తక్కువ అప్పు చేయనున్న కేంద్రం

Updated By ManamSun, 09/30/2018 - 00:48
rupee

Centre-lowers...న్యూఢిల్లీ: కేంద్రం 2019 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సేకరించదలచిన రుణ మొత్తాన్ని తగ్గించుకుంది. అది బడ్జెట్ పెట్టుకున్న లక్ష్యంలో కన్నా రూ. 70,000 కోట్ల తక్కువగా రుణాన్ని సేకరించదలచింది. ద్రవ్య లోటు (ఖర్చుకు ఆదాయానికి మధ్యనుండే తేడా)ను పూడ్చుకునేందుకు అది ఈ రుణాన్ని సేకరించదలచింది. కేంద్రం 2018 అక్టోబర్-2019 మార్చి మధ్య కాలంలో సేకరించదలచిన రుణ మొత్తాన్ని తగ్గించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐల మధ్య శుక్రవారంనాడు జరిగిన సమావేశంలో నిర్ణయించారు. స్థూలంగా రూ. 6.05 లక్షల కోట్లు అప్పు చేయడానికి 2018-19 కేంద్ర బడ్జెట్ వీలు కల్పిస్తోంది. దానిలో రూ. 2.88 లక్షల కోట్లను మొదటి ఆరు నెలల్లో సేకరించారు.  ద్వితీయార్థంలో రూ. 2.47 లక్షల కోట్లను సేకరించాలని నిర్ణయించారు.  దీనితో మొత్తం రుణం రూ. 5.35 లక్షల కోట్లకు మాత్రమే చేరుతుంది. ‘‘ద్రవ్య లోటుపై ఏ విధమైన ప్రభావం లేకపోవడం వల్ల నికర రుణ సేకరణ కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. అయితే, బైబ్యాక్ కార్యక్రమంపైన కూడా మేం కొంత పునరాలోచన చేశాం. చిన్న పొదుపు పథకాల నుంచి మరికొన్ని నిధులు వస్తాయని మేం భావిస్తున్నాం. దాంతో మొత్తం రుణ అవసరాన్ని తగ్గించాలని మేం నిర్ణయించాం’’ అని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ అన్నారు. 

బడ్జెట్ అంచనాలకు తగ్గట్లుగా రెవిన్యూ ఉండగలదని ఆయన చెప్పారు. 
‘‘ఇక ఖర్చు విషయానికి వస్తే కనీస మద్దతు ధర, ఆయుష్మాన్ భారత్‌ల ఖర్చులను లెక్కలోకి తీసుకున్న తర్వాత కూడా, వ్యయం అదుపు తప్పలేదు. మనం సరైన గాడిలోనే ఉన్నాం. కనుక, ద్రవ్య లోటును సవరించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు’’ అని గర్గ్ అన్నారు. ద్రవ్య లోటు జి.డి.పిలో 3.3 శాతం మించకూడదని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 70,000 కోట్ల తగ్గింపు వల్ల ఏర్పడే వెలితిని బైబ్యాక్‌లు తగ్గించుకోవడం, చిన్న పొదుపు పథకాల నుంచి వచ్చే అదనపు నిధుల మిశ్రమం ద్వారా భర్తీ చేసుకుంటామని గర్గ్ చెప్పారు. 

ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్‌డ్ బాండ్లు
ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్‌డ్ బాండ్లను పునః ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రిటైల్ ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉండే అటువంటి సాధనాలను సురక్షితమైనవిగా భావిస్తారు. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ఎగువకు సవరిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. కనుక వాటిలోకి వచ్చే నిధులు పెరగవచ్చు. రుణాన్ని తగ్గించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయం ఆ విధమైన అంచనాలకు తగ్గట్లుగానే ఉందని ‘ఇక్రా’లో ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ అన్నారు.

Tags
English Title
The lowest debt center
Related News