పచ్చగా.. పరిశుభ్రంగా ఉండాలె

Updated By ManamFri, 08/10/2018 - 01:03
KCR
  • పంచాయతీ, శానిటేషన్ సిబ్బందికి వేతనాలు పెంచాలె

  • పచ్చదనం, శుభ్రతపై అధికారులకు సూచనలు

  • గ్రామ పంచాయతీలపై సీఎం కేసీఆర్ సమీక్ష

KCRహైదరాబాద్: గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచ డమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలని, ఇందుకోసం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాబోయే మూడు నెలల్లో గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి ఏంచేయాలనే విషయంలో కార్యాచరణ రూపొందించాలని, మొదటి నెల రోజులు గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పని చేపట్టాలని కోరారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకునే క్రమంలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి, మరీ ముఖ్యంగా సానిటేషన్ సిబ్బంది వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వివాహ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయడంతో పాటు మరికొన్ని బాధ్యతలు కూడా పంచాయతీలకు అప్పగించాలన్నారు. పంచాయతీలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చే కార్యాచరణ ఖరారు చేయడానికి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, పీ.కే.ఝా, వికాస్ రాజ్, నీతూప్రసాద్, స్మితసభర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎండీసీ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రం చేసే పనిని ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రారంభించాలని ఆదేశించి, ఈ నెల రోజుల్లో చేయాల్సిన పనులపై కేసీఆర్ మార్గ నిర్దేశనం చేశారు. 

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం సీఎం కేసీఆర్ సూచనలు..

  • వదిలేసిన గుంతలు, ఉపయోగించని-పాడుపడిన బావులను పూడ్చేయాలి.
  • పిచ్చిమొక్కలు, సర్కారు తుమ్మలు, జిల్లేడు చెట్లను పూర్తిగా తొలగించాలి. 
  • కూలిపోయిన ఇండ్లు, భవనాల శిథిలాలను తొలగించాలి.
  • మురికి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తీసి, అన్ని కాల్వలను పరిశుభ్రం చేయాలి. మురికి నీరు సాఫీగా పోయేలా వాటిని తీర్చిదిద్దాలి.
  • గ్రామంలోని అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చాలి. గుంతల్లో మొరం పోయాలి. వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చూడాలి. 
  • దోమలు వ్యాప్తి చెందకుండా తులసి మొక్కలు, ప్రత్యేకంగా కృష్ణతులసి మొక్కలు పెంచాలి. 
  • గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్త ఎంతో నిర్ధారించాలి. చెత్తను విసర్జించడానికి డంప్ యార్డు కోసం స్థలం సేకరించాలి.
  • గ్రామానికి ఒక స్మశాన వాటిక కచ్చితంగా నిర్మించాలి.
  • గ్రామాలకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు గ్రామస్తులను చైతన్య పరిచి, వారానికోసారి శ్రమదానం చేయించాలి. 
  • గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శి గ్రామంలో ర్యాలీ నిర్వహించి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రజలను చైతన్య పరచాలి.

గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి చేపట్టాల్సిన చర్యలపై చేసిన సూచనలు...

  • రాష్ట్రంలోని 12,751 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి.
  • గ్రామంలో రైతులు, ఇంటి యజమానులతో మాట్లాడి వారు ఎలాంటి మొక్కలు పెంచుతారో తెలుసుకుని, దానికి అనుగుణంగా ఇండెంట్ తయారు చేసి, నర్సరీల్లో మొక్కలు పెంచాలి. 
  • దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాని మొక్కలు కూడా ఉన్నాయి. వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అలాంటి మొక్కలను అందుబాటులో ఉంచాలి. వాటిని పెంచేలా ప్రోత్సహించాలి. 
  • రైతులు పొలం గట్ల మీద, బావుల దగ్గర మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలి. 
  • గ్రామ సమీపంలో ఏవైనా అడవులుంటే వాటిలో కూడా మొక్కలు పెంచాలి.
  • గ్రామ పరిధిలోని నదులు, ఉప నదులు, కాల్వలు, చెరువుల గట్లపై మొక్కలు నాటాలి. 
  • అన్ని విద్యాసంస్థల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి, వారి ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటే విధంగా కృషి చేయాలి. ఈ విషయంలో డీఈఓలకు లేఖలు రాయాలి.

ప్రత్యేకాధికారులు గ్రామాల్లో సేకరించాల్సిన వివరాలు...

  • గ్రామ పరిధిలో అన్ని రకాల రోడ్లు కలిపి ఎన్ని కిలోమీటర్లున్నాయి. అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి. 

  • గ్రామ పరిధిలో మురికి కాల్వల పొడవు ఎంత? అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి. 
  • గ్రామంలో స్మశాన వాటిక ఉందా? ఉంటే నిర్వహణ సరిగా ఉందా? లేకుంటే స్థలం సేకరించాలి.
  • గ్రామంలో ధోబీఘాట్ ఉందా? ఉంటే ఏ పరిస్థితిలో ఉన్నాయి. లేకుంటే ఏర్పాటు చేయాలి.
  • గ్రామంలో విద్యుత్ వీధి దీపాల పరిస్థితి ఎలా ఉంది. అన్ని వీధుల్లో స్తంభాలున్నాయా? 
  • కామన్ డంప్ యార్డు ఉందా? ఉంటే ఏ పరిస్థితిలోఉంది? లేకుంటే స్థలం సేకరించాలి.
  • గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది ఎంతమంది? వారికి జీతాలు ఎలా అందుతున్నాయి.
English Title
Green ... be clean




Related News