అటల్ జీ అమర్ రహే!

Updated By ManamSat, 08/18/2018 - 02:10
Atal Bihari Vajpayee
  • మహానేతకు కన్నీటి వీడ్కోలు.. పంచభూతాల్లో వాజ్‌పేయి ఐక్యం

  • అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర.. అంతిమయాత్రలో పాల్గొన్న భూటాన్ రాజు

  • యమునా తీరంలో.. రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో దహనక్రియ

  • తండ్రి చితికి నిప్పంటించిన కూతురు నమిత

ATALన్యూఢిల్లీ: తన ముద్దుబిడ్డను కోల్పోయిన ‘భరత మాత’ కన్నీటి సంద్రమైంది. కోట్లాది హృదయాలు తల్లడిల్లాయి. గొంతులు మూగబోయాయి. వేలాదిగా తరలివచ్చిన అశేష జనవాహిన మధ్య ‘భారత రత్న’ అటల్ బిహారీ వాజ్‌పేయికి ఘనంగా కన్నీటి వీడ్కోలు పలికారు. యమునా నదీ తీరంలో ఆ ధీరుడు శాశ్వతంగా పంచభూతాల్లో కలిసిపోయారు. గురువారం ఎయిమ్స్ నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి భౌతిక కాయాన్ని తొలుత ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రులు తదితర ప్రముఖులు నివాళులు అర్పించారు. శుక్రవారం  ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రజల సందర్శనార్థం ఢిల్లీ దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. తమ ప్రియతమ నేతకు పార్టీ నేతలు, కార్యకర్తలు కడసారి నివాళులు అర్పించారు. జనం పెద్దసంఖ్యలో తరలి రావడంతో అనేక మంది తమ నేతను చివరి చూపు చూడకుండానే వెనుదిరిగారు. వెల్లువలా వచ్చిన జనంతో ఢిల్లీ వీధులన్నీ ఇసకేసినా రాలనంతగా కిక్కిరిసిపోయాయి. అనేక మంది కార్యాలయాలు, ఎత్తయిన భవనాల సమీపంలోని చెట్లపైకి ఎక్కి వాజ్‌పేయిని దర్శించుకున్నారు. కార్యాలయం బయట రెండు పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజేపీ కార్యాలయం నుంచి యమునా నదీ తీరంలోని ‘రాష్ట్రీయ స్మృతి స్థల్’ వద్దకు అశేష జనవాహిని తోడు రాగా.. సైనిక లాంఛనాలతో అంతిమయాత్ర మొదలైంది. యాత్ర సాగినంతసేపు ‘సూర్యచంద్రులు ఉన్నంతకాలం అటల్ పేరు చిరస్థాయిగా ఉంటుంది’, ‘అటల్ జీ అమర్ రహే’, ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకి జై’  నినాదాలతో ఆ మార్గమంతా మారుమోగింది.    అంతిమయాత్రలో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్, శ్రీలంక, బంగ్లాదేశ్ మంత్రులు, ప్రతినిధులు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్, బీజేపీ అగ్రనేతలు స్వయంగా  నడుచుకుంటూ పాల్గొన్నారు. దాదాపు 4 కిలోమీటర్ల మేర అంతిమయాత్రసాగింది. వ్యక్తిగత భద్రతా సిబ్బంది నిలువరించినా.. ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మోదీ కాలినడకనే అంతిమయాత్రలో పాల్గొన్నారు. 

వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఉంచిన వాహనం పక్కనే నడుచుకుం టూ రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్దకు చేరుకున్నారు. స్మృతిస్థల్ వద్ద.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్‌చుక్, అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, బంగ్లాదేశ్ విదేశాంగశాఖ మంత్రి అబుల్ హసన్ మహమూద్ అలీ,  పాకిస్థాన్ న్యాయ శాఖ మంత్రి అలీ జాఫర్,  శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రతినిధులు, ప్రధాని మోదీ, అమిత్‌షా, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ,  త్రివిధ దళాధిపతులు తదితరులు మరోసారి నివాళి అర్పిం చారు.  అనంతరం హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ కార్యక్రమం ముగిసింది. వాజపేయి దత్త కుమార్తె నమితా భట్టాచార్య చితికి నిప్పటించారు. వాజ్‌పేయి భౌతికకాయంపై కప్పి ఉంచిన జాతీయ పతాకాన్ని ఆయన మనవరాలు నిహారికకు అప్పగిం చారు. నెహ్రూ స్మారకస్థలం శాంతివనం, లాల్‌బహు దూర్ శాస్త్రి స్మారకం విజయ్‌ఘాట్ మధ్యలో రాష్ట్రీయ స్మృతి స్థల్ ఉంది. 2012లో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ అంత్యక్రియలు కూడా స్మృతి స్థల్‌లోనే జరిగాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థికలను ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని నదులలో నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. అలాగే.. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ స్మృతివనాల సమీపంలోనే ఒకటిన్నర ఎకరాల స్థలంలో వాజ్‌పేయి స్మృతి వనాన్ని నిర్మించనున్నారు. 

కాలి నడకనే ప్రధాని
ATALమాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పట్ల ఆయన శిష్యుడు, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ తనకున్న భక్తిని చాటుకున్నారు. గతంలో ఏ నాయుకుడికీ ఏ ప్రధానమంత్రీ సమర్పించని రీతిలో.. ఒక విధంగా న భూతో న భవిష్యతి అన్నట్లుగా నివాళులర్పించారు. బీజేపీ కార్యాలయం వద్ద అంతిమయాత్ర మొదలైన సమయంలో మోదీని వాహనం ఎక్కాల్సిందిగా భద్రతా సిబ్బంది సూచించినా, ఆయన ససేమిరా అన్నారు. ప్రోటోకాల్ మొత్తం పక్కన పెట్టి, అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మృతిస్థల్ వరకు నడుచుకుంటూనే వెళ్లడానికి సిద్ధం కావడంతో భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టాయి. అయినా పట్టించుకోకుండా ఆయన వాజ్‌పేయి పార్థివదేహాన్ని అలంకరించిన గన్ కారేజి పక్కనే నడుచుకుంటూ వెళ్లారు. ప్రధాని వెంట బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దేవేంద్ర ఫడణవీస్ కూడా నడుస్తూనే అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఒక దేశ ప్రధానమంత్రి ఇలా నాలుగు కిలోమీటర్ల మేర నడుస్తూ అంతిమయాత్రలో పాల్గొన్న చరిత్ర ఎక్కడా లేదు. మన దేశంలో కూడా ఇంతకుముందు ఏ ప్రధానీ ఇలా చేసినట్లు ఎవరూ కనీవినీ ఎరగలేదు. వాజ్‌పేయి దేహానికి చివరిసారిగా నివాళి అర్పించే సమయంలో కూడా అందరూ ముకుళిత హస్తాలతో ప్రణామం చేయగా, మోదీ మాత్రం ఆ పార్థివదేహం ఉన్న గాజుపెట్టె మీద శిరస్సు వంచి ప్రణమిల్లారు. ఇలా అటల్ బిహారీ పట్ల తనకున్న భక్తి ప్రపత్తులను అనన్య సామాన్య రీతిలో మోదీ చాటుకున్నారు. 

English Title
Atal Ji Amar Rahee!
Related News