పన్ను ఆదా కోసం ఈ ఫండ్స్ వైపు చూడండి

Tax

న్యూఢిల్లీ: పన్ను భారమనేది పన్ను చెల్లించే వారికే తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో పన్ను మినహాయింపు అందించే సాధనాలు చాలానే ఉంటాయి. అయితే ఈఎల్‌ఎస్‌ఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటిల్లో పన్ను ఆదాతోపాటు రాబడి కూడా పొందొచ్చు. 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు కల్పించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్‌ఎస్‌ఎస్) కోసం ఇన్వెస్టర్లు ఇప్పటికే వేట ప్రారంభించి ఉంటారు. సుదీర్ఘ కాలంలో అధిక రాబడులు అందిస్తాయనే లక్ష్యంతో ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో ఇన్వెస్ట్ చేయవద్దంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈక్విటీ స్కీమ్స్‌లలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఈక్విటీ అనేది రిస్క్‌తో కూడుకున్న అంశమని, స్వల్ప కాలంలో ఒడిదుడుకులు ఉండొచ్చని హెచ్చరించారు. అదే సమయంలో దీర్ఘకాలంలో మంచి రాబడులను అందుకోవచ్చని పేర్కొన్నారు. అయితే కేవలం అధిక రాబడులే లక్ష్యంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదని తెలిపారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు దూరంగా ఉండటం ఉత్తమమని పేర్కొన్నారు. ఈ ఫండ్స్ ఎక్కువగా స్టాక్స్‌లోనే పెట్టుబడులు పెడతాయని తెలిపారు. దీనివల్ల రిస్క్ తీసుకోలేని వారు వీటికి బదులు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, బ్యాంక్ డిపాజిట్లు వంటి ఇతర సాధనాల వైపు మొగ్గు చూపడం ఉత్తమమని సూచించారు.  ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుందనే విషయాన్నిగుర్తు పెట్టుకోవాలని నిపుణులు తెలిపారు. లాకిన్ పీరియడ్ మూడేళ్లే కాదా అని వీటిల్లో పెట్టుబడులు పెట్టకూడదని, కనీసం 5-7 ఏళ్ల లక్ష్యంతో ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈఎల్‌ఎస్‌ఎస్ మంచి ఇన్వెస్ట్‌మెంట్ సాధనమని తెలిపారు. లాకిన్ పీరియడ్ ముగిసిన వెంటనే వీటి నుంచి ఇన్వెస్ట్‌మెంట్లను వెనక్కు తీసుకోవలసిన అవసరం లేదన్నారు. స్కీమ్ మంచి పనితీరు కనబరిచే వరకు మీ పెట్టుబడులను కొనసాగించాలని సలహా ఇచ్చారు.ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. మోతీలాల్ ఓస్వాల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96, ఎల్‌అండ్‌టీ ట్యాక్స్ అడ్వాంటేజ్, హెచ్‌డీఎఫ్‌సీ లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్, యాక్సిస్ బ్యాంక్ టర్మ్ ఈక్విటీ ఫండ్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని నిపుణులు వివరించారు. 
 

Tags

సంబంధిత వార్తలు