పశ్చిమ కనుమల్లో రాళ్ళ గనులు (క్వారీ) అధికంగా ఉన్నా యి. ప్రస్తుత భూ వినియోగం, పర్యావరణ పరిరక్షణ అంశాలను పరిగణన లోకి తీసుకొని మొత్తం సహ్యాద్రి ప్రాంతాలకు చెందిన 1,37,000 హెక్టార్లను ‘పర్యావరణ సున్నిత ప్రాంతం’ (ఈఎస్‌జెడ్)గా 2011లో విడుదలైన మాధవ్ గాడ్గిల్ కమిటీ నివేదిక పరిగణించింది. అయితే క్వారీ యజమానులు, అక్రమ మైనింగ్ వ్యాపారుల వొత్తిడి కారణంగా గాడ్గిల్ నివేదికను ప్రభుత్వం కోల్డ్ స్టోరేజిలోకి పంపింది. కోర్టు జోక్యంతో గాడ్గిల్ నివేదిక అమలు కోసం ఒక వైధానికాన్ని రూపొందించమని కేంద్ర ప్రభుత్వం నియమించిన కస్తూరి రంగన్ కమిటీ 2013లో నివేదిక మానవ ఆవాసాలు, వ్యవసాయ భూములు, ప్లాంటేషన్లు (టీ, కాఫీ, రబ్బరు)ను మినహాయించి 60 వేల హెక్టార్లను ఈ ఎస్‌జెడ్‌గా లెక్కగట్టడం వివాదాస్పదంగా మారింది. దాంతో అక్రమ మైనింగ్  వ్యాపారుల కోసం సహ్యాద్రి పరిరక్షణ ప్రాంతం తగ్గించడంపై వివిధ ప్రజా సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మైనింగ్, ప్లాంటేషన్ తదితర అక్రమవ్యాపారాల కారణంగా సహ్యాద్రి విధ్వంసం కేరళ జల ప్రళయానికి కారణమైంది.

ఇలాంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో కొంతభాగం తూ ర్పున బంగాళాఖాతానికి సమాంతరంగా విస్తరించిన తూర్పు కనుమల విష యంలోనూ బాక్సైట్ తదితర అపార ఖనిజ నిక్షేపాల మైనింగ్ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తుండడం భవిష్యత్‌లో ప్రకృతి విలయానికి తప్పక దారితీస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపైన, సహాయ కార్యక్రమాలపైన ఎన్ని చర్చలు చేసినా వ్యర్థమే. ఆ వైపరీత్యాలు సంభవించేందుకు కారణమైన కా ర్పొరేట్ అత్యాశ పునాదిగా రూపొందిస్తున్న విధానాలను తక్షణం ఉపసంహ రించుకోవడం మినహా మరో పరిష్కారం లేదు.  కేరళ క‘న్నీటి’ ఉదంతం నేపథ్యంలో తూర్పు, పశ్చిమ కనుమల పరిరక్షణ ఉద్యమం నేడు తక్షణ ఎజెండాగా ముందు నిలిచింది. కేరళ విషాదం జాతీయ విపత్తు మాత్రమే కాదు, భూగోళ విపత్తుగానూ పరిగణిస్తేనే దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారాలు లభిస్తాయి. 

English Title
Nature irritation
Related News