హంగ్ హంగు

Updated By ManamWed, 05/16/2018 - 01:17
image

imageదేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన కర్నాటక ఎన్నికలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఏడాదిలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు, అంతకంటే ముందే జరుగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో కీలక భూమిక పోషించనున్నాయని కర్ణాటక ఎన్నికల్లో ఏ ఒక్కపార్టీ పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. 222 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచినా మేజిక్ ఫిగర్ 112ను సాధించలేక పోయింది. అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ కాంగ్రెస్ 78 సీట్లను సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించగా, కింగ్ మేకర్‌గా ప్రచారమైన జనతాదళ్ (సెక్యులర్) 38 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఎవరు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా జనతాదళ్ (ఎస్) మద్దతు తప్పనిసరి. ప్రభుత్వ ఏర్పాటుకు రెండు జాతీయ పార్టీల పోటీలో జనతాదళ్ (ఎస్)కు కాంగ్రెస్ ప్రతిపాదనతో కింగ్ మేకర్ స్థాయి నుంచి కింగ్‌గా మారే అవ కాశం కలిగింది. జనతాదళ్ (ఎస్) ప్రభుత్వం ఏర్పాటు చేసేట్లయితే, తాము బేషర తుగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించడం జనతాదళ్‌కు కలసి వచ్చింది. కర్ణాటక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తి ఫలితాలు వెలువడే దాకా ఒన్ డే క్రికెట్ మ్యాచ్‌లా అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. 

కర్నాటక ఎన్నికల్లో లింగాయత్‌ల ప్రత్యేక మైనారిటీ మతం, కర్ణాటక జెండా వంటి చిట్కాలు కాంగ్రెస్‌కు, ‘ఏకీకృత హిందూ అస్తిత్వ’ నినాదం, మైనింగ్ సంపన్నుల దన్ను బీజేపీకి, వక్కలిగ సామాజిక రాజకీయ అస్తిత్వంగా జనతాదళ్ (ఎస్)లు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విజేతలుగానే నిలిచాయి. సీట్ల సంఖ్యలో బీజేపీ, సాధించిన ఓట్లలో కాంగ్రెస్, ప్రభుత్వ ఏర్పాటులో జేడీ(ఎస్) కీలక స్థానంలో నిలవడంతో సాంకేతికంగా కాకపోయినా అన్ని పార్టీలు గెలిచినట్లయిం ది. కాంగ్రెస్ బేషరతు మద్దతు ఇస్తున్నందున జెడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమార స్వామి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని జేడీఎస్ గవర్నర్‌ను కోరింది. అయితే రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో గెలిచిన ఏకైక అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత యడ్యూ రప్ప గవర్నర్‌ను కలసి ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరడం తో ఆ రాష్ట్ర పరిణామాల్లో మరికొంత కాలం ఉత్కంఠ కొనసాగే అవకాశముంది. కాగా, జేడీ(ఎస్)లో దేవెగౌడ, ఆయన కుమారులు కుమారస్వామి, రేవన్న మూడు వర్గాలుగా ఉన్నారు. గెలుపొందిన వారిలో ఎక్కువ మంది రేవన్న వర్గానికి చెందిన వారే కావడంతో బీజేపీ ఆ వర్గానికి గాలం వేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో అనేక న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి. అయితే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పా టుకు పిలవాలా? ఎన్నికల అనంతర పొత్తులతో ఏర్పడిన మెజారిటీని గవర్నర్ పరి గణించి కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని ఆహ్వానించాలా అన్న ధర్మ సంకటం ఏర్పడింది. గతంలో గోవా, మణిపూర్, మేఘాలయాలలో బీజేపీ అనుసరించిన విధానం కర్ణాటకలో ఆ పార్టీకి శాపంగా మారనుంది. మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా 28 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించకుండా, 21 సీట్లు సొం తంగా గెలిచి, ఇతర పార్టీలతో ఎన్నికల అనంతర పొత్తులు పెట్టుకొని 31 సీట్ల మేజిక్ మెజారిటీ సాధించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పిలిచారు. మణిపూర్‌లో కాంగ్రెస్‌కు ఎదురైన పరిస్థితిని కర్ణాటకలో బీజేపీ ఎదుర్కొంటోంది. అదేవిధంగా 2017లో గోవాలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఏకైక అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను కాదని, పొత్తులతో ముందుకొచ్చిన బీజేపీ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశమిచ్చారు. దానిపై జరిగిన కోర్టు వ్యాజ్యం లో ఏకైక అతిపెద్ద పార్టీని మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవవలసిన అగత్యమేమీ లేదని, ఏకైక అతిపెద్ద కూటమిని పిలవడమూ ఆయనకున్న రాజ్యాంగ హక్కేనని బీజేపీ సమర్థించుకుంది. మణిపూర్, గోవా, మేఘాలయాలో బీజేపీ అనుసరించిన పద్ధతినే కర్ణాటకలో అనుసరించినట్లయితే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం ఉంది. అదీకాక సాధించిన ఓట్లతో పోలిస్తే ఆ కూటమిని మెజారిటీగా భావించడం చట్టసమ్మతం కానప్పటికీ ధర్మబద్ధమైనదనే వాదనలు వినిపిస్తున్నాయి.

కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా ధర్మసంకటంలో ఉన్నారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌ల విచక్షణాధికారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని 1952లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్పష్టమైన మెజారిటీలు సాధించి ఏకైక అతిపెద్ద పార్టీలుగా నిలిచిన పార్టీలను ప్రభుత్వం ఏర్పాటు చేసేం దుకు ఆహ్వానించిన ఉదంతాలున్నాయి. 1989లో రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ రాజీవ్‌గాంధీని, 1996లో రాష్ట్రపతి శంకర్ దయాళ్‌శర్మ అటల్ బీహరీ వాజ్‌పాయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే అందుకు భిన్నంగా మణిపూర్, మేఘాలయ, గోవాలలో ఏకైక అతిపెద్ద కూటములను గవర్నర్‌లు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకుండా కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని గవర్నర్ విచక్షణాధికారాల మేరకు పిలిచే అవకాశం లేకపోలేదు. అయి తే ప్రధాని నరేంద్ర మోదీ కోసం తన సీటును త్యాగం చేసి, ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా గుజరాత్ కేబినెట్‌లో కొనసాగి, మోదీ ఆత్మీయుడుగా పేరొందిన గవ ర్నర్ వజుభాయ్ వాలా నుంచి అలాంటి ఆహ్వానం వస్తుందని ఆశించడం కష్టం. ఈ నేపథ్యంలో కర్ణాటకలో నిలిచిన ఏకైక అతిపెద్ద పార్టీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాలా ఆహ్వానించి, కొద్దిరోజులు గడువు ఇచ్చే అవకాశం ఉంది. గత అనుభవాల రీత్యా చూస్తే మెజారిటీని సాధించేందుకు బీజేపీకి ఈ వ్యవధి చాలు. గోవాలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారితో చీలిక పార్టీలను ఏర్పరచడం వంటి అనేక అక్రమాలకు బీజేపీ పాల్పడిందని గతంలో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఆ అనుభవం కర్ణాటకలో పునరావృత మయ్యే పరిస్థితి వస్తుందని రాజకీయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఏది ఏమైనా కాబోయే ‘కన్నడ కంఠీరవమెవరో’ వేచి చూడాల్సిందే! ?

English Title
hung
Related News