టీడీపీపై మోత్కుపల్లి సమరం?

Updated By ManamWed, 06/13/2018 - 22:44
 Mothkuppalli
  • వ్యతిరేక ప్రచారానికి రెడీ.. పూర్తి మద్ధతుతో వైసీపీ ఆహ్వానం

  • అధికారంలోకి వస్తే రాజ్యసభ?.. టీఆర్‌ఎస్‌లో ఖరారు కాని సీటు

mothkupalliహైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఆంధ్రలో పర్యటించి, ప్రచారం చేస్తానని ఆ పార్టీ బహిష్కృత సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకునేం దుకు వైసీపీ పావులు కదుపుతోంది. ఏపీలో తప్పకుండా పర్యటన చేయాలని, ఈ పర్యటనకు తాము పూర్తి మద్దతునిస్తామన్న సంకేతాలను జగన్ తన అనుచరుల ద్వారా మోత్కుపల్లికి చేరవేస్తున్నారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయగానే బాబుపై మోత్కుపల్లి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

తిరుపతి వెంకటేశ్వరస్వామి కొండపైకి నడిసొచ్చి బాబును అధికారంలోకి రాకుండా చూడాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తానని కూడా మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఆ మెట్లపైనే తాను సచ్చిన పర్లేదుగానీ, బాబు అధికారంలోకి రావొద్దని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. పనిలో పనిగా సొంతంగా పార్టీలు పెట్టుకున్న జగన్, పవన్‌కళ్యాణ్ దమ్మున్న మొగొళ్లు అంటూ ప్రశంసించారు. ఈ విషయాన్ని పవన్ పట్టించుకోనప్పటికీ, వైఎస్సార్‌సీపీ మాత్రం మోత్కుపల్లి వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచింది. ఆంధ్రలో పర్యటిస్తానన్న ఆయన వ్యాఖ్యలను నిజం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

మోత్కుపల్లి ఇంటికి ఆంధ్ర నేతలు
ఆంధ్రలో చంద్రబాబునాయుడుపై విరుచుకుపడుతూ, జగన్‌కు పరోక్ష మద్దతును తెలుపుతున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల మోత్కుపల్లిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్న సంగతి విధితమే. చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్రమైన ఆరోపణలు చేసిన రెండో రోజే ముద్రగడ వచ్చి మోత్కుపల్లితో సమావేశంకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోత్కుపల్లిని తమ వైపు తిప్పుకునేందుకు ముద్రగడతో వైసీపీ రాయబారం నడిపిందని ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎంపీ, వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డి రెండ్రోజుల క్రితం భాగ్యనగరంలోని మోత్కుపల్లి ఇంటికి వచ్చారు. అప్పటికే అక్కడ మీడియా ప్రతినిధులు ఉండడంతో విజయసాయిరెడ్డి కారు దిగకుండానే అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో విజయసాయిరెడ్డి, మోత్కుపల్లి భేటీ వార్తలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. దళిత నాయకులను కలిస్తే తప్పేంటని, తాను ఇదివరకు మోత్కుపల్లిని కలవలేదుగానీ, త్వరలో తప్పకుండా కలుస్తానని విజయసాయిరెడ్డి ప్రతిస్పందించారు.

టీఆర్‌ఎస్‌లో సీటు డౌటేనా?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే కారు పికపిక అయ్యింది. అందులో సీనియర్ నేత మోత్కుపల్లికి తాను కోరుకున్న సీటు ఇవ్వడం టీఆర్‌ఎస్‌కు కష్టంగా మారింది. తాజాగా, వచ్చే ఎన్నికల్లో తాను ఆలేరు నుంచే బరిలోకి దిగుతానని మోత్కుపల్లి స్పష్టంచేశారు. ఇప్పటికే అక్కడ టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన గొంగిడి సునీత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగులకే సీట్లిస్తానని ప్రకటించిన కేసీఆర్, సునీతను కాదని మోత్కుపల్లికి సీటు ఇచ్చే అవకాశాలు లేవని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే, మోత్కుపల్లితో ఉన్న సత్సంబంధాలు, దళిత సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత కావడంతో మోత్కుపల్లి విషయంలో కేసీఆర్ సీరియస్‌గానే ఆలోచిస్తారని, ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ గెలిస్తే రాజ్యసభ సీటు!
ఏపీలో పర్యటనకు వైసీపీ హార్థిక, ఆర్థిక మద్దతునిచ్చిన మోత్కుపల్లికి పెద్దగా ఒరిగేదిమీ ఉండదు. టీడీపీ ఓడిపోయినా మోత్కుపల్లికి దక్కేదేంటి? ఇప్పుడు వాడుకోవాలని చూస్తున్న వైసీపీ కూడా ఎన్నికల తర్వాత మోత్కుపల్లిని పట్టించుకోకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లిని ఆకట్టుకునేందకు వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తాము అదికారంలోకి వస్తే రాజ్యసభ సీటు ఇచ్చి ఎంపీని చేస్తామని మోత్కుపల్లికి వివరించేందుకే విజయసాయిరెడ్డి మోత్కుపల్లి నివాసానికి వచ్చారన్న చర్చ కూడా సాగుతోంది. టీఆర్‌ఎస్‌లో స్థానం ఖరారు కానందున, వైఎస్సార్‌సీపీలో చేరాలని, పార్టీని తెలంగాణలో ముందుండి నడిపించాలన్న ఆహ్వానాన్ని కూడా విజయసాయిరెడ్డి మోత్కుపల్లికి అందిస్తుండొచ్చు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు, సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగిన మోత్కుపల్లి వైసీపీ ఆహ్వానాన్ని మన్నిస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

ఆలేరు నుంచే బరిలోకి...
చంద్రబాబుపై మోత్కుపల్లి మరోసారి మండి పడ్డారు. తిరుమల వెంకన్నను దర్శించుకుని చంద్ర బాబు ఓడించాలని కోరుతానని పునరుద్ఘాటిం చారు. జగన్‌తో కుమ్మక్కయ్యానని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, తానే చంద్రబాబును ఓడించాలని చెబుతున్నానన్నారు. ఆలేరు ప్రజల కోరిక మేరకు తాను వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచే పోటీ చేస్తానని మోత్కుపల్లి స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి, తనకు మద్దతుగా నిలుస్తున్నారని మోత్కుపల్లి తెలిపారు.

English Title
Mothkuppalli Samaram on TDP?
Related News