అమరావతికి రండి!

Updated By ManamWed, 06/13/2018 - 23:55
babu
  • ఒక్కొక్కరూ ఒక్కో నిర్మాణం చేపట్టండి

  • ఐకానిక్ నిర్మాణాలతో పేరు తేవాలి.. చక్కటి అవకాశాన్ని వినియోగించుకొండి

  • రియల్ ఎస్టేట్ దిగ్గజాలను కోరిన చంద్రబాబు.. ఆ సంస్థలు ముందుకొచ్చేలా ప్రత్యేక విధానం

  • దేశంలోని ప్రముఖ సంస్థల సూచనలు తీస్కోండి.. సీఆర్‌డీఏ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం

babuఅమరావతి: దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేస్, నిర్మాణ రంగ సంస్థలు అమరావతికి తరలిరావాలని, రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యమై ఒక్కొ నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులతో బుధవారం సచివాలయంలో ఆయన సమావేశం అయ్యారు. సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి నిర్మాణంలో తన ఆలోచనలను ముఖ్యమంత్రి వారితో పంచుకున్నారు. మహీంద్ర, షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, డీఎల్‌ఎఫ్, జీవీకే, హఫీజ్ కాంట్రాక్టర్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘‘మీరంతా అమరావతికి రండి. ఒక్కొక్కరూ కనీసం ఒక్కొక్క నిర్మాణాన్ని చేపట్టండి. ఐకానిక్ నిర్మాణాలతో మీ సంస్థల ప్రతిష్ఠను పెంచుకోవడమే కాకుండా అమరావతికి పేరు తీసుకురండి’ అని ముఖ్యమంత్రి కోరారు. చక్కటి అవకాశాన్ని ఇప్పుడు జార విడుచుకుంటే ఎప్పటికీ దాన్ని తిరిగి పొందలేని పరిస్థితులు మున్ముందు ఉంటాయి’’ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో అన్నారు. అమరావతిని  నాలెడ్జ్, ఎకానమీ సిటీగా, విశాఖను ఐటీ, హెల్త్ సిటీగా, తిరుపతిని ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఫిన్‌లాండ్, నార్వే దేశాలను రోల్‌మోడల్‌గా తీసుకుని ఏపీని సంతోష రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నామన్నారు. బ్రహ్మానందరెడ్డి పార్కు, నెక్లెస్ రోడ్, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు చేపట్టి హైదరాబాద్‌లో ఆహ్లాదాన్ని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. నదీతీరంలో గృహ సముదాయాలను నిర్మించడం ద్వారా ప్రపంచాన్ని ఆకర్షించవచ్చునని ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ చేసిన సూచనపై మాట్లాడుతూ, పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. పర్యావరణం పేరుతో కొంతమంది అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, కాలుష్యాన్ని నియంత్రించడానికి మాత్రం వారు ముందుకు రారని ఆయన వ్యాఖ్యానించారు.

నివాసయోగ్యమైన ప్రజా రాజధాని
అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని, నగరాన్ని అత్యున్నత సాంకేతికతను మేళవించి అత్యంత ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా డెవలపర్లకు వివరించారు. సైబరాబాద్ నగరాన్ని జతచేసి, మరే రాజధానిలో లేనట్టుగా 165 కిలోమీటర్ల మేర అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి హైదరాబాద్ రూపురేఖలనే మార్చేశామన్నారు. భాగ్యనగరాన్ని తీర్చిదిద్దిన అనుభవంతో ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కొత్త నగర నిర్మాణానికి పూనుకున్నామన్నారు. రాజధానిని నిర్మించుకోవడం సంక్షోభంలో వచ్చిన సదవకాశంగా సీఎం చెప్పుకొచ్చారు. కొత్తగా నిర్మించిన దేశంలోని కొన్ని రాష్ట్ర రాజధానులను పరిశీలిస్తే చండీగఢ్ పరిపాలనా నగరంగానే ఉండిపోయిందని, నయా రాయపూర్, గాంధీనగర్ జన సామాన్యానికి దూరంగా నిర్మాణమయ్యాయని అన్నారు. అమరావతి నిర్మించాలని అనుకున్నప్పుడు ప్రపంచంలో పలు అత్యుత్తమ నగరాలపై అధ్యయనం చేశామని, అందరికీ నివాసయోగ్యమైన ప్రజా రాజధానిని నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. సింగపూర్, అమ్‌స్టార్‌డ్యామ్ వంటి నగరాలకు లేని పరిశుద్ధమైన చక్కటి జల వనరులు అమరావతికి సొంతమని తెలిపారు. 2 వేల ఎకరాల మేర ద్వీపాలు కృష్ణానదిలో అమరావతికి ఆనుకుని ఉన్నాయని, రెండు రిజర్వాయర్లు కొత్తగా నిర్మిస్తున్నామని, సీఆర్డీఏ పరిధిలో ఉన్న చెరువులన్నీ నీటితో కళకళలాడేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మూడు కాల్వలతో విస్తరించిన విజయవాడ నగరం అమరావతికి జంట నగరమని, ఇదే కాకుండా సమీపంలోనే ఉన్న గుంటూరు నగరాన్ని కలుపుకొని రానున్న కాలంలో ఇది మహానగరంగా అవతరించనున్నదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

త్వరలో ప్రత్యేక విధానం రూపకల్పన
రాజధాని నిర్మాణంలో ముఖ్యమైన ప్రైవేట్ హౌసింగ్, ఆఫీసు స్పేస్, ఇతర నిర్మాణాల్లో రియల్ ఎస్టేట్ డెవలపర్లు ముందుకొచ్చేలా ప్రభుత్వ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ అంశంపై దేశంలో పేరుగాంచిన రియల్ ఎస్టేట్ సంస్థల సూచనలు తీసుకుని మార్గదర్శకాలు తయారుచేయాలని సూచించారు. వాటిని మంత్రిమండలిలో చర్చించి ప్రభుత్వ విధానం ప్రకటిద్దామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అమరావతిలో ఐటీ కంపెనీలకు ఐదేళ్లు ఉచితంగా ఆఫీసు స్పేస్ అందిస్తే ఎన్నో సంస్థలు ముందుకురావడమే కాకుండా పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని రియల్ ఎస్టేట్ ప్రతినిధి ఒకరు సూచించారు. దీనిపై తాము పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. భూములిచ్చి తిరిగి ప్లాట్లను పొందిన రైతులు ముందుకొస్తే వారి స్థలాలను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి చెప్పారు. అమరావతిని ప్రపంచంలో గొప్ప సంతోష నగరంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ తొలుత సమావేశంలో పాల్గొన్న డెవలపర్లకు వివరించారు.

నీతిఆయోగ్ భేటీని వాయిదా వేయాలి ఉపాధ్యక్షుడికి సీఎం చంద్రబాబు లేఖ
నీతిఆయోగ్ సమావేశాన్ని ఈ నెల 18వ తేదీకి వాయిదా వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌కు లేఖ రాశారు. ఢిల్లీలో ఈనెల 17వ తేదీ ఉదయం నీతి ఆయోగ్ 4వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ నెల 16న రంజాన్ పండుగ, 17న ఉదయం ఈద్ మిలాప్ ఉన్నందున.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను అమరావతిలో ఉండాలని, ఈ కారణంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని 18వ తేదీకి లేదా కనీసం 17వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేయాలని చంద్రబాబు లేఖలో కోరారు. తమ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని సీఎం అందులో పేర్కొన్నారు. కాగా, ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు బుధవారం అధికారులతో సమీక్షించారు. విభజన అంశాలు, కేంద్ర ప్రాజెక్టులకు అందిస్తున్న నిధులతో నివేదిక అందించాలని, అవసరమైన జిల్లాలకు ప్రత్యేక సహాయం అందుతున్న తీరుపై నీతి ఆయోగ్ చర్చనీయాంశాల్లో ఉందని, అందువల్ల సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. నీతి ఆయోగ్ గత సమావేశపు ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుకు కేంద్రం నుంచి ఏమేరకు సహకారం అందుతుందో తనకు సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విభజన హామీలతో పాటు వ్యవసాయరంగంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే అంశంలో, ఇ-నామ్, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు, భూసార స్థితి కార్డులు తదితర అంశాలపై నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

English Title
Come to Amravati!




Related News