కదిలే ఎస్కలేటర్‌పై సెల్ఫీలు.. తల్లి చేతుల్లో చిన్నారి జారిపడి..

Updated By ManamSun, 05/13/2018 - 16:30
Baby falls to her death, slipping from mother's arms, during selfie taking on escalator

Baby falls to her death, slipping from mother's arms, during selfie taking on escalatorరాజస్థాన్(శ్రీగంగానగర్): సెల్ఫీ మోజు ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు సెల్ఫీల మోజులో పడి తమ 10నెలల కన్నకూతురి మరణానికి కారణమయ్యారు. తల్లి చేతుల్లో నుంచి జారిపడిన పాప ఎస్కలేటర్‌ రైలింగ్‌కు తగిలి మధ్యలో పడి నలిగిపోయి మృతిచెందింది. రాజస్థాన్‌‌లోని గంగానగర్‌లో ఓ షాపింగ్ మాల్‌లో మూడు రోజుల క్రితం ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. రాజస్థాన్‌కు చెందిన దంపతులిద్దరూ పదినెలల చిన్నారికి హెల్త్ చెకప్ కోసం సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా గంగానగర్ జిల్లాలోని షాపింగ్ మాల్‌కు వెళ్లి సరదా గడపాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా షాపింగ్ ‌మాల్‌కు వెళ్లారు. చిన్నారిని ఎత్తుకొని షాపింగ్ ‌మాల్ లోపల మూడు అంతస్తుల వరకు చక్కర్లు కొట్టారు. ప్రతిచోట ఆగడం సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగారు.

ఇంతలో మూడో అంతస్తుకు వెళ్లడానికి ఎస్కలేటర్‌ను సమీపించారు. చివరికి ఇక్కడ కూడా వారు సెల్ఫీ పిచ్చిని వదల్లేదు. వేగంగా కదులుతున్న ఎస్క్‌లేటర్‌పై నిలబడి సెల్ఫీలు దిగేందుకు యత్నించారు. తల్లి చిన్నారిని ఎత్తుకొని ఎస్కలేటర్‌పైనే సెల్ఫీ దిగేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలో తల్లి ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడంతో ఆమె చేతుల్లో ఉన్న చిన్నారి జారిపడి రైలింగ్‌కు తాకి ఎస్క్‌లేటర్ మధ్య పడిపోయింది. మూడు అంతస్తుల నుంచి చిన్నారి జారి కిందపడి బలంగా నేలను తాకడంతో తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రుల అజాగ్రత్త కారణంగా 10నెలల పసిమెగ్గ రాలిపోయింది. సీసీ కెమెరా ఫుటేజీలో ఆరెంజ్ రంగు డ్రెస్‌‌లో తల్లి చిన్నారిని ఎత్తుకెళ్తున్న దృశ్యం స్పష్టంగా రికార్డు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు వైద్యలు వెల్లడించారు. అనంతరం ప్రమాదవశాత్తూ ఘటనగా నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారి మృతికి కారణమైన తల్లిదండ్రులపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు చిన్నారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులను తిట్టిపోస్తున్నారు. ఇదే ఆ వీడియో... 

English Title
Baby falls to her death in India after slipping from mother's arms during selfie-taking on escalator
Related News