ఆ వ్యాఖ్యలు అవమానకరం: రాజె

I feel insulted: Vasundhara Raje on Sharad Yadav comments

జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె మనస్తాపానికి గురయ్యారు. శరద్ యాదవ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆమె... ఆయన అందరు మహిళలను అవమానపరిచారని,  ఇది నాకు చాలా అవమానకరమని మండిపడ్డారు. కాగా శరద్ యాదవ్ ‌.... ఎన్నికల ప్రచారంలో భాగంగా వసుంధర రాజె బరువుపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా ‘వసుంధరకు విశ్రాంతి ఇవ్వండి.. ఆమె చాలా అలసిపోయింది. గతంలో చాలా బక్కగా ఉండేది.. కానీ ఇప్పుడు లావయ్యారు’ అని వ్యాఖ్యానించారు. 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వసుంధర రాజె శుక్రవారం ఝాల్‌రాపఠాన్ నియోజకవర్గంలో ఓటు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..తానెప్పుడూ ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయనని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా ఎన్నికల సంఘం శరద్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. 

జోక్ చేశా: శరద్ యాదవ్
కాగా తన వ్యాఖ్యలను శరద్ యాదవ్ మాత్రం తేలిగ్గా తీసుకున్నారు. తాను కేవలం జోక్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు. రాజె కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆయన..ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆమెను కలిసిన సందర్భంలో కూడా లావుయ్యారనే విషయాన్ని ప్రస్తావించానని శరద్ యాదవ్ సమర్థించుకున్నారు.

సంబంధిత వార్తలు