బాలరాజు బై.. బై..!

Updated By ManamThu, 10/11/2018 - 09:50
balaraju
  • కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

  • నేరుగా రాహుల్‌గాంధీకి లేఖ

  • జనసేనలో చేరే అవకాశం

  • టీడీపీ పొత్తుతో మరో షాక్

balarajuవిశాఖపట్నం: తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో వరుసపెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లో ఉన్న మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పసుపులేటి బాలరాజు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ మేరకు అధికారికంగా పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి రాజీనామా లేఖ కూడా సమర్పించారు.

1985లో మండల అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన బాలరాజు.. తర్వాత ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఒక దశలో ఆయన వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతారని వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ, అప్పట్లో ఏమీ స్పందించకుండా మౌనంగా ఉండిపోయిన బాలరాజు.. ఇప్పుడు ఒకేసారి రాజీనామా లేఖను కూడా పంపేయడం గమనార్హం. ప్రస్తుతం విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన... గురువారం చింతపల్లిలో పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యక్రమం గురించి వాళ్లందరితో చర్చించినట్లు తెలుస్తోంది. ‘‘కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే భవిష్యత్ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.. ప్రత్యామ్నాయ పార్టీ జనసేన ఒక్కటే కనిపిస్తోంది.. మీ అందరూ అంగీకరిస్తే జనసేనవైపు వెళ్దాం’’ అని డీసీసీ అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల వద్ద అన్నట్టు తెలిసింది.

కార్యకర్తల అభిప్రాయమే తన అంతిమ నిర్ణయమని పేర్కొన్నారు. అయితే తాను జనసేన వైపు వెళుతున్నదీ.. లేనిదీ స్పష్టం చేయకుండా బాలరాజు మాట్లాడినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన పలువురు ముఖ్య నాయకులను ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడారు. మాజీ మంత్రి అభిప్రాయాన్ని మన్నించి కొంతమంది కార్యకర్తలు జనసేనలో చేరకకు అంగీకరించగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా విభేదించినట్టు తెలుస్తోంది.

చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్నామని, ఈ నాలుగేళ్లు కాంగ్రెస్ నాయకులుగా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నామని,  గెలిచినా.. ఓడినా.. కాంగ్రెస్‌లోనే కొనసాగుదామని బాలరాజుతో పలువురు నేతలు చెప్పినట్లు తెలిసింది. అయితే జనసేనలో చేరేందుకు ఆయన ముహుర్తం కూడా సిద్ధం చేసుకున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. 

English Title
Balaraju Bye Bye Bye!
Related News