నాట్య వేదాంతి... డా. సాయి జ్యోతి

Updated By ManamFri, 07/13/2018 - 01:40
Sai Jyoti

Sai Jyotiనాట్యం ఒక దివ్యమైన కళ. అందుకే దీన్ని పంచమవేదం అంటారు. ఆమె నాట్యాభ్యాసం చేస్తుంటే చిన్నప్పుడు ఆటవిడుపు అనుకున్నారు.  పసితనపు మనోఫలకం మీద గాఢమైన ప్రభావం చూపిన భరతనాట్యాభ్యాసం వయస్సుతోపాటు పరిపక్వం చెందిన ఆమె ఆలోచనలు కూచిపూడి నాట్యాభ్యాసం... పాలిశెట్టి సాయి జ్యోతి జీవితాన్ని కొత్త పుంతలు తొక్కించింది. జీవితంలో కష్టాలెదురైన ప్రతిసారీ నాట్యాభ్యాసంపై ఆమె పట్టు బిగించారు. మనోనిబ్బరాన్ని కూడగట్టుకున్నారు. అభ్యాసం నుంచి అధ్యయనం, ఆనక పరిశోధన స్థాయికెదిగారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారతీయ శాస్త్రీయ నృత్యాలపై పరిశోధక డాక్టరేట్ పొందిన తొలి మహిళగా, ఏకైక మహిళ వినుతికెక్కి నాట్య వేదాంతిగా అవతరించారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఆమెలో బిడియాన్ని, జంకునూ ఆమడ దూరం తరిమేశాయి. ‘కూచిపూడి నాట్యం ఆహార్యం’ అనే అంశంపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పరిధిలో కూచిపూడి కేంద్రంగా పనిచేస్తున్న సిద్ధేంద్రయోగి పీఠం ద్వారా డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి మార్గనిర్ధేశకత్వంలో 2017లో  పరిశోధక డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న సాయి జ్యోతి నాట్య ప్రస్థానం ఇలా మొదలైంది...

ఆంధ్ర విశ్వ కళాపరిషత్తులో ఆర్థశాస్త్ర అధ్యాపకుడు (ఎకనమిక్స్ ప్రొఫెసర్) కృష్ణబాబు, ఇందిర దంపతుల గారాలపట్టి ఈమె. తన ఐదో ఏట నుంచే రామలక్ష్మి అనే భరతనాట్యాచారిణి వద్ద అందెల రవళికి శ్రీకారం చుట్టారు. నాట్య విద్యాభ్యాసంలో అమ్మాయి అమితాసక్తి కనబర్చడంతో అమ్మ నాన్న మునుపటి కంటే ఎక్కువ ప్రోత్సహించారు. దాంతో చెన్నై వెళ్లి రుక్ష్మిణీదేవి అరుండేల్ కళాక్షేత్రంలో వసుంధరా థామస్ దగ్గర భరతనాట్యంలో మరిన్ని మెళకువలు అభ్యసించే అవకాశం వచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సాయిజ్యోతి నాట్య విద్యోన్నతికి రాచబాటలుగా మలచుకున్నారు. నాన్న ఉద్యోగరీత్యా విశాఖ నుంచి శ్రీకాకుళం సమీపాన ఎచ్చెర్లలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం స్టడీ సెంటర్‌కు మకాం మారడంతో సాయిజ్యోతికి అక్కడి నాట్యాచార్యుడు రఘుపాత్రుని శ్రీకాంత్ వద్ద శిక్షణ పొందే అవకాశం దక్కింది. ఆ తర్వాత మళ్లీ విశాఖలో ఆకుండి రామకృష్ణ దగ్గర భరతనాట్యాభ్యాసం కొనసాగించి విభిన్న వేదికలపై ప్రదర్శనలిచ్చి మెప్పు పొందారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుంచి భరతనాట్యంలో డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేశారు. భరతనాట్యం అభ్యసించే క్రమంలో నాట్యానికి సంబంధిం చిన అనేక పుస్తకాలు చదివి భారతీయ శాస్త్రీయ నృత్యాలపై అవగాహన పెంచుకున్నారు. ఆ క్రమంలో సాయి జ్యోతి దృష్టి తెలుగు గడ్డమీద మన కృష్ణా జిల్లా కూచిపూడిలో పుట్టిన ‘కూచిపూడి’ నాట్యం మీదికి మళ్లింది. ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి ఎం.ఎ. డ్యాన్స్ ఉన్నత విద్యాభ్యాసం చేస్తూనే కూచిపూడి నేర్చుకుంటానని ఇంట్లో ప్రతిపాదించినపుడు తల్లిదండ్రుల ఆమోదముద్ర లభించింది. అంతే సాయిజ్యోతి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. కూచిపూడి నాట్య సంస్కర్త పద్మవిభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం స్థాపించిన కూచిపూడి కళాక్షేత్రంలో 2005లో ప్రిన్స్‌పాల్ హరిరామ్మూర్తి, హనుమంతరావుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. సంప్రదాయ నాట్య విద్యాభ్యాసం ఒకెత్తయితే సాధనతోపాటు ప్రదర్శనా పటిమ, సామర్ధ్యం పెంపొందించుకోవడం మరో ఆవశ్యకత. జన్మత: వచ్చిన స్ఫురద్రూపం, కృతులకు అనుగుణంగా చక్కటి హావభావాలు ప్రదర్శించే నేర్పు, నైపుణ్యం ఆమెకు అదనపు అర్హతలుగా వచ్చిచేరాయి. నాట్యజ్యోతిగా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఆమెకు మార్గం సుగమం అయ్యింది. రాష్ర్టంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, సింహాచలం, విజయవాడ, అరసవల్లి, ద్వారకా తిరుమల వంటి ప్రాంతాల్లో ఆమె నాట్య ప్రదర్శనలకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలొచ్చాయి. పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శించిన ప్రతిసారీ పెద్దల ఆశీస్సులు, దైవకటాక్షం నాట్యకారిణిగా తను ఒక్కో మెట్టూ ఎక్కడానికి ఉపయోగపడ్డాయని ఆమె వినమ్రంగా చెప్పుకుంటారు. ఎం.ఎ. డ్యాన్స్‌లో తన సహచర విద్యార్థిని కేవీ లక్ష్మి నృత్యపరికల్పనలో పలు కూచిపూడి నృత్యరూపకాల్లో సాయిజ్యోతి ముఖ్య భూమికలు పోషించి మన్ననలందుకున్నారు. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమీ నిర్వహించే జాతీయ స్థాయి నృత్యోత్సవాల్లో పాయిజ్యోతి ఏకపాత్రాకేళి ప్రదర్శనలు సంప్రదాయ నృత్య ప్రియుల్ని సమ్మోహితుల్ని చేశాయి. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, భువేశ్వర్, చెన్నై వంటి ప్రధాన పట్టణాలతోపాటు దేశంలోని ఇతర ముఖ్య పట్టణాల్లోనూ ఆమెకు ప్రదర్శనావకాశాలొచ్చాయి. భరతనాట్యం, కూచిపూడి రెంటిలోనూ విశిష్ట నైపుణ్యం, ప్రదర్శనా ప్రావీణ్యం సంపాదించిన సాయిజ్యోతి జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా నాట్యసాన్నిహిత్యం వీడలేదు. దేశ విదేశీ నాట్యరీతులపై సదస్సులు, ప్రదర్శనలు ఎక్కడ జరిగినా వీలైనంత వరకూ అజ్ఞాత ప్రేక్షకురాలిగానైనా ఆమె హాజరవుతారు. కూచిపూడి నాట్యం ఆహార్యం అనే అంశంపై డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి మార్గనిర్ధేశకత్వంలో పరిశోధన పూర్తి చేసి 2017లో డాక్టర్ సాయిజ్యోతిగా ఇంకో మెట్టెక్కారు. 

ఉత్తరాంధ్ర జిల్లాల్లో శాస్త్రీయ నృత్యాలపై పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించిన ఏకైక మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. నాట్య నిపుణులు, సినీ తారలతోపాటు జిల్లా కలెక్టర్ నుంచి కేంద్ర మంత్రులవరకూ అనేక వేదికలపై ఆమె నాట్య ప్రావీణ్యాన్ని మెచ్చి పురస్కారాలెన్నో ఇచ్చి గౌరవించారు. అర్హుతలు, అనుభవం ఉన్న నాట్యాచార్యులకు డీఎస్సీ ద్వారా ప్రభుత్వోద్యోగాలు కల్పించాలని భావసారూప్యం కలిగినవారితో చేసే అన్ని పోరాటాల్లోనూ ఆమె ముందుంటారు. తనకు తెలిసిన విద్యను ప్రదర్శనల ద్వారా మెరుగుపర్చుకుంటూ పదుగురికీ భారతీయ నాట్యరీతుల్ని బోధించాలనే ఆమె జీవిత సంకల్పం తప్పక నెరవేరుతుందని ఆశిద్దాం.
రతన్ రాజు, ఫోన్: 9490263115

Tags
English Title
Dancing theologian ... Dr. Sai Jyoti
Related News