అమిత్ షా-నితీశ్ భేటీపై నేతల చర్చ

Updated By ManamThu, 07/12/2018 - 16:12
amit shah-nitish kumar
amit shah-nitish kumar

పాట్నా: జేడీయూతో బంధం బీటలు వారుతున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌తో భేటీ అయ్యారు. ఆయన ఈ రోజు ఉదయం నితీశ్‌తో కలిసి అల్పాహార విందు స్వీకరించారు. ఇరు పార్టీల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికలలో సీట్ల పంపకాలపైనా చర్చలు జరగనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇటీవలి కాలంలో సీట్ల పంపకంపై బీజేపీ-జేడీయూ నేతల మధ్య మనస్పర్థలు పొడచూపాయి. కూటమిలో పెద్దన్నగా తమనుతాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తమకు అవతలి పార్టీతో అవసరమే లేదన్న చందంగా ప్రవర్తిస్తున్నాయి. నాలుగు రాష్ట్రాలలో బీజేపీతో జతకట్టేదిలేదంటూ కేసీ త్యాగి ఇటీవలే ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ సీనియర్ నేతలు కూడా దీటుగా స్పందిస్తున్నారు. నితీశ్‌తో పొత్తు అనివార్యమేనని తెలిసినా.. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదిర్శిస్తున్నారు. 

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. జేడీయూతో పొత్తు కుదరకపోయినా ఒంటరిగా పోటీచేసి నాలుగింట మూడొంతుల సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని పేర్కొన్నారు. బీజేపీ జేడీయూ కూటమికి సీట్ల పంపకం పెద్ద ప్రతిబంధకం కానుంది. గతంలో అనుసరించిన ఫార్ములా(25-15)నే ఈసారి కూడా అమలుచేయాలని జేడీయూ పట్టుబడుతుండగా.. మాకే 25 సీట్లు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో విసిగిపోయిన జేడీయూ నేత ఒకరు.. అంతగా కావాలంటే మొత్తం సీట్లలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసుకోవచ్చని వ్యాఖ్యానించడంతో విషయం సీరియస్‌నెస్ సంతరించుకుంది. 

ఈ క్రమంలో అమిత్ షా బిహార్ పర్యటన, నితీశ్ కుమార్‌తో అల్పాహార విందు ప్రాధాన్యం సంతరించుకుంది. సాయంత్రం ఇరు నేతలు డిన్నర్ కోసం కలువనుండడంతో వారిమధ్య జరగనున్న చర్యలకు ప్రాధాన్యం చోటుచేసుకుంది. అనంతరం శుక్రవారం నాడు స్థానిక నేతలతో షా భేటీ అవుతారని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ సామర్థ్యంపై ఓ అంచనాకు వచ్చాక ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తారని తెలిపాయి.

English Title
Amit Shah meets Nitish Kumar in Patna
Related News