గ్రామాల్లో అరకొర పౌరసేవలు

Updated By ManamTue, 06/19/2018 - 02:07
e-pachayat
  • పూర్తిస్థాయిలో అవులుకానీ ‘ఈ-పంచాయుతీ’

  • పలుచోట్ల అందుబాటులో లేని ఇంటర్నెట్ సేవలు 

  • ఇబ్బంది పడుతున్న గ్రామీణప్రాంత ప్రజలు  

e-pachayatహైదరాబాద్: ప్రజలకు మెరుగైన సేవలు అందిచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ- పంచాయతీ వ్యవస్థ నత్తతో పోటి పడుతుంది. నేటికీ గ్రామీణ ప్రాంత ప్రజలకు పౌర సేవల లభ్యత అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ- పంచాయతీ విధానం ద్వారా గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ప్రజాసేవల్లో నాణ్యత పెంచాలని అధికారులు భావించారు. ఈ- పంచాయతీతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు, అర్హుల వివరాలు, లబ్ధిదారుల జాబితాను తెలుసుకోనే అవకాశం కూడా ఉంటుందని ప్రారంభంలో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పన్నుల చెల్లింపులు కూడా పాదర్శకంగా ఉంటాయని  పేర్కొన్నా అవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పంచాయతీ వ్యవస్థకు ఆది నుంచీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. నేటికి ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావడం లేదు. పంచాయతీ కార్యాలయాలకు ఇంటర్నెట్ సేవలను అందించాలన్న ఉద్దేశంతో 2005లొ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ-పంచాయతీ విధానానికి ప్రతిపాదనలు చేసింది. గ్రామాల్లో పంచాయతీ భవనాలు, విద్యుత్ సౌకర్యం లేదంటూ ఈ ప్రక్రియను మధ్యలోనే ఆపేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ- పంచాయతీ వ్యవస్థను తిరిగి తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా కొన్నా గ్రామాల్లో ఈ- పంచాయతీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి విడతలో పైలెట్ ప్రాజెకు కింద రాష్ట్ర వ్యాప్తంగా 100 గ్రామ పంచాయతీల్లో ఈ- పంచాయతీలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని ప్రారంభించి దాదాపు మూడేళ్లు కావోస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ  ప్రక్రియ ఎక్కడా గాడిన పడిన దాఖలాలు లేవు.  ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి ప్రతి గ్రామంలో ఈ పంచాయతీ వ్యవస్థను అమలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించినా అధికారులు ఇంటర్నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయకపోవడంతో అవరోధం ఏర్పడుతుంది. జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్, ఇంటర్నెట్, విద్యుత్ తదితర సౌకర్యాలను కల్పించే బాధ్యతను ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఈ సంస్థ సుమారు 16 నెలల పాటు పని చేసింది. అనంతరం ఆ సంస్థ తప్పుకోవడంతో పరిస్థితి మొదటి కొచ్చింది. ప్రభుత్వం ఈ పంచాయతీలుగా ప్రకటించినా అది ప్రకటనకే పరిమితమైంది. 

గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన ఈ- పంచాయతీ వ్యవస్థ మండల కేంద్రాలకు మాత్రమే పరిమితమైయింది. గ్రామ పంచాయతీల్లో నియమించిన కంప్యూటర్ ఆపరేటర్లు ఈవోపీఆర్డీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల వారీగా వివరాలను నమోదు చేస్తున్నారేగానీ అసలు ఈ- పంచాయతీకి సంబంధించిన పూర్తి పనులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ- పంచాయతీల నిర్వహణ కోసం 14వ ఆర్థిక సంఘం నుంచి 10 శాతం నిధులను కేటాయించింది. కాగా నిర్వహణ, అమలులో అధికారులు జాప్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రతి నెలా 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి వేతనాలను చెల్లిస్తున్నా.. ఈ పంచాయతీ విధానాన్ని అమలుపరచకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఆశలన్నీ మిషన్ భగీరథపైనే..  
గ్రామాల్లో ఈ- పంచాయతీ వ్యవస్థ అవులుకు ఇంటర్నెట్ సదుపాయం కీలకం. రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో నేటికీ ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేసేందుకు కొన్ని గ్రామాల్లో కనీస వసతులు కూడా లేవు. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ తాగు నీటి సరఫరా లక్ష్యంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పైపులైన్ల్ కోసం గోతులు తవ్వి లైన్లు వేస్తున్నారు. మిషన్ భగీరథ పైపులతో పాటు ఇంటర్నెట్ కేబుళ్లను కూడా వేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయ్యేతే కానీ గ్రామాల్లో ఈ-పంచాయతీ విధానం పూర్తి స్థాయిలో అవులయ్యే అవకాశం కనిపించడం లేదు.

Tags
English Title
Around civil service in villages
Related News