భార్య ఏటీఎం కార్డు భర్త వాడితే నేరమే..

Updated By ManamThu, 06/07/2018 - 15:49
Husband Cant Use Wife ATM Card Rules Bank And Court
  • బ్యాంకు అదే చెప్పింది.. అందుకు కోర్టూ అంగీకరించింది

Husband Cant Use Wife ATM Card Rules Bank And Courtబెంగళూరు: మీ భార్య ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేస్తున్నారా..? ఆమె చెప్పింది కదా అని ఏటీఎంకు దారితీస్తున్నారా..? లేదంటే మీ తండ్రిదో, తల్లిదో, స్నేహితుడిదో ఏటీఎం తీసుకుని గీకేస్తున్నారా..? ఆగండాగండి... నా భార్యే కదా, నా తండ్రే కదా.. అని కార్డును గీకేయకండి. అదే నేరమవ్వొచ్చు. అవును, భార్య కాదు కదా మీది తప్ప ఎవరి ఏటీఎం/డెబిట్ కార్డునూ వాడడానికి వీల్లేదంతే. వాడారా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏంటీ.. మా వాళ్లది మేం వాడుకుంటే కూడా తప్పవుతుందా అని అనుకునేరు. కోర్టు కూడా అదే తప్పని స్పష్టం చేసింది. ఇదెక్కడి చోద్యం అని ఆలోచించడానికి ముందు.. దాని వెనక జరిగిన పెద్ద కథను రీవైండ్ చేసుకోవాలి. 

ఇదీ ఆ కథ..
వందన.. బెంగళూరు మహానగరంలోని మరతహళ్లికి చెందిన ఉద్యోగిని. ప్రసూతి సెలవుల్లో ఉన్నారు. పండంటి బిడ్డకు జన్ననిచ్చారు. ప్రసవమై బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న ఆమె.. 2013 నవంబరు 14న భర్తకు తన ఏటీఎం కార్డును ఇచ్చి రూ.25 వేలు డ్రా చేయాలని చెప్పారు. కార్డు తీసుకుని ఏటీఎం దగ్గరకు వెళ్లారు ఆమె భర్త. లావాదేవీ జరిగింది. కానీ, డబ్బు రాలేదు. డబ్బు మాత్రం కట్ అయినట్టు చూపిస్తోంది. కంగుతిన్న ఆమె భర్త.. వెంటనే బ్యాంకు అధికారులకు ఫోన్ చేశారు. సాంకేతిక లోపం కారణంగా అలా జరిగి ఉంటుందన్న అధికారులు.. 24 గంటల్లో డబ్బు జమ అవుతుందని చెప్పారు. సరే.. అని ఎదురు చూశారు. కానీ, డబ్బు పడలేదు. విషయేంటో తెలుసుకుందామని సమీపంలోని హెచ్ఏఎల్‌లో గల హెలికాప్టర్ బ్రాంచ్‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు దిమ్మతిరిగిపోయే సమాధానం వచ్చింది. లావాదేవీ సక్రమంగానే జరిగింది.. వారికి డబ్బులు ముట్టాయంటూ కేస్ క్లోజ్ చేసేసింది బ్యాంకు. వారి దెబ్బకు కంగు తిన్నారు ఆ దంపతులు. 

ఆ తర్వాత....
ఆ తర్వాత వారిద్దరూ తమకు డబ్బు రాలేదు అని నిరూపించేందుకు నానా తంటాలు పడ్డారు. ఏటీఎం సీసీటీవీ ఫుటేజీ సంపాదించారు. వందన భర్త డబ్బులు డ్రా చేసేదీ అందులో రికార్డ్ అయింది. డబ్బు రాకపోవడమూ స్పష్టంగా కనిపించింది. దాంతో పాటు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఆ ఏటీఎం నుంచి జరిగిన లావాదేవీల వివరాలను సేకరించారు వందన. అందులో జరిగిన లావాదేవీలకు పొంతన లేకుండా రూ.25 వేలు ఎక్కువ మొత్తాన్ని చూపించడం గమనించారామె. ఆ ఆర్టీఐ వివరాలు, సీసీటీవీ ఫుటేజీని తీసుకుని నేరుగా బ్యాంకు అధికారుల వద్దకే వెళ్లారు.

అప్పుడు.. అప్పుడు చెప్పారు అసలు ట్విస్ట్. ‘‘డబ్బు డ్రా చేసే సమయంలో ఏటీఎం వద్ద మీ భార్య లేదు. వందనా.. మీరు మీ భర్తకు పిన్ చెప్పారు. మేమేం చేయలేం. డబ్బులు రావు. కేస్ క్లోజ్’’ అని ఇంకో షాక్ ఇచ్చారు. ఇక, లాభం లేదనుకుని వినియోగదారుల ఫోరానికి వెళ్లారు ఆ దంపతులు. 2014 అక్టోబరు 21న బెంగళూరు నాలుగో అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఎస్బీఐ తమకు రూ.25 వేలు కుచ్చుటోపీ పెట్టిందని, తాను ఆ టైంలో బిడ్డకు జన్మనిచ్చి బయటకు వెళ్లలేకపోవడం వల్ల తన భర్తతో డబ్బు డ్రా చేయించేందుకు ప్రయత్నించానని చెప్పారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని వేడుకున్నారు. 

మూడున్నరేళ్ల పోరాటం వృథా...
మూడున్నరేళ్లు.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. వారు తమ కష్టార్జితం కోసం పోరాడుతూనే ఉన్నారు. అటూ..ఇటూ లాగేసి ఇన్నేళ్లు చేశారు. ఎక్కడో చిన్న ఆశ.. న్యాయం దక్కుతుందని. ఆ ఆశనూ అడియాస చేస్తూ బ్యాంకు వైపే మొగ్గు చూపింది కోర్టు. బ్యాంకుకే న్యాయం చేస్తూ.. ఆ దంపతులకు అన్యాయం చేసింది. ‘‘అసలు మీ ఏటీఎం కార్డును మీ భర్తకు ఎందుకిచ్చారు? అంతగా డబ్బు కావాలంటే ఏదో చెక్కు ఇవ్వొచ్చు కదా.. లేదంటే అనుమతి లెటర్ ఇవ్వాల్సింది. ఇక్కడ మీదే తప్పు. పిన్‌ను మీ భర్తకు చెప్పి ఉండాల్సింది కాదు. కేసును కొట్టేస్తున్నాం’’ అంటూ కోర్టు కూడా వారికి దిమ్మతిరిగే షాకిచ్చింది. రూ.25 వేలను ఎస్బీఐ ఉత్త పుణ్యానికి తన ఖాతాలో వేసుకుంది.

చివరగా: భార్యాభర్తలు, కుటుంబం అన్నాక తమ ఏటీఎం కార్డు పిన్నును ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. కార్డిచ్చి డబ్బు డ్రా చేయమంటారు. అది తప్పెలా అవుతుందో మరి.. ఆ బ్యాంకు వారికి, కోర్టు వారికే తెలియాలి. కాబట్టి, భర్తలూ, స్నేహితులూ జర జాగ్రత్త. బ్యాంకులు ఇలాంటి లొసుగులు కూడా పెట్టగలవు. 

English Title
Husband Cant Use Wife ATM Card Rules Bank And Court
Related News