శత వసంతాల శబ్దానుశాసన నిలయం

Updated By ManamSat, 06/23/2018 - 20:59
Libraries made key roles during national war

తెలుగునాట సారస్వత వికాసంతో పాటు జాతీయోద్యమంలో అత్యంత కీలక పాత్రను పోషించాయి గ్రంథాలయాలు. కేవలం విజ్ఞాన కేంద్రాలుగానే కాక ఉద్యమ కేంద్రాలుగా సమాజాన్ని, ప్రజలను ఏకీకృతం చేయడం కోసం తీవ్రంగా కృషి చేశాయి. భారత జాతీయోద్యమ స్ఫూర్తి.. తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయోద్యమాన్ని సుసంపన్నం చేసింది.

Libraries made key roles during national warనిజాం నిరంకుశ పాలనలో, తెలుగు చదవడం, రాయడం నేరంగా ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో తెలుగును రక్షించేందుకూ, తెలుగువారి మదిలో విజ్ఞాన జ్యోతులు వెలిగించేందుకూ ఏర్పడిందే శబ్దానుశాసన ఆంధ్రభాషా నిలయం. ఇది గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా ఏర్పడిన జ్ఞాన భాండాగారం, పుస్తకాల నెలవు. ఆ రోజుల్లో తెలంగాణలో నిజాం వ్యతిరేక ఉద్యమానికీ, స్వాతంత్య్రోద్యమానికీ, తెలుగు భాషను పరిరక్షించేందుకూ ఎంతగానో ఉపకరించిన ఈ గ్రంథాలయం.. తెలంగాణ ప్రజలను ఐక్యం చేయడంలో, వారిని సంఘటిత పరచడంలో కీలక పాత్ర పోషించింది. అందువల్లే ఈ పుస్తకాలయంపై నిజాం ప్రభుత్వం నిఘా పెట్టింది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్లులో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలకు, తిరుగుబాట్లకు బీజాలు గ్రంథాలయాల్లోనే పడుతున్నాయని భావించిన ప్రభుత్వం ఈ గ్రంథాలయం పైనా, గ్రంథాలయోద్యమం పైనా అనేక ఆంక్షలు విధించింది.

మహాభారతాన్ని తెనిగించిన కవుల్లో ప్రథముడు, వాగనుశాసనుడు, ఆదికవి అయిన నన్నయ పేరిట ఓరుగల్లు పట్టణంలోని మట్ట్టెవాడలో తూము రంగయ్య, ఆకారపు భద్రయ్య, కొండూరి బసవయ్య తదితరులు వందేళ్ల క్రితం 1918 మే 22న ‘శబ్దానుశాసన ఆంధ్ర భాషా నిలయం’ను ప్రారంభించారు. దీనికి ప్రప్రథమ అధ్యక్షులైన ముదిగొండ శంకరాద్యుల వారు బహూకరించిన శతాధిక గ్రంథాలతో ఇది మెుదలైంది. 1921లో ఈ గ్రంథాలయ అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను రూపొందించారు. అందులో భాగంగా పక్కా భవనం నిర్మించాలని చేసిన ప్రయత్నాలు అనివార్య కారణాల వల్ల అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రణాళికను చర్చించేందుకు ఏర్పాటుచేసిన సమావేశంలో తాము నివాసం ఉంటున్న సొంత ఇంటిని గ్రంథాలయం కోసం దానం చేయగలనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు శంకరాద్యులు. మరుసటి రోజే వీలునామా పత్రాన్ని రాసిచ్చారు. దాదాపు 50 సంవత్సరాల పాటు ఆ భవనంలోనే గ్రంథాలయం విజ్ఞాన కాంతులను విరజిమ్మింది!

పేరు మారిన గ్రంథాలయం
Libraries made key roles during national warగరిమెళ్ల సత్యనారాయణ ఈ గ్రంథాలయానికి దాదాపు 1500 గ్రంథాలు బహూకరించారు. స్థానికంగా ఉన్న వర్తక సంఘం, మిల్లుల సంఘం వాళ్లు ప్రతి ఏటా విరాళాలు ఇచ్చి గ్రంథాలయాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేశారు. అందులో నిత్యం సాహిత్యం, కళలు, తెలుగు భాషా జ్ఞానానికి సంబంధించిన సభలు, సమావేశాలు జరుగుతూ వచ్చాయి. 1943లో గ్రంథాలయ రజతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రత్యేక సంచికను ప్రచురించారు. అప్పటికి గ్రంథాలయంలో 22,553 పుస్తకాలున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. అయితే తర్వాత 20 సంవత్సరాల కాలం ఈ గ్రంథాలయ పురోగతి నత్తనడక నడిచింది. రోడ్డు విస్తరణలో భాగంగా గ్రంథాలయ భవనాన్ని కూల్చివేశారు. నైజాం పాలనలో నిర్బంధం ఉన్న కాలంలో దేదీప్యమానంగా వెలిగిన ఈ పుస్తకాలయం.. స్వతంత్రం వచ్చాక కనీస సదుపాయూలు, ఆర్థిక వనరులు, మౌలిక వసతులు కరువై నిర్జీవమవడం శోచనీయం. ఈ పరిస్థితుల్లో దాదాపు నాలుగున్నర నెలల పాటు మూసివేతకు గురైంది కూడా. సమైక్యాంధ్ర పాలనలో పోషణ లేక, ప్రజల నుంచి ఆదరణ లేక 1974లో జిల్లా గ్రంథాలయ సంస్థకు ఈ గ్రంథాలయూన్ని ఆస్తిపాస్తులు సహా అప్పగించారు. అదివరకు ఉన్న భవనం నుంచి పక్కనే ఉన్న యెల్లంబజార్‌లోని ఒక చిన్న భవనంలోకి మారింది గ్రంథాలయం. జిల్లా గ్రంథాలయ సంస్థ ఈ గ్రంథాలయం అసలు పేరును తీసేసి, ‘గ్రేడ్-1 శాఖా గ్రంథాలయము’గా మార్చింది. దాంతో తెలుగు భాషాభిమానులు, సాహిత్యకారులు ఆందోళన చేశారు. అయినా పేరు మార్చలేదు. ఇప్పటికీ దాని పేరు అలాగే ఉండిపోయింది.

సమాచార కేంద్రం
శోభ, గోలకొండ పత్రికల సంపాదకులు, ప్రసిద్ధ రచయిత అయిన దేవులపల్లి రామానుజరావు ఈ గ్రంథాలయ కార్యదర్శిగా 1943-47 మధ్య కాలం పనిచేశారు. ఆ కాలంలోనే ఈ గ్రంథాలయంలో ఒద్దిరాజు సోదరులు, సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు కలిసి ప్రచురించిన ‘తెనుగు’ పత్రిక పుట్టిందని చెబుతారు. అప్పుడు ఆ పత్రిక పంపిణీ కేంద్రం కూడా ఇదేనంటారు. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాతా అనేకమంది పరిశోధకులకు సమాచార కేంద్రంగా ఈ గ్రంథాలయం భాసిల్లింది. హైదరాబాద్ నుంచి పరిశోధకులు, పండితులు తరచూ ఇక్కడకు వస్తుండేవారు. ఇక్కడ అరుదైన పుస్తకాలు, ప్రత్యేకించి పద్య నాటకాలకు సంబంధించిన విలువైన పుస్తకాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో 38,000 పుస్తకాలున్నాయి. వాటిలో సామాజిక, ఆర్థిక, రాజకీయ శాస్ర్తాలకు సంబంధించిన పుస్తకాలు, తెలుగు, ఉర్దూ, సంస్కృత భాషా పుస్తకాలు, పద్య, గద్య సాహిత్య పుస్తకాలది సింహ భాగం.

సంస్కృత భాషలో అనేక పురాణాలు, రామాయణం, భాగవతం వంటివి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ రచయిత దూపాటి వెంకట రమణాచార్యులు సేకరించిన 16వ శతాబ్దం నాటి 19 తాళపత్ర గ్రంథాలు ఈ లైబ్రరీలో ఉండటం విశేషం. వాటిలో 16 తాళపత్ర గ్రంథాలు రెండు వైపులా రాసుండగా, 3 తాళపత్ర గ్రంథాలు ఒకవైపే రాసున్నాయి. వీటిపైన నాగేంద్రుని బొమ్మలు, జ్యోతిశ్శాస్త్ర పట్టికల చిత్రాలు ఉన్నాయి. ఇవి ప్రాకృతం/పాళీ భాషలో ఉన్నాయి. ఇవి కాకుండా సాహిత్య విమర్శ, చరిత్ర, సంస్కృతి, తత్త్వశాస్త్రం, నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు, ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలు, లలిత కళలు, నాటకాలు, నవలలు, కథలు, ఇతిహాసాలు, పురాణాలు, పత్రికలు.. వంటివెన్నో చదువరులకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

ప్రభుత్వం పట్టించుకోవాలి
చదివినవాళ్లే ఎదుగుతారనేది చరిత్ర సత్యం. పుస్తకాల పుటల్లో నాటిన జ్ఞాన బీజాలే సమాజ పురోగతి ఫలాలని కాలం నాడు, నేడు రుజువు చేసింది. భవిష్యత్తూ రుజువు చేస్తుంది. పరిమిత జీవితాన్ని ఆస్వాదించడం తెలిసినా, అన్యాయూన్ని ఎదిరించడానికి గళాలు కలిసినా, అణచివేతకు వ్యతిరేకంగా పిడికిలి బిగించినా.. అది పుస్తకం అందించిన అక్షరం చలువేనన్నది కాదనలేని సత్యం. ఇలాంటి అనేక అనుభవాల, అనుభూతుల నిలయం శబ్దానుశాసన ఆంధ్ర భాషా నిలయం. స్వాతంత్య్రానికి పూర్వం ఈ నిలయూనికి ప్రతి రోజూ నూరు నుంచి రెండొందల మంది వరకు చదువరులు వచ్చేవారు. ఇప్పుడూ పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు.

ఇవాళ ఈ గ్రంథాలయూనికి 4,500 మంది శాశ్వత సభ్యులుగా ఉండటం విశేషం! వందేళ్ల క్రితం ఏర్పడిన ఈ విజ్ఞాన మందిరం సమైక్యాంధ్ర పాలనలో పోషణ లేక నిరాదరణకు గురయింది. తెలంగాణ రాష్ట్రంలోనైనా ఈ గ్రంథాలయ అభివృద్ధికి రాజా రామమోహన్‌రాయ్ ఫౌండేషన్ సహకారాన్ని తీసుకోవాలి. ఈ ఫౌండేషన్ వందేళ్లు దాటిన విజ్ఞాన సమాచార కేంద్రాలకు మ్యాచింగ్ గ్రాంట్ కింద నిధులు సమకూర్చే అవకాశాలున్నాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలి. మిగతా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసి, గ్రంథాలయూనికి అవసరమైన మౌలిక సదుపాయూలు కల్పించాలి. వట్టికోట ఆళ్వారుస్వామి వారి ఆశయూలకు అనుగుణంగా గ్రామ గ్రామాన గ్రంథాలయూలు నెలకొల్పి ‘మిషన్ వట్టికోట’కు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి.
- డా. రవికుమార్ చేగొని
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం

English Title
Libraries made key roles during national war
Related News