‘కన్నా’ నోరు అదుపులో పెట్టుకో..

Updated By ManamWed, 10/17/2018 - 18:47
Annam satish prabhakar
Annam Satish Prabhakar

అమరావతి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై శాసనమండలి సభ్యుడు అన్నం సతీష్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...వైఎస్సార్ సీపీ జెండా జేబులో పెట్టుకుని బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

విలువలు, సిద్ధాంతాలు కలిగిని పార్టీ బీజేపీ అంటూ పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే ఆ పార్టీ నేతలకు జీవీఎల్ మాటలు మీకు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఆంబోతులు, వాడు, వీడు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం జీవీఎల్‌కే చెల్లిందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వీధి రౌడీగా ఉన్న నిన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. కన్నా వాడుతున్న భాష, వాడిన భాషతో తెలుగు ప్రజల చేత ఛీకొట్టించుకున్న విషయం మరిచిపోయావా అంటూ ధ్వజమెత్తారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, మరోసారి టీడీపీ నేతల గురించి నోరు పారేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. 

అగ్రిగోల్డ్‌పై అసత్య ప్రచారం
పీడీ ఖాతాలు, అమరావతి బాండ్లు వంటి వాటిపై అసత్య ఆరోపణలు చేయడం, నిరూపించమంటే పారిపోవడం బీజేపీ నేతలు ఇప్పుడు అగ్రిగోల్డ్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని సతీష్ ప్రభాకర్ అన్నారు. ‘హాయ్‌లాండ్‌ను నారా లోకేష్‌ కొట్టేశారంటూ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడడం అవగాహనారాహిత్యం. అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తులు ఎలా స్వాధీనం చేసుకుంటారు? బురదజల్లాలనే కుట్రలో భాగంగానే దుష్ప్రచారం చేస్తున్నారు. 

అగ్రిగోల్డ్‌ బాధితులను అదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దేశంలో సుమారు 8 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌ బాధితులుంటే ఏ రాష్ట్రం బాధితులకు అండగా నిలబడలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలబడుతూ వారికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తుంది. మనోవేదనతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నారు.’ అని అన్నారు. 

English Title
Kanna lakshmi Narayana Be In Your Limits, says Annam satish Prabhakar
Related News