కార్పొరేట్ మృత్యుఘంటికలకు చరమగీతం

Updated By ManamThu, 06/14/2018 - 00:03
image

imageఇంటి కంటిపాపలు కన్నీరు పలుకుతున్నాయి. భావి భారత పౌరులుగా మనాల్సిన వాళ్ళు మరణశయ్యపై వేలాడుతు న్నారు. పోటీ పరీక్షలైనా, వార్షిక పరీక్షలైనా వారి పాలిట య మకింకరులుగా మారుతున్నాయి. జీవిత గమ్యానికి, గమనానికి నావకి చుక్కానిలా దారి చూపాల్సిన పరీక్షలు ఆశల సౌథాలకు గండికొడితే అంతమొందించుకోవడమే శరణ్యమవుతోందా అన్నది వేధిస్తున్న ప్రశ్నలు. ఆశలకు, ఆశ యాలకు అంతరం ఏర్పడితే మరణమే శరణ్యమా అని ఒక్క సారి ప్రశ్నించుకుంటే కడలిలాంటి అవమానసాగరాన్ని అవ లీలగా ఈదవచ్చు. మనిషి పుట్టుకే కష్టాల కడలి అన్నది నిజం కాదా? స్వల్ప తప్పిదాలకు చావే శరణ్యమంటే మానవ సమాజం మనగలుగుతుందా? అకారణంగానో, అన్యాయం గానో విధివంచితులు అయిన వారు సైతం నిలదొక్కుకుని సగర్వంగా దేశ, విదేశాలల్లో వేదికలపై తమ అసమాన ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్ద్యాలకు కీర్తిని, సత్కారాన్ని పొంది సగౌరవంగా సమాజంలో తలెత్తుకుని జీవితాలను ఆహ్లాదభరితంగా చేసుకుని ముందుకు సాగుతుంటే అంతకం టే విధివంచితులు మీరెలా అవుతారు? చిన్న, చిన్న తప్పి దాలకు మట్టుబెట్టుకోవడమే మందు అనుకుంటే మానవ సమాజం మొత్తం స్మశానంగా మారుతుంది. మేలిమి విద్యతో భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది భవిష్యత్ భారత్ నిర్మాత లుగా వెలుగొందాల్సిన వారు, భారంగా పరిణమించి భవి ష్యత్‌ను చెరిపివేసుకుంటే భారతమాత తల్లడిల్లుతోంది.

ఆధునిక యుగంలో ఆధునిక విద్యతో మేలిమి మానవ వనరులను తయారుచేసి నవభారత్ నిర్మాణంలో పాలు పం చుకొనేలా తయారుచేయాలని విద్యారంగంలో కాలానుగుణం గా సమూలంగా ప్రక్షాళన చేస్తున్నా కొంతమంది విద్యార్థు లకు కనువిప్పు కలగడం లేదు. పోటీ పరీక్షలలో అసమాన పోటీ సహజమే కానీ, విజేతలుగా కొద్దిమంది మాత్రమే నిలుస్తారన్న విషయం మరువద్దు. ఏ పోటీలో అయినా అందరూ విజేతలు కాలేరు అన్న విషయము తెలియదంటారా?జాతీయ వైద్యవిద్య అర్హత ప్రవేశపరీక్ష (నీట్)లో రాణించలేకపోయా నన్న మనస్తాపంతో జస్లీన్ కౌర్ అనే హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని పది అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అదే తెగువ, పటిమ అపజయాన్ని దిగమింగడం పై పదోవంతు అయినా చూపిస్తే కనిపెంచిన వారి గర్భ శోకాన్ని ఆపేది కాదా? సంవత్సరాల తరబడి పెంచి పోషిం చిన వారికి గర్భశోకాన్ని తెచ్చిపెట్టి ఏమి సాధించినట్లు? అవమానంతో ఆత్మహత్యకు ఒడిగడితో విజయం దక్కిందా? వివేకంతో ఆలోచించి ఎదురీదితే అపజయం పారిపోతుంది. విద్యావిధానంలోని లోపాలు పెనుశాపంగా మారుతున్నా యా? పసిమొగ్గల మనసులకు ఆధునిక విద్య ప్రతిబంధకం అవుతోందా? జయాపజయాలను చవిచూడకుండా అందరికీ ఒకేసారి తమ గమ్యాన్ని ముద్దాడే అవకాశముంటుందా! చేతి వేళ్ళు సమానంగా ఉంటే పట్టు దొరుకుతుందా అన్నది సందేహం. ఆత్మన్యూనతతో, పరీక్షల ఒత్తిళ్ళకు తగ్గి పదుల వయస్సులో తనువు చాలించి మానవ వనరులు వృథా కాబడుతుంటే దేశానికి భారంగా పరిణమించి జీవితానికి అర్థం లేకుండా చేస్తున్నారు.
దేశంలో విద్యార్దుల ఆత్మహత్యల పరంపర కొనసాగు తూనే ఉన్నది. విద్యా విధానంలో అనేకమంది మహనీయుల గురించి, విధికి ఎదురు నిలిచి అజేయులుగా నిలిచిన వారి జీవితాలను పాఠాలుగా భోదించడం ఎందుకో అన్నది విస్మ రించి వారినుంచి స్ఫూర్తి పొందకుండా అపయాలకు కుంగి పోయి తనువు చాలిస్తున్నారు. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల పరంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ తొలి అయిదు స్థానాల్లో నిలుస్తున్నాయి. అసామాన్యమైన ప్రతిభను కనబరిచి ఐఐటి, ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశం పొందనివారు ఒత్తిళ్ళను అధిగమించలేక ఆత్మహత్యలకు ఒడిగడుతున్న సందర్భాలు విదితమే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ విద్యార్థుల ఆత్మ హత్యలు పరంపర కొనసాగుతున్నది తప్ప అడ్డుకట్ట పడడం లేదు. చిన్నచిన్న సమస్యలకే తమ జీవితాలకు ఉరితాడును పేనుకుంటే జీవితభారాన్ని ఎలా మోయగలుగుతారు? విద్యావిధానంలోని విలువలు విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో వైఫల్యం చెందుతున్నాయా అన్నది ఎందరినో తొలుస్తున్న ప్రశ్న. ఆధునిక యుగంలో మానవులు అనుభవిస్తున్న అనేక మేటి ఆవిష్కరణలు ఏ ఒక్కరోజులోనో ఆవిర్భవించలేదు. గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కృషిచేసి తమ జీవితాలను ధారపోసి సృష్టించిన, ఆవిష్కరించిన ఆవిష్కరణలు మానవాళికి విలాస వంతమైన జీవితాలను గడపడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రపంచంలో, దేశంలో ఆధునిక విజ్ఞానం విస్తరిస్తూ, నూతన ఆవిష్కరణలతో ప్రపంచం నలుమూలలా జరిగిన సంఘట నలు తెలుసుకుంటూ మానవ మేధస్సు అప్రతిహత యాత్ర ను కొనసాగిస్తున్నది. కానీ వివేకం, విజ్ఞానం విస్తరిస్తున్నా పోటీని ఎదుర్కొని, ఒత్తిళ్ళక లొంగకుండా ధైర్యంగా ముందుకు సాగడానికి అడుగులు ఎదురుతిరుగుతున్నాయి.

అనేక ఆవిష్కరణలకు ఓటమే సోపానంగా నిద్రాహారాలు లేని రాత్రులతో మొండిగా శ్రమించి చరిత్రలో తనకంటూ పుటలను సృష్టించి, వందల సంవత్సరాలుగా అజేయులుగా నిలుస్తుంటే వారి జీవిత పాఠాలు విద్యార్థులకు కనువిప్పు కావడం లేదు. బల్బును కనుగొన్న థామస్ అల్వా ఎడిసన్ వందల సార్లు ఓటమిని చవిచూసి, అయినా వెరవక, వెనక్కి తిరగక చేసిన అసమాన అద్బుత సృష్టి నేడు మానవుల జీవి తాలకు ఎంతగా ముడిపడిందో అన్నది జగమెరిగిన సత్యం. ఓటమి భారంతో వెనక్కి తగ్గితే అద్భుత ఆవిష్కరణకు బీజం పడేదా? విద్యార్థులకు చదువే సర్వస్వం కాదు అన్న నిజాన్ని విస్మరిస్తున్నారు. అత్తెసరు మార్కులతో, ఆపసోపాలు పడి ఉన్నతవిద్యను కూడా అభ్యసించలేని వారు తమ కళతో, ప్రతిభతో, కోట్లు, కీర్తిని గడిస్తూ అజేయులుగా వెలుగొందు తున్నారు.ఇలాంటి మహామహులు జీవిత పాఠాలు విద్యార్థు లకు కనువిప్పును కలిగించడం లేదు. అరచేతిలో విజ్ఞానం విస్తరించి ముందుకు సాగుతున్నా ఆలోచనలో అనాగరికంగా అడుగులు వేస్తూ తమ జీవితాలకు తామే మరణశాసనం లిఖించుకుంటున్నారు.విద్యార్థుల్లో గూడుకట్టిన ఒత్తిళ్లను దూదిపింజంలా తేలికచేసే చర్యలు ముఖ్యంగా తల్లిదండ్రు లు, గురువులు, విద్యావ్యవస్థపై నెలకొన్నది. విద్యాలయాల్లో పాఠ్యాంశాలతో పాటు జీవితాన్ని ఎదురీదే పాఠాలను సైతం బోధించాలి. మార్కులే కొలమానం కాకుండా, మానసికంగా దృఢంగా చేసే పాఠాలు సైతం నేర్పాలి. ఉమ్మడి కుటుంబాలు అంతరించి, చిన్న కుటుంబాలు ఏర్పడి తమతమ వృత్తి పరమైన పనుల్లో మునిగితేలి కలిసి చర్చించుకొనే వారి సంఖ్య నానాటికీ కుచించుకుపోతోంది. కార్పొరేట్ మాయలో పడిన ఉన్నత విద్యావిధానం, ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలు విపరీతమైన ఒత్తిళ్ళకు గురిచేస్తున్నాయి. వేలాదిమంది పోటీ పడే పరీక్షలో జయాపజయాలు అలానే ఉంటాయి అన్న స త్యాన్ని గ్రహించకుండా అవమానభారంతో అశువులు బాసు ్తన్నారు. విద్యార్థుల ఇష్టాయిష్టాలపైనే కోర్సుల ఎంపిక జరిగి, వారికి స్వేచ్ఛ నివ్వాలి. ఒకవేళ అనుకోని విధంగా అపజ యాన్ని చవిచూస్తే గుడ్డిగా కొనసాగకుండా తమ ఇష్టాయిష్టాల వైపు దృష్టి సారించాలి. లేకపోతే సంవత్సరాల తరబడి జీవి తాన్ని కొనసాగించాల్సిన వారు పదుల ప్రాయంలోనే పరమ పదించే అంశాలను పరిశీలించే అవకాశం లేకపోలేదు. పరీక్ష లే జీవితం కాదన్న జీవిత సత్యాన్ని బోధించాలి. ఒక్క ఓటమి తోనే జీవితం పరిసమాప్తం కాదన్న విషయాన్ని చిరుమెదళ్ళలోకి ఎక్కించాలి.

- ఎ.శ్యామ్ కుమార్,
9848529035

English Title
The climax of corporate mortgages
Related News