డ్రంకెన్ డ్రైవ్‌కు ప.గో జిల్లా యువకుడు బలి!

Updated By ManamSun, 07/22/2018 - 18:46
Civils Student Mahanth Kumar Died In Drunk and Drive

Civils Student Mahanth Kumar Died In Drunk and Drive

హైదరాబాద్: నగరంలో వారానికి రెండు మూడు సార్లు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తూ మందుబాబులకు దఢ పుట్టిస్తున్నారు. పట్టుబడిన వారికి తల్లిదండ్రుల ముందు కౌన్సిలింగ్ ఇచ్చి మరీ గట్టిగా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడే వారి సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. పీకల్లోతు మద్యం తాగి వాహనం నడపడమే తప్పు.. వారి వాహనాన్ని పోలీసులు ఆపితే ఆ తాగుబోతు వాహనదారులు ఓవరాక్షన్‌ను ఇక చూడలేం.. ఆ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే.. మరికొందరైతే డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ రోడ్డుమీద వాహనాలను, డివైడర్లను, మెట్రో పిల్లర్లను ఢీ కొట్టి చేజేతులారా నిండు ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లోని ఎస్ఆర్‌నగర్‌కు సమీపంలోని లాల్‌బంగ్లా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

సివిల్స్ ఎగ్జామ్‌కు ప్రిపేరవుతున్న మహంత్ కుమార్ అనే యువకుడు మిత్రుడి పుట్టినరోజు పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేశాడు. పంజాగుట్టలో చేసుకున్న పార్టీలో మద్యం సేవించి అనంతరం టూవీలర్‌పై తిరిగి హాస్టల్‌కు వెళ్లేందుకు మహంత్, అతని మిత్రుడు నిఖిల్ పయనమయ్యారు. మద్యం మత్తులో ఉండటంతో బైక్‌ను కంట్రోల్ చేయలేక డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మహంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిఖిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై నిఖిల్‌ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు చెబుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. మహంత్‌ స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా అని తెలిసింది. సివిల్స్ చదివి ప్రయోజకుడవుతాడని హైదరాబాద్‌కు వెళ్లిన కుమారుడు చనిపోయాడని తెలుసుకున్న మహంత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరారు. ఇదిలా ఉంటే పోస్టుమార్టం నిమిత్తం మహంత్ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా.. చదువుకున్న, నాలుగు విషయాలు తెలిసిన యువకులే ఇలా డ్రంకెన్ డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం. తాగిన మైకంలో వాహనాలు నడిపి ప్రమాదానికి గురై తల్లిదండ్రులకు శోకం మిగిల్చి తిరిగిరాని లోకాలు చేరుకుంటున్నారు.

English Title
Civils Student Mahanth Kumar Died In Drunk and Drive
Related News