కూటమి గెలుపు ఖాయం

Rahul gandhi
  • సీఎం ఎవరవుతారో అన్నది ఇప్పుడు చర్చ కాదు

  • ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలను నిజం చేసింది కాంగ్రెస్ 

  • ప్రజల ఆశలు, కోరికలను కేసీఆర్  విస్మరించారు

  • రైతన్నల దశ మారుస్తాం.. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం

  • ప్రజాకూటమితోనే  ప్రజల స్వప్నం సాకారం

  • హైదరాబాద్‌లో మీడియాతో రాహుల్ గాంధీ

  • సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, కోదండరాం, సురవరం, గద్దర్, మందకృష్ణ, చెరుకు సుధాకర్

  • జలవివాదాలుండవు : చంద్రబాబు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుపు ఖాయమని ఫ్రంట్ నేతలు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు చేసిన ఉద్యమాలు, త్యాగాలను గుర్తించిన  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, అయితే, నాలుగు న్నరేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలను వంచించారని,అవినీతి అక్రమాలతో  కోట్లు గడించారు తప్ప , నాలుగుకోట్ల ప్రజలను పట్టించుకోలేదని  ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపించారు. బుధవారం తాజ్ కృష్ణ హోటల్‌లో ఫ్రంట్ నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ చంద్రబాబునాయుడు, టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, ఎంఆర్‌పీఎస్ అధ్యక్షులు మందకృష్ణమాదిగ, ప్రజాగాయకుడు గద్దర్, ముస్లిం లీగ్ అధ్యక్షుడు గులాం సాహెబ్‌తో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత  ఆదర్శ రాష్ట్రంగా అవతరిస్తుందని అనుకున్నామని, తీరా అన్ని అంశాలలో ప్రజలకు ద్రోహం జరిగిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజాకూటమి గెలుపు తథ్యమని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, రైతన్నలకు గౌరవ ప్రద స్థానం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా తమ పాలనసాగుతుందని భరోసా ఇచ్చారు. నోట్ల రద్దుతో  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేశారని, జీఎస్టీతో వ్యాపార రంగాన్ని కుదేలు చేశారని ఆరోపించారు. వ్యవసాయంతో పాటు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తామన్నారు. కూటమి గెలుపొందిన తర్వాత సీఎం ఎవరో  ఇప్పుడు చర్చించడం లేదని, టీఆర్‌ఎస్‌ను ఓడించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్  సమాధానాలు ఇచ్చారు. 

ప్రః నిరుద్యోగం, రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు...
జః ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ రైతులను తమ స్వార్థంకోసం వాడుకుంటున్నారు తప్ప, అన్నదాతలకు గౌరవ స్థానం కల్పించాలనే ఉద్దేశ్యం లేదు. తాము అలాకాకుండా రైతులకు భరోసా, గౌరవప్రద స్థానం కల్పిస్తాం.., వ్యవసాయంలో ఆధునిక పద్దతులను వినియోగించుకునేలా వారిని తీర్చిదిద్దుతాం. మార్కెట్ విషయానికి వస్తే, రాష్ట్రం, దేశం,అంతర్జాతీయ మార్కెట్ లో సరుకులు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటాం
ప్రః కూటమి గెలిస్తే సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును ప్రతిపాదిస్తున్నారు
జః  ఆ ప్రస్తావనే లేదు...,టీఆర్‌ఎస్ పార్టీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యం...,సీఎంగా ఎవరుండాలనే విషయం చర్చించడం లేదు
ప్రః  రైతులకు, నిరుద్యోగులకు మీరిచ్చే హామీ ఏంటి? నిధులెలా సమీకరిస్తారు ?
జః నిధులెలా అంటే... మోడీ రూ.3.5 లక్షల కోట్లను అంబానీతో పాటు ఇతర తన 15 మంది ఫ్రెండ్స్ కోసం మాఫీ చేశారు. మేమలా చెయ్యం..., పేదవాడు, రైతుల బాగు కోసం నిధులను వినియోగిస్తాం...ఆర్థికంగా ఇతోధికంగా ఆదుకుంటాం.., మార్కెట్ సౌకర్యం కల్పిస్తాం.., వ్యవసాయంలో నైపుణ్య శిక్షణ ఇస్తాం.., పంటల దిగుబడి పెంచేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తాం.., విద్య, వైద్య రంగాలకు సైతం పెద్దపీట వేస్తాం.
ప్రః ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ?
 జః  ఇన్ని సీట్లు అని ఇప్పుడే చెప్పలేను. కానీ, కూటమి గెలుపు ఖాయం. కేసీఆర్‌కు ఓటమి భయం ఆవరించిందని, ఈ విషయం ఆయన శరీర శైలి ( బాడీలాంగ్వేజీ )ని చూస్తే తెలిసిపోతుందని, నిరాశ, నిస్పృహలో బహిరంగ సభల్లో ఎలా మాట్లాడుతున్నారో తెలుసు కదా ? ప్రశ్నలు అడిగిన వారిని ఎలా అవమానిస్తున్నారో చూస్తున్నాము. ఆయన త్వరలో విశ్రాంతి తీసుకోబోతున్నారు... ఆయన గురించి ప్రజలకు తెలిసిపోయింది.
ప్రః 37ఏళ్ల శతృత్వంతో టీడీపీతో కాంగ్రెస్ శ్రేణులు కలుస్తాయా ?
 జః టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు కలిపి పని చేస్తున్నాయి కదా .. ఈ రెండు పార్టీలే కాదు కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ముందుకు వెళుతున్నాము. దేశ ప్రయోజనాల కోసమే టీడీపీ మాతో చేతులు కలిపింది. నరేంద్రమోడీ సర్కార్ అవినీతిమయమైంది. రాఫెల్ ఆయుధాల కొనుగోలులు తన మిత్రుడు అనిల్ అంబానీ కోసం రూ. 30 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు.
 కూటమి గెలిస్తే పాలన హైదరాబాద్ నుంచే ...కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు - ఉత్తమ్
ప్రః కూటమి అధికారంలోకి వస్తే పాలనను బాబు చేతిలో పెడతారని ప్రజలు అనుమానిస్తున్నారు
జః ప్రజాకూటమి గెలిచిన తర్వాత పరిపాలన హైదరాబాద్ నుంచే సాగుతుంది. కేసీఆర్ ఆయన పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. తాను చేసిన అభివృద్ధి చెప్పకుండా తప్పుడు ప్రచారం చెయ్యడం టీఆర్‌ఎస్ నేతలకు తగదు. గోబెల్స్ మించిన తప్పుడు ప్రచారాన్ని కేసీఆర్ చేస్తున్నారు.
ప్రః ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరుగుతుందా ?
జః  ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కూటమి కట్టుబడి ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం.
అధికారంలోకి వస్తే పాలనను రాహుల్ , కోదండరాం చూసుకుంటారు 
జల వివాదాలు ఉండవు - చంద్రబాబు 
ప్రః కూటమి వస్తే జలవివాదాలు తలెత్తుతాయన్న విమర్శలు వస్తున్నాయి 
జః ప్రజాకూటమి అధికారంలోకి వస్తే పరిపాలన వ్యవహారాలను రాహుల్ గాంధీ, కోదండరాం చూసుకుంటారు. నేను జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు. ఉమ్మడి మేనిఫెస్టో ఉంది. దాన్ని అమలు చేస్తాం..., జల వివాదాలుండవు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. తప్పుడు ప్రచారం చెయ్యడం సరికాదు.

సంబంధిత వార్తలు