‘సత్వరం’ సరికాదు

Updated By ManamWed, 07/11/2018 - 00:25
 Indian health
  • భారతీయుల ఆరోగ్యాన్ని

image

ప్రమాదంలోకి నెడుతున్న కారణాల్లో ప్రబలమైంది అ నారోగ్యకరమైన జీవనశైలి. దేశంలో ప్రతిభావంతులైన వైద్యనిపుణులు, కార్పొరేట్ ఆసుపత్రులు, పోషకాహార నిపుణులు, జిమ్‌లు, సూపర్‌ఫుడ్‌లు, ఇంకా గొప్పగొప్ప విషయాలెన్నో ఉన్నప్పటికీ జనం అనారోగ్యాలతో కునారిల్లి పోతుండడానికి కారణమేమిటి? సంప్రదాయ ఆహారపుటలవా ట్లకు దూరమై, సత్వర పరిష్కారాల కోసం వెంపర్లాడినంత కాలం రోగాలు మనల్ని వదిలి పోవు. ఒంట్లో కాస్త నలతగా ఉందంటే చాలు, ఏదో ఒక మాత్రను కొని, గుటుక్కున మింగి, పదినిమిషాల్లో ‘రిలీఫ్’ని పొందుతాం. వినియోగదారుల్ని మభ్యపెట్టడానికి ప్రపంచీకరణ మాయాజాలంలో వ్యాపారులు ఉపయోగించే ఒక గొప్ప సాధనమే ‘క్విక్ రిలీఫ్’ (తక్షణ విముక్తి) అనే మంత్రం. ఇలాంటి తక్షణ పరిష్కారాల వెంట మనం పరుగులు పెడుతుంటాం. ఈ పరుగు పందెంలో మన శరీరంలో ఒక చిన్న విటమిన్ లోపిస్తున్న వైనాన్ని మనం పట్టించుకోం. శరీరంలో లోపిస్తున్న పోషకాలే మన అవస్థలకు కారణమని గుర్తించం. సూక్ష్మపోషకాలు శరీరంపై చూపించే ఆరోగ్యకరమైన ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు. చాలారకాలైన అనారోగ్య సమస్యలకు శరీరంలో విటమిన్లు, మినరల్స్ వంటివి లోపించడమే ప్రధాన కారణంగా ఉంటుంది. 

మానవదేహంలో జీవక్రియల్ని సక్రమంగా నడిపించడంలో విటమిన్ బి-12, విటమిన్ డి-3 ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎండపొడ తగలకుండా జీవించే నగరజీవుల్లో విటమిన్ -డి లోపం సహజంగానే కనిపిస్తుంటుంది. ఫలితంగా ఎముకలకు సంబంధించిన రుగ్మతలతో వీరు బాధపడుతుంటారు. కానీ ఈ సమస్య కేవలం పట్టణవాసులకే పరిమితం అనుకుంటే పొరపాటు. పర్యావరణ కాలుష్యానికి బలవుతున్న ప్రాంతాలకు సమీపంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంటుంది. దీనికి కారణం వాతావరణ కాలుష్య ప్రభావం వల్ల సూర్యకాంతికి అవరోధాలు ఏర్పడడమే. మనలో చాలా మందిని కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు బాధిస్తుంటాయి. దీనికి ప్రబల కారణం శరీరంలో మెగ్నీషియం లోపించడమే. దేహానికి సంబంధించిన 300 జీవరసాయన ప్రక్రియల్ని వేగవంతం చేస్తుంది మెగ్నీషియం. ఈ విటమిన్‌లన్నింటికంటే అతి ప్రధానమైన విటమిన్ మరొకటి ఉంది. అదే విటమిన్- డబ్ల్యు, అంటే వాటర్... నీళ్ళు! చాలామందికి ప్రతినిత్యం దేహానికి అవసరమైన మేరకు నీటిని తాగే అలవాటు ఉండదు. గ్యాస్ట్రిక్ అల్సర్లు, మైగ్రెయిన్ వంటి అనేకానేక సమస్యలకు తగినంత నీటిని తాగకపోవడమే కారణం. కణజాల స్థాయిలో శరీరానికి తేమను అందించాలంటే నీటిని తగినంతగా తాగి తీరాల్సిందే!

మానవ దేహం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ కలిగిన యంత్రం. చిన్న ఆలోచన కూడా మన దేహం మీద తన ప్రభావాన్ని స్పష్టంగా చూపుతుంది. ఉదాహరణకు ఐస్‌క్రీమ్ తింటే లావై పోతామన్న భయం మనలో చాలా మందికి ఉంటుంది. కానీ మెత్తటి మంచు రంగురంగుల్లో మన కళ్ళముందు తీయగా కదలాడుతుంటే, నోరు కట్టేసుకుని కూర్చోవడం సాధ్యం కాదు. సందేహిస్తూనే, ఒకింత దోషభావంతోనే మనం ఒక కప్పు ఐస్‌క్రీమ్‌ని లాగించేస్తుంటాం. అదిగో, అలా దోషభావంతో మీరు ఏ ఆహారాన్ని తీసుకున్నా, వెంటనే కోర్టికల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిని పెంచే హార్మోన్. దీని వల్ల దేహంలో కొవ్వు నిల్వలు పెరిగి పోతాయి. అందుకే తినే ముందు ‘దోషభావాన్ని’ వదిలేసి, తినండి. మన శరీరానికి దాని అవసరాల మేరకు ఆహారాన్ని జీర్ణించుకునే శక్తి ఉంటుంది. అలాగే స్థానికంగా లభించే పదార్థాలతో వండిన ఆహారాన్ని తినడమే శ్రేయస్కరం. స్థానికంగా లభించే పదార్థాలు మన జన్యువులకు అనుకూలంగా ఉంటాయి. సరైన నిద్ర, సమతుల ఆహారం, వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి కన్నా ఆరోగ్యానికి శ్రేయస్కరమైన సాధనాలు మరేవీ ఉండవు.
 

English Title
'Goodwill' is not correct
Related News