కుప్పకూలిన మార్కెట్లు

bse

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) గీటురాయి ‘సెన్సెక్స్’ వరుసగా మూడో సెషన్‌లో గురువారం అమ్మకాల ఒత్తిడికి కుంగిపోయింది.

హువాయి అధికారి అరెస్టు
 చైనా టెలికాం దిగ్గజం హువాయి (వాళ్ళు వావెయ్ అని పిలుచుకుంటారు) ఉన్నత స్థాయి అధికారి ఒకరిని కెనడాలో అరెస్టు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు రగుల్కొన్నాయి. హువాయి చీఫ్ ఫినాన్షియల్ అధికారి మెంగ్ వాన్‌హూను అవెురికాకు అప్పగించేందుకు వీలుగా కెనడాలో అరెస్టు చేసిన తర్వాత, ఏషియన్ మార్కెట్లు పతనమయ్యాయి. ఆమె ఆ కంపెనీ స్థాపకుని కుమార్తె. ఇరాన్‌పై విధించిన ఆంక్షలు ఉల్లంఘనలకు గురైనట్లు అనుమానించడంతో ఆమెను అవెురికాకు అప్పగించే అంశం తెరపైకి వచ్చింది. కాగా, అవెురికా-చైనాల మధ్య అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలకు ఇది మరో ఆఘాతంగా పరిణమించింది. బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ ఏకంగా 572.28 పాయింట్లు పతనమై 35,312.13 వద్ద ముగిసింది. అదే విధంగా, నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 కంపెనీల సూచి ‘నిఫ్టీ’ 181.75 పాయింట్లు నష్టపోయి 10,601.15 వద్ద ముగిసింది. 
బి.ఎస్.ఇ, ఎన్.ఎస్.ఇ రెండింటిలోను అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఫినాన్షియల్ షేర్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ‘సెన్సెక్స్’లోని 30 షేర్ల పుంజీలో సన్ ఫార్మా ఒక్కటే గైనర్‌గా నిలిచింది. క్షీణిస్తూ వస్తున్న రూపాయి, విదేశీ ఫండ్ల నిధులు తాజాగా తరలిపోవడం ప్రారంభమవడం ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరచాయని విశ్లేషకులు చెప్పారు. ‘‘క్యాపిటల్ మార్కెట్లు తీవ్ర ప్రతికూల పరిణామాలను చవిచూశాయి. డాటాకు సంబంధించిన అనేక అంశాలు వాటిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. భారతీయ రూపాయిలో తీవ్ర బలహీనత తిరిగి బయటపడింది. చమురు ఉత్పాదనపై కోత విధించుకునే అంశంపై చర్చించుకునేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) సమావేశమవుతూండడం, ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాలు వెలువడనూండడంపై మర్కెట్లు దృష్టి పెట్టాయి. భయాందోళనలు స్పష్టంగా ద్యోతకమయ్యాయి. ఇది అది అని లేకుండా అన్ని పరిశ్రమల షేర్లలోను తీవ్ర అమ్మకాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ పాలనకు సంబంధించిన సమస్యలున్న కంపెనీల షేర్లు బాగా దెబ్బతిన్నాయి’’ అని సెంట్రమ్  బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ ఉపాధ్యక్షుడు, రిసెర్చ్ వెల్త్ విభాగ అధిపతి తునుగుంట్ల జగన్నాథం చెప్పారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు బుధవారం రూ. 357.82 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు కూడా రూ. 791.59 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించాయని బి.ఎస్.ఇ వద్ద అందుబాటులోనున్న తాత్కాలిక డాటా వెల్లడించింది. 

తగ్గిన క్రూడాయిల్ ధరలు
‘ఒపెక్’ దేశాల కీలక సమావేశానికి ముందు ముడి చమురు ధరలు పీపాకు 60 డాలర్ల కన్నా దిగువకు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ 2.76 శాతం తగ్గి, పీపా 59.86 డాలర్లుగా పలుకుతోంది. తగ్గుతున్న ముడి చమరు ధరలను నిలబెట్టేందుకు చమురు ఉత్పాదనలో ‘‘తగినంతగా’’గా కోత విధించుకోవాలని ‘ఒపెక్’ చూస్తోందని సౌదీ అరేబియా చమురు మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ చెప్పారు.

క్షీణిస్తూ వస్తున్న రూపాయి
డాలర్‌తో మారకంలో రూ. 70.82 వద్ద బలహీన స్థితిలో ఆరంభమైన రూపాయి తర్వాత మరింత క్షీణించి రూ. 71.14 కనిష్ఠ స్థితిని చూసింది. చివరకు బుధవారం నాటి ముగింపు విలువకన్నా 44 పైసలు తక్కువగా రూ. 70.90 వద్ద స్థిరపడింది. డాలర్లకు డిమాండ్ పెరగడమే రూపాయి క్షీణతకు కారణమని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు.

సంబంధిత వార్తలు