'ఆ మాట వాస్తవమే.. కానీ నగదు కాదు'

Jupudi Prabhakar Rao, Election commission raids, EC, TRS govt

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ.. రాష్ట్రంలో ఎక్కడ చూసిన మద్యం ఎరులై పారుతుంటే.. కోట్లాది నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇప్పటికే రాష్టవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి లక్షల లీటర్లకు పైగా మద్యం, కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ నివాసంలో గురువారం ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జూపూడి ఇంట్లో నగదు దొరికినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఆరోపణలపై జూపూడి స్పందిస్తూ.. తన నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేసిన మాట వాస్తమేనని, కానీ తన ఇంట్లో ఎలాంటి నగదు దొరకలేదని వెల్లడించారు. తన ఇంట్లో నగదు దొరికినట్టు పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. తాము ఎక్కడ బతకాలో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బంధువులను కూడా తమ ఇంట్లోకి రానీయడం లేదని వాపోయారు. తన ఇంట్లో నగదు దొరికితే చూపించాలన్నారు. ఇంట్లో తన భార్య తప్ప ఎవరూ లేరని, ఇదంతా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇలా చేయడం సరికాదని జూపూడి ఆక్షేపించారు. 

సంబంధిత వార్తలు