జై జగన్నాథ

Updated By ManamMon, 07/09/2018 - 23:22
yathra

ఆషాఢంలో జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధం. పతితపావనుడు, నీలమాధవుడు అని భక్తులంతా కీర్తించే జగన్నాథస్వామి ఆషాఢమాసంలో రెండోరోజున రథయాత్ర చేస్తాడు. సాధారణంగా ఏ ఆలయంలో అయినా ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. పూరీలో మాత్రం మూలవిరాట్టులనే ప్రతి సంవత్సరం రథయాత్రలో ఊరేగిస్తారు. దేవేరులతో కాకుండా తోడబుట్టిన వారితో కలిసి జగన్నాథస్వామి గుండీచా మందిరం వరకు వెళ్లి, తిరిగి రావడమే రథయాత్రలోని ముఖ్య ఉద్దేశ్యం. ఈ శనివారం జగన్నాథ రథయాత్ర సందర్భంగా...

image


జగన్నాథ రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు పూరీక్షేత్రంలో దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం  లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు ఉదయకాల పూజల తరువాత పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని పహండీ అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండీచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులవుతారు. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే చెరా పహారా అంటారు.

రథ నిర్మాణం
జగన్నాథ రథయాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. మొత్తం 13 వేల ఘనపుటడుగుల కలపను జగన్నాథ రథాల నిర్మాణానికి వినియోగిస్తారు. ముందుగా వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, పదహారు చక్రాలుం టాయి. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం దేవదళన్. నిర్మా ణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా...ఆలయ తూర్పు భాగంలోని సింహ ద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువు గా ఒక్కో రథానికీ 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు.

ఘోషయాత్ర
జగన్నాథ స్వామిని పతితపావనుడు అంటారు. లక్షలాది భక్తులు రథయాత్రలో పాల్గొంటారు. జగన్నాథస్వామి ఆలయం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయం వరకు రథయాత్ర కొనసాగుతుంది. అందుకు 12 గంటల సమయం పడుతుంది. ఆనాటి రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున మేళతాళాలతో గుడిలోపలికి తీసుకువెళతారు. స్వామి అక్కడ ఏడురోజుల పాటు ఉంటాడు. ఐదోరోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతోపాటూ తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి, గుండిచా గుడి బయటి నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి.. పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్లిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజును హీరాపంచమి అంటారు. వారంపాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదాయాత్ర అంటారు . తరువాత రోజు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో (సునావేష) అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది.

English Title
జై జగన్నాథ
Related News