వామ్మో.. ఉద్యోగం!

Updated By ManamSun, 10/28/2018 - 11:12
job fear
  • ఉద్యోగులు కాదు.. యంత్రాలే

  • పనితీరు మార్చేస్తున్న స్కోరింగ్.. అనుక్షణం ఉద్యోగుల ట్రాకింగ్

  • ఎవరెలా పనిచేస్తున్నారో పరీక్ష.. ఆఫీసు మొత్తం తెలిసేలా డిస్‌ప్లే

  • స్మార్ట్ టెక్నాలజీతో ఉద్యోగం గగనం.. త్వరగా అలిసిపోతున్న ఉద్యోగులు

ఉద్యోగం చేస్తున్నామంటే సరదాగా మధ్య మధ్యలో కబుర్లు చెప్పుకొంటూ, కాసేపు బ్రేక్ తీసుకుని.. పక్కవాళ్ల గురించి గాసిప్స్ చెప్పుకొంటూ పని పూర్తి చేసుకుంటారు. సర్వసాధారణంగా ఏ కార్యాలయంలోనైనా జరిగేది ఇదే. రోజు మొత్తమ్మీద చేయాల్సిన పని చేసేస్తూనే.. మధ్యమధ్యలో కాస్త రిలాక్స్ అవుతుంటారు. కానీ, కొత్తగా వస్తున్న ఎంప్లాయీ ట్రాకర్లు, స్కోరుబోర్డులు కర్ర పట్టుకుని ఉద్యోగుల వెంట పడుతున్నాయి. అనుక్షణం మనం ఎలా పనిచేస్తున్నామో గమనించడమే కాక.. ఆ విషయాన్ని పదిమందికీ చెప్పేస్తున్నాయి.

దీంతో ఉద్యోగం చేయడం అంటే నరకంలో ఉన్నట్లే భావించాల్సి వస్తోంది. టెక్నాలజీ పుణ్యమాని పని సులభం అవుతోందని అనుకుంటే ఇప్పుడు అది కాస్తా ఎలక్ట్రానిక్ కొరడాలా మారిపోయి వీపు విమానం మోత ఎక్కిస్తోంది. నిరంతరం యంత్రాల్లా పనిచేయడం కంటే అప్పు డప్పుడు కాస్త రిలాక్స్ కావడం మానవ సహజ లక్షణం. ఉద్యోగుల విషయానికొస్తే ఇది వారి బలహీ నత కూడా. దీనివల్ల పెద్దగా ఉత్పాదకత తగ్గిపోయేది ఏమీ ఉండదు గానీ, యాజమాన్యాల దృష్టిలో చూస్తే ఇది పెద్ద తప్పే! గత కొన్నేళ్లుగా స్మార్ట్ టెక్నాలజీలు రంగప్రవేశం చేసి మన జీవితం మొత్తాన్ని మార్చేస్తున్నాయి. మొదట్లో పనిని సులభతరం చేసిన టెక్నాలజీ ఇప్పుడు మొత్తం పనే ప్రపంచంలా మారిపోయేలా చేస్తోంది. ఒక్క నిమిషం కూడా ఊపిరి పీల్చుకోడానికి సైతం ఖాళీ ఇవ్వకుండా నిరంతరం మిషన్ల మాదిరి పనిచే యడాన్ని తప్పని సరి చేస్తోంది. ఒక రకంగా ఉద్యోగులను ఆటోమేటిక్ ట్రెడ్‌మిల్ మీద పెడుతున్నారు.

image


దానిమీద తప్పనిస రిగా పరుగు తీయాల్సిందే. లేకపోతే కింద పడిపోతా రు. ఇంకా దారుణం ఏమిటంటే, ‘బిహేవియర్ మేనేజ్‌మెంట్’ ద్వారా పని మొత్తాన్ని ఒక వీడియోగే మ్‌లా మార్చేస్తున్నారు. అందులో నిబంధనలు, స్కోర్లు.. చివరకు పెనాల్టీలు కూడా ఉంటాయి. కాలి ఫోర్నియాలోని ఓ హోటల్లో ఇది చాలాకాలం క్రితమే మొదలైంది. అక్కడి లాండ్రీలో పనిచేసేవాళ్లు అంత వరకు రోజుకు తాము ఎన్ని దుప్పట్లు, తువ్వాళ్లు, ఇతర దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసి మడత పెట్టామో లెక్క ఇచ్చేవారు. దాన్ని బట్టి రోజుకు ఎంత పని జరిగిందో తెలిసేది. తర్వాత ఇప్పుడు వాళ్లు రియల్ టైం ట్రాకింగ్ పద్ధతిలో పనిచేయాల్సి వస్తోంది. ప్రతి ఒక్క లాండ్రీ వర్కర్ ఎంత పని చేశాడో ఎలక్ట్రానిక్ స్కోర్‌బోర్డు మీద చూపిస్తున్నారు. అది లాండ్రీ మొత్తం కనిపిస్తుంది. యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం తలెత్తకుండా పనిచేసు కుంటుంటే వాళ్ల పేర్లు ఆకుపచ్చ రంగులో కనిపి స్తాయి. అదే కాస్త పని నెమ్మదించిందటే, వాళ్ల పేరు పసుపు రంగులో కనిపిస్తుంది. అంటే, జాగ్రత్త పడా లన్న మాట. పూర్తిగా వెనకబడితే వాళ్ల పేర్లు ఎర్ర రంగులో కనిపిస్తాయి. అంటే ఇక వారి ఉద్యోగానికి ఎసరు వచ్చిందన్నమాటే. అంతేకాదు.. ఇలా నెమ్మ దించిన వ్యక్తుల మీద పసుపు, ఎరుపు రంగు లైట్లు కూడా పడుతుంటాయి. దాన్ని బట్టి వాళ్లు వేగం పుం జుకోవాలని మిగిలినవాళ్లు కూడా హెచ్చరిస్తుంటారు. ఇది ఒకరకంగా ఎలక్ట్రానిక్ కొరడా లాంటిదేనని ఉద్యోగులు వాపోతున్నారు.

వాళ్లు కావాలనుకున్నా ఒక్క నిమిషం కూడా ఆగలేరు. ఇలా పనిచేయడం వల్ల కొంతమంది గాయాలపాలయ్యారు. మిగిలినవాళ్లు కూడా త్వరగా అలిసిపోయారు. అయినా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయసాగారు. అంతకుముందు ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ కుటుంబ వాతావరణంలో పనిచేసేవాళ్లు కాస్తా పరుగుపందెంలోకి వెళ్లిపోయినట్లయింది. చివరకు బాత్రూంకు వెళ్లడం కూడా కొంతమంది మానుకున్నారు. ఇలా ఉద్యోగాన్ని కూడా ఒక వీడియోగేమ్ మాదిరి చేయడం వల్ల మనుషులు తప్పనిసరిగా అందులో ఆడి తీరాల్సి వస్తోంది. ప్రతివాళ్లూ ఆటలో నెగ్గాలనే అనుకుంటారు. దానివల్ల ఉద్యోగుల ఉత్పాదకత దాదాపు రెట్టింపై.. ఇది మిగిలిన చోట్లకు కూడా త్వరగా వ్యాపించింది. ఫేస్‌బుక్ తన యూజర్ల ఫ్రెండ్‌షిప్‌ను ఇలా ఆటలా మార్చింది.

ఎవరికి ఎక్కువ మంది స్నేహితులుంటే అంత గొప్ప అన్నట్లు చూపింది. డేటింగ్ యాప్‌లు కూడా రొమాన్స్‌ను, ఈ కామర్స్ సైట్లు షాపింగ్‌ను ఇలా ఆటలా మార్చేస్తున్నాయి. సూపర్ మార్కెట్‌కు వెళ్తే అక్కడ షాపింగ్ అనుభవం ఎలా ఉందో రేటింగ్ ఇమ్మంటారు. అంతవరకు ఎందుకు.. ఓలా, ఉబర్ టాక్సీలు ఎక్కి దిగిన తర్వాత డ్రైవర్లకు రేటింగ్ ఇవ్వాలి. ఇలా ప్రతి పనినీ గేమ్‌లా మార్చేసి స్కోర్లు పెట్టడం, మంచి స్కోరు వచ్చినవాళ్లే గొప్పవాళ్లు, తక్కువ స్కోరు ఉన్నవాళ్లు పనికిరారు అని ముద్ర వేయడం వల్ల సమాజంలో అసమానతలు కూడా తలెత్తుతున్నాయి. ఇవి కేవలం ఆటలు మాత్రమే కాదని, సామాజిక నియంత్రణ అయిపోతోందని కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags
English Title
job fear
Related News