జగదంబకు బోనం

Updated By ManamMon, 07/09/2018 - 23:26
bonalu

శక్తి ఆరాధనలో జానపదులు జరుపుకునే అతిపెద్ద జాతర బోనాలు. ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా దుర్గతి, దుఃఖం నశింపచేసే శక్తి జగన్మాతను ఆరాధిస్తారు. ఆషాఢ జాతర ఈ వారమే ప్రారంభం కాబోతోంది. గోల్కొండ జగదంబిక బోనాల సందర్భంగా ఘటం ఎదుర్కోళ్లు నిర్వహిస్తారు. అప్పటి నుంచి ఆషాఢ మాసం పూర్తయ్యేవరకు ప్రతి గురు, ఆదివారాల్లో గోల్కొండ కోట దగ్గర బోనాల జాతర నిర్వహిస్తారు.
 

image


సకల జీవకోటికి ఆధారం అన్నం. జీవుల ఉత్పత్తి, పోషణ జీవద్రవ్యమైన అన్నం వల్లే జరుగుతాయి. ప్రకృతి శక్తులకు అన్నాన్ని సమర్పించడమంటే కృతజ్ఞతను తెలియజెప్పడమే. కొత్త కుండలో జగన్మాతకు అన్నం పెట్టడమే ఈ అపూర్వ సంబురం ముఖ్య ఉద్దేశ్యం. ఉత్సాహభరితమైన డప్పుల విన్యాసాలు, పోతురాజుల హంగామాలు, పడతుల తలలపై పసుపు రాసిన బోనాలు, ఆలయాల్లో ప్రతిధ్వనించే భవిష్యవాణి బోనాల్లో ప్రధానఘట్టాలు.

ఆషాఢ జాతరలో జగన్మాతకు బోనాలు సమర్పించడం వల్ల శారీరక, ఆధ్యాత్మిక, మానసిక శక్తులు వృద్ధి చెందుతా యని భక్తులు విశ్వసిస్తారు.  బోనం కుండలను శిరస్సులపై ధరించి పసుపు కలిపిన నీటిని వేపకొమ్మలతో చిలకరిస్తూ అమ్మ తల్లి ఆలయాలకు వెళతారు. మొక్కుబడుల్ని అనుసరించి పాత్రల్లో బోనాల ను సిద్ధంచేస్తారు. బోనాల ఘటాలను పసుపు కుంకుమలతో, కళాత్మక నగిషీలతో అమ్మవారి రూపాలను తీర్చిదిద్దుతారు. కొత్త కుండను, దానిపై ఉంచే చిన్న ముంతను, ముంతపై మూకుడుని తెస్తారు. కుండకు సున్నం పూసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఇప్పుడు చిత్రచి త్రాలుగా వీటిని అలంకరిస్తున్నారు.
 

image


 కుండ అంచుకు వేప రెమ్మలు కడతారు. ఒక తెల్లని వస్త్రంలో నవ ధాన్యాలు పోసి చిన్న మూట కట్టి నాలుగు కొంగుల్ని కలిపి వత్తిగా మలుపుతారు. పైన ఉండే మూకుడు మూతలో నూనె పోసి, మూటతో సహా వత్తిని అందులో ఉంచుతారు. బోనం తలకెత్తుకునే ముందు వత్తిని వెలిగిస్తారు. కుండలో అమ్మవారి నైవేద్యాలు ఉంటాయి.  వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయల తో కూడిందే బోనం. వ్యాధి నిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. బోనంతో పాటుగా ఈ సందర్భంలోనే తొట్టెలను సమర్పించే ఆచారం ఉంది. కొత్తగా అమ్మనాన్న అయిన దంపతులు అమ్మతల్లికి తొట్టెలు సమర్పిస్తారు. నట్టింట తొట్టె ఉంచితే నీకు తొట్టె సమర్పిస్తానని మొక్కుకుంటారు. అలాగే, గుర్రాలు, ఏనుగులు, సంకెళ్లు మొక్కును బట్టి సమర్పించుకుంటారు. పిల్లలకు అనారోగ్యాలు వచ్చినప్పుడు గుర్రంలాగా అయితే గుర్రం, బిడ్డ ఏనుగులాగైతే ఏనుగును సమర్పించుకుంటామని మొక్కుకుంటారు. సంకటాల సంకెళ్లు చుట్టుకున్నప్పుడు సంకెళ్లు మొక్కుకుంటారు. మొక్కుబడి గుర్రాలను ఏనుగుల్ని కొయ్యతో గానీ, మట్టి బొమ్మలుగా గానీ సమర్పించుకుంటారు.

బోనాల చరిత్ర
కాకతిని ఆరాధ్య దేవతగా పూజించేవారు కాకతీయులు. వారు అమ్మవారికి ఆషాఢ ఉత్సవాలను నిర్వహించేవారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని ఆషాఢ మాసంలో ప్రతినిత్యం ఉత్సవాల్ని నిర్వహించేవారు. భాగ్యనగరంలో పదిహేనో శతాబ్దం నుంచి బోనాలు నిర్వహిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ప్రతి సంవత్సరం భారీవర్షాల వల్ల తరచుగా కలరా వ్యాపించేది. ఆ వ్యాధి కారణంగా చాలామంది చనిపోయేవారు. ఆ నేపథ్యంలోనే జానపదులు బోనం పేరిట భోజన పదార్థాలను అమ్మకు నైవేద్యంగా సమర్పించేవారు. అన్నాన్ని దేవత ముంగిట రాశిగాపోసి బోనం పేరిట నైవేద్యాన్ని సమర్పించేవారు. అప్పటినుంచి బోనాల సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది.

ఆషాఢమాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారనే దానికి ఓ కారణాన్ని పెద్దలు చెబుతారు.  ఎండలు తగ్గి వానలు మొదలయ్యే సంధికాలం కనుక ఆషాఢంలో రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోగాలను తట్టుకోవడానికి కూడా జానపదులు గ్రామదేవతారాధనే తరుణోపాయంగా భావిస్తారు. అమ్మతల్లికి బోనం పేరిట భోజనాన్ని భక్తిగా సమర్పిస్తారు. బోనం స్వీకరించిన మాతృశక్తి సంతృప్తి చెంది ప్రజలను చల్లగా చూస్తుందంటారు.

English Title
జగదంబకు బోనం
Related News