నాగరాజు హత్య కేసులో నిజానిజాలివీ..

Updated By ManamFri, 01/05/2018 - 14:50
Karmanghat carpenter Nagaraju murder mystery

Karmanghat carpenter Nagaraju murder mysteryహైదరాబాద్: భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన కార్పెంటర్ నాగరాజు హత్యకేసులో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం నాగరాజు భార్యతో పాటు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి కోసమే భర్తను జ్యోతి హత్య చేసినట్లు తేలింది. డిసెంబర్ 31న పోలీసులు ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారని భర్తను చంపేసి బయటికెళ్లిపోదామని ప్లాన్ చేసిన జ్యోతి అడ్డంగా బుక్కైంది. భర్తకు మొదట నిద్రమాత్రలు ఇచ్చిన జ్యోతి స్పృహ కోల్పోయేలా చేసి ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఊపిరాడకుండా చంపేసింది.

అసలేం జరిగిందో జ్యోతి మాటల్లోనే..
"
పెళ్లికి ముందు నుంచే కార్తిక్‌తో పరిచయం ఉండేది. భర్తను వదిలేసి వస్తే పెళ్లి చేసుకుంటానని కార్తీక్ నాకు హామీ ఇచ్చాడు. ఇందుకు మేమిద్దరం ప్లాన్ వేశాం. గత నెల 19న కార్తిక్ నాకు నిద్రమాత్రలు తెచ్చిచ్చాడు. 31న నాగరాజుకు పాలలో నిద్రమాత్రలో కలిపి ఇచ్చాను. అనంతరం కార్తిక్‌కు ఫోన్ చేస్తే మిత్రులతో కలిసి మా ఇంటికి వచ్చాడు. అందరం కలిసి నా భర్తను ఊపిరి ఆడకుండా చేసి చంపేశాం. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి వెనుక నుంచి చౌటుప్పల్లో పడేశాం. కార్తీక్‌ను పెళ్లి చేసుకోవాలనే భర్తను చంపేశాం" అని జ్యోతి చెప్పింది.

పోలీసు అధికారి మాటల్లో..
"పెళ్లి కాక ముందు ప్రియుడితో కలిసి తిరుగుతోందని తల్లిదండ్రులు మందలించారు. కానీ ఆమె ఏ మాత్రం మారకపోవడంతో సొంతూరు నుంచి నగరానికి తీసుకొచ్చి కార్పెంటర్ నాగరాజుతో 2012లో వివాహం చేశారు. దంపతులకు ఒక బాబు, పాప జన్మించారు. గత మూడునెల్లుగా కార్తిక్.. పరిచయాన్ని ఆసరగా తీసుకొని జ్యోతి మళ్లీ అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఫోన్ సంపాదించుకుని మళ్లీ ప్రియుడితో మాట్లాడటం మొదలుపెట్టింది. డిసెంబర్ 31నాడు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. నాగరాజు స్పృహలో లేడని తెలుసుకున్న జ్యోతి.. కార్తిక్‌కు ఫోన్ చేసింది. కార్తిక్ తనతో పాటు దీపక్, యాసిన్, నగష్ ఈ ముగ్గురూ సహాయంతో మారుతీ కారులో వచ్చి నాగరాజును చంపేసి చౌటుప్పల్‌‌లో పడేశారు" అని పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వివరించారు.

అసలు విషయం ఇలా బయటపడింది..
పక్కా ప్లాన్‌తో హత్య చేసిన అనంతరం చౌటుప్పల్‌లో పడేశారు. ఆ మర్నాడు చౌటుప్పల్‌ పోలీసులు ఆ మృతదేహాన్ని గుర్తించి నాగరాజు జేబులో దొరికిన చిట్టీ ఆధారంగా అతడి చిరునామా గుర్తించి భార్య జ్యోతికి ఫోన్‌ చేశారు. పీఎస్‌కు చేరుకున్న ఆమె తన భర్త రెండురోజుల నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు చేసి మృతదేహాన్ని చూసి రోదించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు నాగరాజు మృతదేహాన్ని జ్యోతికి అప్పగించారు. కుటుంబ సభ్యులు అతడికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. డిసెంబరు 30, 31 తేదీల్లో ఒకే నంబరుకు ఎక్కువగా కాల్స్‌ ఉన్నట్టు తేలింది. ఆ నంబరు కార్తీక్‌దిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేశామని అంగీకరించాడు. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులోనే ఉన్నారు.

English Title
Karmanghat carpenter Nagaraju murder mystery
Related News