కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

Updated By ManamFri, 09/14/2018 - 19:37
Donwa Dethwelson Lapang
  • పార్టీకి డీడీ లపాంగ్ రాజీనామా

  • 4 సార్లు మేఘాలయ ముఖ్యమంత్రి

  • పార్టీ వైఖరి నచ్చకనే రాజీనామా

  • నేరుగా రాహుల్ గాంధీకి లేఖ

Donwa Dethwelson Lapang

షిల్లాంగ్, సెప్టెంబరు 14: మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన డోన్వా డెత్‌వెల్సన్ లపాంగ్ (డీడీ లపాంగ్) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సీనియర్ నాయకులను క్రమంగా పక్కన పెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోందని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆయనో లేఖ రాశారు. బాధాతప్త హృదయంతో తాను అయిష్టంగానే రాజీనామా చేస్తున్నట్లు ఆయన అందులో పేర్కొన్నారు. ఇలా సీనియర్లను పక్కన పెట్టాలన్న నిర్ణయం తనను ఎంతగానో అశాంతికి గురిచేసిందని, దాంతో ఇక పార్టీలో తాను ఏమాత్రం సౌకర్యవంతంగా ఉండలేనని భావించానని లపాంగ్ చెప్పారు. తొలిసారి 1992 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన లపాంగ్, ఆ తర్వాత వరుసగా 2003, 2007, 2009లలో కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గత మూడేళ్లుగా తాను లపాంగ్‌ను కలవలేదని మేఘాలయ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి లుయిజిన్హో ఫెలీరియో చెప్పారు. ఇటీవల పార్టీ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు షిల్లాంగ్ వెళ్లినపుడు కూడా ఆయనను కలవలేదన్నారు.

   గత సంవత్సరం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత, పార్టీ సలహాదారు పదవిలో లపాంగ్ కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చేయడంపై ఎంపీసీసీ అధ్యక్షుడు సెలెస్టైన్ లింగ్డో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏం జరిగిందో కనుక్కోడానికి ప్రయత్నిస్తానని, అవకాశం ఉంటే, పరిస్థితులను వీలైనంత త్వరగా చక్కదిద్దేందుకు చూస్తానని ఆయన అన్నారు. 
 

English Title
Ex Meghalaya Chief Minister Quits Party
Related News