'బాల‌కృష్ణుడు' రివ్యూ

Updated By ManamFri, 11/24/2017 - 20:45
balakrishnudu

సంస్థః శరచ్చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయాబ‌జార్ మూవీస్‌

చిత్రంః బాలకృష్ణుడు

నటీనటులు: నారా రోహిత్, రెజీనా, రమ్య‌కృష్ణ, కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్, పృథ్వీ, అజయ్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, సత్య, ప్రవీణ్, రఘుబాబు, రవివర్మ తదితరులు

సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

సంగీతం: మ‌ణిశర్మ

కథ, మాటలు: కొలుసు రాజా

నిర్మాతలు: బి.మ‌హేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీవినోద్ నందమూరి

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పవన్ మ‌ల్లెల

balakrishnuduతెలుగు సినిమా కథలు ఫ్యాక్షన్ వైపు మ‌ళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలపాటు ఆ తరహా సినిమాలనే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. అది ప్రేమ‌ కథ అరుునా, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో నిండిన కథ అయినా దానికి ఫ్యాక్షన్ అనే ట్యాగ్‌ని తగిలించి అవసరం మేరకు కామెడీని కూడా జోడించి విజయాలు సాధించారు దర్శకులు. కాలం మారింది, ట్రెండూ మారింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలకు జనం ఎప్పుడో జనగణమ‌న పాడేసారు. ట్రెండ్‌ని ఫాలో అవ్వని కొంతమంది దర్శకులు, నిర్మాతలు మాత్రం అలాంటి కథలనే పట్టుకొని ఇంకా వేలాడుతున్నారు. అలా ఓ పాత చింతకాయ పచ్చడిలాంటి కథతో రూపొందిన సినిమాయే శుక్రవారం విడుదలైన ‘బాలకృష్ణుడు’. నారా రోహిత్, రెజీనా జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా పవన్ మ‌ల్లెల దర్శకుడుగా పరిచయమ‌య్యాడు. మ‌రి ఈ చిత్రం కథ, కథనాలు, నటీనటుల పెర్‌ఫార్మెన్స్, డైరెక్టర్ టేకింగ్ ఎలా వున్నాయో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

క‌థః

కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమ‌వుతుంది కథ. ఉయ్యాల‌వాడ‌ రవీందర్‌రెడ్డి(ఆదిత్య మీనన్)కి నాయకుడిగా మంచి పేరుంది. అతని ప్రత్యర్థి బసిరెడ్డి(రావురాజు).. రవీందర్ ముందు నిలవలేకపోతాడు. రవీందర్ వల్ల అవమానం జరగడంతో ఆత్మహత్య చేసుకుంటాడు. అది చూసి తట్టుకోలేని అతని కొడుకు ప్రతాప్‌రెడ్డి(అజయ్).. రవీందర్‌ని హత్య చేస్తాడు. ఆ నేరం కింద జైలు కెళతాడు. సీమ‌లో ఫ్యాక్షన్ అనేది నశించాలి, అందరూ చదువుకొని వృద్ధిలోకి రావాలన్న రవీందర్ కలని అతని చెల్లెలు భానుమ‌తీ దేవి(రమ్య‌కృష్ణ) నిజం చెయ్యాలనుకుంటుంది. ఏళ్ళు గడుస్తాయి. జైల్లో వున్న ప్రతాప్‌రెడ్డి పగతో రగిలిపోతుంటాడు. రవీందర్ కూతురు ఆద్య(రెజినా)ను ఈ పగ, ప్రతీకారాలకు దూరంగా వుంచి చదివిస్తుంటుంది భానుమ‌తి. ఆమెను అనుక్షణం కాపాడేందుకు ఓ బాడీగార్డ్‌ను ఆమెకు తెలియకుండా నియమిస్తుంది. అతనే బాలు(నారా రోహిత్). ఆద్య పక్కింటిలోనే అద్దెకు దిగి ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఓ పక్క ప్రతాప్‌రెడ్డి మ‌నుషులు ఆద్య చిన్నప్పటి ఫోటో పట్టుకొని ఆమె కోసం, బాడీగార్డ్‌గా వున్న బాలు కోసం వెతుకుతుంటారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సత్ప్రవర్తన వల్ల ప్రతాప్‌రెడ్డి విడుదలయ్యేలా చేస్తారు అధికారులు. ఆద్యను ఓ ఎటాక్ నుంచి కాపాడి కారులో తీసుకొస్తుంటాడు బాలు. అప్పుడు వారికి ప్రతాప్‌రెడ్డి ఎదురవుతాడు. వాళ్ళిద్దరూ ఎవరో తెలీని ప్రతాప్‌రెడ్డి లిఫ్ట్ అడిగి కారెక్కుతాడు. ప్రతాప్‌రెడ్డిని ప్రాణాలతో అప్పగించినా, చంపినా 10 కోట్లు బహుమ‌తి ప్రకటిస్తుంది భానుమ‌తి. ఈ విషయం తెలుసుకున్న బాలు.. ప్రతాప్ రెడ్డిని తెలివిగా బంధిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బాలు.. ప్రతాప్‌రెడ్డిని భానుమ‌తికి అప్పగించి 10 కోట్లు తీసుకున్నాడా? తను వెతుకుతున్న వాళ్ళే తనని బంధించారని ప్రతాప్‌రెడ్డి తెలుసుకున్నాడా? ప్రతాప్‌రెడ్డి నుంచి కాపాడి ఆద్యను క్షేమంగా భానుమ‌తి దగ్గరకు చేర్చడంలో బాలు సక్సెస్ అయ్యాడా? కథ ఎన్ని వులుపులు తిరిగింది? కథ సుఖాంతమైందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేష‌ణ‌

మెుదలైనప్పటి నుంచి ముగిసే వరకు సినిమాలో ఒక్క కొత్త పాయింట్ కూడా మ‌నకు కనిపించకపోవడం ప్రేక్షకుల్ని షాక్‌కి గురి చేస్తుంది. మ‌నం ఎన్నో సినిమాల్లో చూసిన కథ. చూసి చూసి విసుగెత్తిన క్యారెక్టరైజేషన్లు. అవే రొటీన్ డైలాగులు, రొటీన్ కామెడీ. అదే కమ‌ర్షియుల్ ఫార్ములా. సినిమాలో ఏ ఒక్కరి క్యారెక్టరైజేషన్ కూడా పకడ్బందీగా అనిపించదు. ఏదో అల్లాటప్పాగా కథ రాసేసుకొని, పాత సినిమాల్లోని స్క్రీన్‌ప్లేనే ఈ సినిమాకీ అప్లై చేసేసినట్టు అనిపిస్తుంది. రమ్య‌కృష్ణ చేసిన భానుమ‌తి క్యారెక్టర్ నిజానికి చాలా పవర్‌ఫుల్‌గా వుండాలి. కానీ, సినిమాలో ఆమె కనిపించే సందర్భాలే తక్కువ. అన్నయ్య ఆశయాల్ని ఆమె అమ‌లు పరుస్తున్న సీన్ ఒక్కటి కూడా మ‌నకు కనిపించదు. హీరో బాలు క్యారెక్టర్ అయితే మ‌రీ దారుణంగా వుంటుంది. డైలాగులతో క్యారెక్టర్‌ని బాగా బిల్డప్ చెయ్యాలని చూశారు కానీ, ఫలితం మాత్రం శూన్యం. నారా రోహిత్ నటన ఏ దశలోనూ ఆకట్టుకోదు. ఇక హీరోయిన్ ఆద్య క్యారెక్టర్‌లో రెజీనా పెర్‌ఫార్మెన్స్ కూడా అంతంత వూత్రమే. హీరో, హీరోయిన్ వుధ్య వచ్చే సీన్స్ చాలా సిల్లీగా వుంటాయి. అజయ్, రమ్య‌ కృష్ణ, ఆదిత్య మీనన్, వెన్నెల కిషోర్ అవసరానికి మించి నటించారేమో అనిపిస్తుంది. సినిమాలో కాస్తో కూస్తో సందర్భోచితంగా నవ్వించిన క్యారెక్టర్ పృథ్వీది. అతని క్యారెక్టర్ లేకపోతే థియేటర్‌లో ఆ కాస్త నవ్వులు కూడా వినిపించవు.

సాంకేతికపరంగా చూస్తే విజయ్ సి.కుమార్ ఫోటోగ్రఫీ బాగుంది. అయితే సినివూలో ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేసే సందర్భాలు గానీ, అద్భుతం అనిపించే సన్నివేశాలుగానీ లేకపోవడం వల్ల సినిమాటోగ్రఫీ సినిమాకి హెల్ప్ అయిందని చెప్పలేం. ఇక మ‌ణిశర్మ చేసిన పాటలన్నీ పాత పాటల్లా వున్నాయి. ఏ ఒక్కటీ మ‌నల్ని ఆకట్టుకోదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చెయ్య‌డంలో సిద్ధ హస్తుడైన మ‌ణిశర్మకి ఈ కథలో స్కోప్ లేకపోవడంవల్ల ఆర్.ఆర్. సోసోగా అనిపిస్తుంది. రాజా రాసుకున్న కథ ఫక్తు పాత కథ, దానికి అంతే పాతగా వుండే డైలాగులు తోడై ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. నిర్మాణ విలువలు బాగానే వున్నారుు. కొన్ని పాటల్ని విదేశాల్లోని అంద‌మైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. అయితే ఇవేవీ సినిమాకి హెల్ప్ అయ్యే అంశాలు కావు. దర్శకుడు పవన్ మ‌ల్లెల గురించి చెప్పాలంటే మెుదటి సినిమాని డైరెక్ట్ చేసే దర్శకుల్లో మంచి ఫైర్ వుంటుంది. కథ పాతదే అయినా దాన్ని ప్రజెంట్ చేసే విధానం, క్యారెక్టరైజేషన్స్ విషయంలో కొత్తగా ఆలోచించడం వంటివి చేస్తారు. కానీ, పవన్ విషయంలో అలా జరగలేదు. కథ ఏదైతే వుందో దానికి తగ్గట్టుగానే తీసుకుంటూ వెళ్లిపోయాడు తప్ప తెరమీద అతని ప్రతిభ ఒక్క సీన్‌లో కూడా కనిపించలేదు. హీరోయిన్‌కి థ్రెట్ వుందని తేల్చి చెప్పిన తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ మ‌ధ్య జరిగే నాసిరకం సీన్స్‌తో గడిచిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా వుండదు. సెకండాఫ్ షరా మామూలే.. ఎక్కడ ఆగిన కథ అక్కడే వుంటుంది తప్ప ఇంచ్ కూడా కదలదు. మధ్యలో సినిమాకి సంబంధం లేని ఓ డ్రామా కంపెనీ తెరమీదికి వస్తుంది. దానితో కావాల్సినంత కాలక్షేపం చేసిన దర్శకుడు కథని క్లైమాక్స్‌కి తీసుకొచ్చి తూతూ మంత్రంగా ముగించేసాడు. సినివూ నిడివి 2 గంటల 10 నిమిషాలే అయినా 3 గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా ఆర్టిస్టుల నుంచి సరైన నటనని, ఎమోషన్‌ని తీసుకోవడంలో దర్శకుడు పవన్ విఫలమ‌య్యాడు. చివరగా... పాత కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం పరమ‌ రొటీన్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

చివరగా: సహనాన్ని పరీక్షించే ‘బాలకృష్ణుడు’

రేటింగ్ : 1.5/5

English Title
'balakrishnudu' review
Related News