తెలుగులో ఇప్పటికి కుదిరింది

Updated By ManamSat, 09/15/2018 - 23:11
pavan kumar

imageసమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రధారులు.  ఈ సినిమా  సెప్టెంబర్ 13న విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు పవన్‌కుమార్ మాట్లాడుతూ ‘‘సినిమాలో చూపించిన ఫ్లైఓవర్ బెంగుళూరులో ఉంది. నాలుగైదు సంవత్సరాలు ఆ ఫ్లై ఓవర్ మీద తిరిగాను. అప్పుడు అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. దాని ఆధారంగా నేను ఈ స్టోరీని డెవలప్ చేశాను. తెలుగు సినిమా విషయానికి వస్తే మేం చేసింది రీమేక్ కాదు. అడాప్టేషన్ మాత్రమే.

చివరి 30 నిమిషాలు తెలుగులో డిఫరెంట్‌గా చేశాం. కన్నడలో తక్కువ బడ్జెట్, ఎక్స్ పెరిమెంటల్ అప్రోచ్‌తో చేశాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది చాలా పెద్దదైంది. లార్జర్ దేన్ లైఫ్‌గా చేశాం. తెలుగులో చేసిన చివరి 30 నిమిషాలను తక్కువ బడ్జెట్‌లో కన్నడలో చేయలేకపోయాం. మామూలుగా మనం సిగ్నల్స్ జంప్ చేస్తాం. దానికి సిగ్గుపడం. పోలీసులు ఫైన్ వేసినా సిగ్గుపడం. కానీ అక్కడ జరిగేది తప్పు అయినప్పుడు సిగ్గుపడాలి, పశ్చాత్తాప పడాలి. అందుకే నేను ఈ సినిమాలో ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేశాను. ఏదో ఒక భయం ఉంటే తప్ప మనం సరిగా ప్రవర్తించం. ఇందులో సమంత చాలా అద్భుతంగా చేశారు. కన్నడ వెర్షన్ ట్రైలర్ విడుదలైనప్పుడు ఆమె చూశారు.

మమ్మల్ని స్క్రిప్ట్ పంపమని అడిగారు. నేను ఎలా పంపడం అని ఆలోచిస్తుండగా, ఆమె మరలా ఫాలో అప్ చేశారు. దాంతో డేర్ చేసి పంపించాను. చదివి హ్యాపీగా ఫీలయ్యారు. మధ్యలో ఒకసారి నాగచైతన్య మమ్మల్ని బెంగుళూరులో కలిశారు. ఆ తర్వాత మా కన్నడ వెర్షన్ విడుదలకు పది రోజుల ముందు నాగచైతన్య, సమంత బెంగుళూరు వచ్చి మమ్మల్ని కలిసి సినిమా చూశారు. మా సినిమా ప్రమోషన్‌లోనూ పాల్గొన్నారు. అప్పుడే సమంత ఈ సినిమాను చేస్తానన్నారు. కానీ ఆమెకు ఉన్న ప్రాజెక్టుల కారణంగా ఆమె ఈ సినిమాను చేయలేదు. ఇన్నాళ్లకు కుదిరింది’’ అన్నారు. 

English Title
It is in Telugu
Related News