బాల్డ్ అండ్ బ్యూటిఫుల్

Updated By ManamSun, 04/29/2018 - 01:47
image

imageబ్యూటీ కాంటెస్ట్‌ల ట్రెండ్ మారుతోంది. అందంతో పాటు ఇతర అంశాలకు ప్రాధన్యతనిచ్చే వేదికలుగా మారిన ఈ కాంటెస్ట్‌లు పలు శారీరక, మానసిక రోగాల బారిన పడిన వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా సాగుతున్నాయి. ఓవైపు యాసిడ్ బాధితులు, మరోవైపు దివ్యాంగులు, ఇంకోవైపు మానసికంగా ఎదిగీ ఎదగనివారు సైతం క్యాట్ వాక్‌లు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు వివిధ రుగ్మతలతో బాధపడుతున్నవారు కూడా అందాల పోటీల్లో పాల్గొంటూ తమలో ఉన్న కాంపిటీటివ్ స్పిరిట్‌ను చాటుకుంటున్నారు. తాజాగా అమెరికాలో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి చూపిన తెగువ ఇంటర్నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించిన తీరు హైలైట్‌గా నిలుస్తోంది. జోస్లిన్ లార్సన్ అనే ఈ చిన్నారి చిన్నవయసుకే  అలోపెసియా అరీటా కారణంగా జుట్టు క్రమంగా రాలుతుంటే మొద ట్లో హెడ్ బ్యాండ్ పెట్టుకుని బయటికి వెళ్లేది. కానీ జుట్టు రాలడం మరింత తీవ్రమయ్యాక ఇక హెడ్ బ్యాండ్‌ను కూడా తీసేసి తిరగడం ప్రారంభించింది. ఎవరైనా విచిత్రంగా చూస్తే.. తనకున్న వ్యాధి, దాని లక్షణాల గురించి వివరించేది. అందాల పోటీలంటే తెగ మక్కువ చూపే ఈ చిన్నారి లిటిల్ మిస్ విస్కన్‌సిన్ పోటీల్లో పాల్గొని అదరగొట్టింది. టైటిల్ కూడా నెగ్గాక తనలో మరింత ఆత్మవిశ్వాసం వచ్చిందంటూ లెక్చర్లు దంచుతోంది. ఈ లిటిల్ బ్యూటీ సెలబ్రిటీగా మారిపోయింది కూడా.

మిస్ అమెరికా కోసం..
మిస్ అమెరికా టైటిల్ సాధించడమే చిన్నప్పటి నుంచీ లక్ష్యంగా పెట్టుకున్న ఓ అమ్మాయికి ఉన్నట్టుండి జుట్టు రాలడం మొదలైంది.image ఏం చేసిన ఇది తగ్గకపోగా.. నామమాత్రంగా మాత్రమే జుట్టు మిగిలింది. దీంతో తలను షేవ్ చేసుకుని.. అప్పుడప్పుడు మాత్రమే విగ్ ధరించేది. ఉన్నట్టుండి అమెరికన్ మీడియాలో ఈమె తళుక్కుమనడం చూసి అందరూ అవాక్కయ్యారు. ఇందుకు కారణం తన కలను నెరవేర్చుకునే దిశగా ఈమె మిస్ అమెరికా పోటీల్లో పాల్గొనడమే...అది కూడా విగ్గు లేకుండా!  స్టీరియోటైప్ బ్యూటీ కాంటెస్ట్‌లకు బ్రేక్ ఇచ్చేలా కైలా మార్టెల్ ఇలా పోటీల్లో పాల్గొనడం అందరినీ ఆకట్టుకోవడం అన్నీ చకచకా గడిచిపోయాయి. మిస్ అమెరికా ఫైనల్స్‌లో కైలా ఆత్మవిశ్వాసం జడ్జిలకు షాక్ ఇచ్చింది. జుట్టు లేకపోయినా అందవిహీనంగా కనిపించరని.. ఇందుకు తానే నిలువెత్తు ఉదాహరణ అని ఓపెన్‌గా చెప్పడం అందరినీ శెభాష్ అనేలా చేసింది. 22 ఏళ్ల వయసుకే అలోపెసియా అరీటా కారణంగా తనకు జుట్టు విపరీతంగా రాలిపోయిందని.. ఇందుకు భయం, సిగ్గు, ఆత్మన్యూనత ఎందుకు? అంటూ ఆమె ప్రశ్నించిన తీరు అందరినీ ఆలోచింపజేసింది.  ఆఖరుకి విగ్గుకూడా పెట్టుకోకుండా అందాలపోటీలకు వచ్చి తనలాంటి వారి ఆలోచనా ధోరణిలో స్పష్టమైన మార్పు తెస్తూ, తమను వికారంగా చూడడం ఆపేయాలంటూ సరికొత్త ఉద్యమానికి కైలా శ్రీకారం చుట్టుంది. బ్రిటన్‌లో 1.7శాతం మంది స్త్రీ, పురుషులు దీని బారిన పడి జుట్టు లేక.. చాలా భారంగా తమ జీవితాలను గడుపుతున్నారు.  వీరిలో అత్యధికులు మానసిక వ్యాధులబారిన పడి సతమతమవుతున్నారు. జుట్టు రాలడం, బట్టతలతో ఉన్నవారు సర్జరీలు చేయించుకోవడం ద్వారా శారీరక, ఆర్థిక శ్రమ తీసుకోవడం ఇకనైనా ఆపాలంటూ ఇలాంటివారు చేస్తున్న ప్రచారానికి మంచి ఆదరణ లభిస్తోంది.  అందమంటే నిర్వచనం మార్చేలా చేస్తున్న వీరి సాహసం గొప్పగా ఉందికదూ!

English Title
Bold and Beautiful
Related News