సస్పెన్స్‌కు తెర, 22న ముహుర్తం ఫిక్స్..

Karnataka cabinet to be expanded on December 22
  • 22న కర్ణాటక మంత్రివర్గ విస్తరణ

బెంగళూరు : ఎట్టకేలకు కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఈనెల 22న ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తన క్యాబినెట్‌ను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఆయన క్యాబినెట్‌లో 26 మంది మంత్రులుండగా కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎంఎల్‌ఏలకు, జేడీఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కొత్తగా మంత్రిపదవులు దక్కనున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి వ్యవహారాలను సమన్వయపరిచే  కోఆర్డినేషన్ కమిటీ ఈమేరకు బుధవారం జరిగిన భేటీలో తీర్మానించింది. కాగా మంత్రి పదవులు కావాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ నేతలు బహిరంగంగానే నిత్యం తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే.   

మాజీ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన రెండు గంటల సుదీర్ఘ భేటీలో కార్పొరేషన్ పదవులను కూడా భర్తీ చేయాలని నిర్ణయించారు. మే నెలలో అధికారం చేపట్టిన కుమారస్వామి రెండవసారి తన క్యాబినెట్‌ను విస్తరించనున్నారు. 20 కార్పొరేషన్‌లకు, బోర్డులకు  చైర్మన్‌లను నియామకం జరుగనుండగా 10 పదవులు కాంగ్రెస్ అభ్యర్థులకు దక్కనుండగా మిగిలిన 10 జేడీఎస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. కాంగ్రెస్‌లోని సతీష్ జార్కోళికి చెందిన ఓ వర్గం బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉందన్న అంశంపై స్పందించిన సిద్ధు, ఇదంతా మీడియా కల్పితంగా కొట్టిపారేశారు. తమ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

 

సంబంధిత వార్తలు