చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్‌గా కృష్ణమూర్తి

Krishnamurthy Subramanian appointed As Chief Economic Adviser

న్యూఢిల్లీ : చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్‌గా కృష్ణమూర్తి  సుబ్రమణియన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు  కొనసాగనున్నారు. ప్రధాన ఆర్థిక సలహాదారుగా కృష్ణమూర్తి  సుబ్రమణియన్‌ నియమిస్తూ ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్ర‌స్తుతం అసోసియేట్ ప్రొఫెస‌ర్‌గా పనిచేస్తున్నారు.  షికాగో-బూత్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేసిన కృష్ణమూర్తి, అంతకుముందు ఐఐటీ, ఐఐఎంలలో టాప్ ర్యాంకు పొందారు. బ్యాంకింగ్, కార్పొరేట్ పాలన, ఆర్థిక విధానాలకు సంబంధించి ఆయన మంచి నిపుణుడు. ఫైనాన్షియల్ ఎకనమిక్స్‌లో రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, ప్రొఫెసర్ లుయిగి జింగాలెస్ ఆధ్వర్యంలో ఎంబీఏ, పీహెచ్‌డీ చేశారు.

బ్యాంకింగ్, లా, ఫైనాన్స్, ఇన్నోవేషన్, ఆర్థికవృద్ధి, కార్పొరేట్ పాలన అంశాలలో ఆయన చేసిన పలు పరిశోధనల వివరాలు ద రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టడీస్, ద జర్నల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎకనమిక్స్, ద జర్నల్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ క్వాంటిటేటివ్ ఎనాలసిస్, ద జర్నల్ ఆఫ్ లా అండ్ ఎకనమిక్స్ లాంటి ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. విద్యారంగంలో తన కెరీర్ ప్రారంభించడానికి ముందు కృష్ణమూర్తి సుబ్రమణియన్ కొన్నాళ్ల పాటు న్యూయార్క్‌లో జేపీ మోర్గాన్ ఛేజ్‌కు కన్సల్టెంటుగా పనిచేశారు.

అలాగే ఐసీఐసీఐ లిమిటెడ్‌లోని పరిశోధన గ్రూపులో కూడా సేవలు అందించారు. 2014 సంవత్సరంలో బ్యాంకింగ్ రం గాన్ని ఒక గాటన పెట్టడంలో ఆయన అందించిన అసాధారణ సేవలకు గాను ఐఎస్‌బీ ఇనాగరల్ అలుమ్ని ఎండోమెంట్ రీసెర్చ్ ఫెలోగా ఎంపిక చేశారు. అవెురికాలోని ఎమొరి యూనివర్సిటీలో గల గొయుజ్యూటా బిజినెస్ స్కూల్లో ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడిగా కూడా పనిచేశారు.  కాగా ఆరు నెలల క్రితం అరవింద్ సుబ్రమణియన్ వ్యక్తిగత కారణాలతో ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి రిజైన్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అంటే సుమారు ఆరు నెలల తర్వాత ఈ పోస్టును కేంద్రం భర్తీ చేసింది.

సంబంధిత వార్తలు