దానం నా ముందు నువ్వో బచ్చా!!

Updated By ManamSun, 06/24/2018 - 20:15
Congress Leader Anjan Kumar Yadav Slams Danam Nagender

Congress Leader Anjan Kumar Yadav Slams Danam Nagender

హైదరాబాద్‌: మాజీ మంత్రి దానం నాగేందర్‌‌కు ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ గూలాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే దానం పార్టీని వీడి వెళ్లడంతో ఆయనపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్‌లో.. కాంగ్రెస్‌ హైదరాబాద్‌ నగర అధ్యక్షుడు మాట్లాడుతూ.." దానం టీఆర్ఎస్‌లోకి పోవడం వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదు. నాకు పార్టీ నగర అధ్యక్ష పదవి ఇప్పించానని దానం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నువ్వు పార్టీలు మారిన వాడివి. నాకు హైదరాబాద్ అధ్యక్ష పదవి ఇప్పించేంత సీన్‌ నీకు లేదురా బాబూ. మేం ఆల్రెడీ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాం. నీ మాదిరి మేం పార్టీలు మారుతూ రాలేదు. నేను హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వడంతోనే దానంకు భయం పట్టుకుంది" అని ఆయన చెప్పుకొచ్చారు.

నా ముందు నువ్వో బచ్చా..!
"
కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ జీవితం ప్రారంభించాను.. ఎప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉంటా. నా ముందు నువ్వో బచ్చా. పార్టీ పోతే పోయావు సరే నాకు అన్యాయం జరిగిందని చెప్పడమెందుకు..? అసలు నీకు జరిగిన అన్యాయం ఏంది..?. ఒకానొక సమయంలో పార్టీ నుంచి బయటికెళ్లిన నిన్ను తీసుకొచ్చి మళ్లీ మంత్రి పదవి ఇచ్చారు ఈ విషయం గుర్తుందా..?. అసలు ఇది ఎక్కడైనా సాధ్యమవుతుందా..?. పి. జనార్ధన్ రెడ్డి మరణిస్తే.. పార్టీ మారిన దానంను తీసుకొచ్చి పోటీ చేయించి గెలిపించి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం సరైన పద్ధతి కాదు. పార్టీ మారినోడికి సిగ్గు లేదు.. పార్టీలో చేర్చుకున్నోడికీ సిగ్గు లేదు.!. సీఎం కేసీఆర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆయన జతలోకే మరో తోడుదొంగ దానం చేరుకున్నారు" అని తీవ్ర విమర్శలు గుప్పించారు. 

దానం పార్టీని వీడినంత మాత్రాన కార్యకర్తలెవ్వరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అంజన్ ధీమా వ్యక్తంచేశారు.

English Title
Congress Leader Anjan Kumar Yadav Slams Danam Nagender
Related News