పుల్లవిరుపు మాటలతో తంటా!

Updated By ManamThu, 06/14/2018 - 20:26
Couples fight, themselves every problem, even if solution

(కుటుంబం) 
Couples fight, themselves every problem, even if solutionప్రతి సంసారంలో కలతలు, సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. వాటిని సవరించుకోవడం, అధిగమించడం అన్యోన్య దాంపత్యానికి ఎంతో అవసరం. దాంపత్య జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా కచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఈ పరిష్కారం అన్నివేళలా సంతోషాన్ని కలిగించేది కాకపోవచ్చు. అసంతృప్తి కలిగించేది కావచ్చు. అయినా ఆ పరిష్కారానికి విలువివ్వాలి.

చరణ్‌కు కొత్తగా పెళ్లయింది. భార్య భావనను ఏమాత్రం మెచ్చుకున్నా.. ఆమె చాలా ఆనందపడిపోతుందని అతనికి తెలుసు. అయినా అతను ఆమెను మెచ్చుకోడు. ఒక రోజు ఆమె పనీర్ కూర వండింది. అది చాలా రుచిగా ఉంది. అదొక్కటే కాదు, ఏ వంట చేసినా ఆమె రుచిగానే చేస్తుంది. అయినా ‘‘ఇవాళ కూరలో మసాలా ఎక్కువైంది’’ అన్నాడు చరణ్. ఆ మాటను చాలా మామూలుగా, అలవాటుగా అనేశాడు. ఆమెకు బాధ కలిగింది. ‘‘నువ్వెప్పుడూ ఇంతే.. కూర ఎంత బాగున్నా ఇలాగే అంటావ్’’ అని జవాబిచ్చింది. దాంతో చరణ్ అహం దెబ్బతింది. ‘‘ఎంత ఖర్చవుతోందో నీకు తెలుస్తుందా? ఇప్పుడు పనీర్ కూర అవసరమా?’’ అని ప్రశ్నించాడు. తన దగ్గరకు వచ్చేసరికే ఖర్చు సంగతి ఎత్తుతున్నావని భావన దెప్పి పొడిచింది. ఈ విధంగా ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్యా గొడవ రలుగుకుంటుంది.

ఒక రోజు భావన కొత్త చీర కట్టుకుంది. ఆ చీరలో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. ఆమెను మెచ్చుకోవాలనీ, మంచి మాటలు చెప్పాలనీ అనుకున్నాడు చరణ్. కానీ దానికి బదులుగా ‘‘ఎప్పుడూ నీకు ఈ చీరల గోలేమిటి?’’ అనేశాడు.
సహజంగానే ఆమె మనసు గాయపడింది. ‘‘పెళ్లయ్యాక ఎన్ని చీరలు కొనిపెట్టావేంటి?’’ అని ఎదురు ప్రశ్నించింది. 
‘‘మీ నాన్న నాకెంత కట్నం ఇచ్చాడేంటి?’’ అన్నాడు చరణ్. 
నిజానికి వాళ్లు సినిమాకు బయల్దేరుతున్నారు. అనవసరంగా ఇట్లాంటి గొడవలో చిక్కుకున్నారు. అయితే ఇది తాత్కాలికమే. అతి కొద్ది కాలంలోనే తానెలా మాట్లాడితే భావన సంతోషపడుతుందో గ్రహించాడు చరణ్. వ్యంగ్యంగా, పుల్లవిరుపుగా మాట్లాడే అలవాటును మానాలని అతను నిర్ణయించుకున్నాడు. ఇలా ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించడం దాంపత్య జీవితంలో చాలా ప్రధానమైన విషయం.
దాంపత్యానుకూల లక్షణాలున్నవాళ్లు ఎదుటివాళ్ల భావాల్నీ, ధోరణుల్నీ కచ్చితంగా అంచనా వేస్తారు. ఎదుటివాళ్ల మనసుని గుర్తించగలిగిన వ్యక్తి వాళ్లకు అనుగుణంగా, వాళ్లను ఆహ్లాదపరిచే ధోరణిలో ప్రవర్తిస్తాడు. తన దాంపత్య జీవనాన్ని సంతోషమయం చేసుకుంటాడు. 

తప్పు పట్టడమే పని
తమ సంసార జీవితం సుఖమయం చేసుకోవాలని నిర్ణయించుకోలేని వ్యక్తి ఎదుటివాళ్ల మనసును గుర్తించగలిగినా, దాని వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. భార్య ఏ మాట అంటే గాయపడుతుందో, ఏం చేస్తే బాధపడుతుందో గుర్తించి, దానికి తగ్గట్లు ప్రవర్తిస్తాడు భర్త. చీటికీ మాటికీ మాటలతో గాయపరచి వినోదిస్తాడు. భార్యాభర్తలు ఒకర్నొకరు మాటలతో బాధించుకున్నంతటి తీవ్రతతో ఇతరులు వీళ్లను బాధించలేరు. భార్యాభర్తలకు మాత్రమే ఒకరి బలహీనతలు మరొకరికి బాగా తెలుస్తాయి. ఏ మాట అంటే ఎదుటివాళ్లు కుమిలిపోతారో కూడా తెలుస్తుంది. 

వయసు ఎక్కువవుతున్న కొద్దీ ఎదుటివాళ్ల మనోభావాల్ని గుర్తించగలిగే శక్తి తగ్గిపోతుంటుంది. కొంతమంది యువతీ యువకులు ఎదుటివాళ్లను అవగాహన చేసుకోలేరు. తమ ధోరణిలో, తమ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి విషయాన్నీ అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఎదుటి వ్యక్తి ఒక మాట అంటే, వారు దాన్ని మరో రకంగా అర్థం చేసుకుంటారు. ఆ వ్యక్తి చేసే పనుల్ని తప్పు పడుతుంటారు. ఇట్లాంటివాళ్లు దాంపత్యంలో అనుకూలమైన సహచరులు కాలేరు. తమలో ప్రేరణలు, ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని సరైన రీతిలో అంచనా వేయగల శక్తి సహజంగానే కొరవడుతుంది. కానీ, అలా అంచనా వేయగలిగినవాళ్లే తమను తాము ఎలా నిగ్రహించుకోవాలో, ఎదుటివాళ్లతో ఎలా ప్రవర్తించాలో, ఎలా సర్దుకుపోవాలో గుర్తిస్తారు. అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తారు.
- ఎన్. సుభాషిణి

English Title
Couples may fight themselves every problem even if solution
Related News