సరికొత్త శిఖరంపై సెన్సెక్స్ 

Updated By ManamThu, 07/12/2018 - 23:11
bse

bseముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ గురువారం వరుసగా ఐదవ సెషన్‌లో ఆరోహణను కొనసాగించి, సరికొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. ఇంధన, ఫినాన్షియల్ రంగ షేర్లలో మదుపరులు నిధులు కుమ్మరించడం, కంపెనీలు ఆదాయాలను ప్రకటించే సీజన్ ప్రోత్సాహకరమైన రీతిలో ప్రారంభమవడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌కు గీటురాయిగా భావించే ‘సెన్సెక్స్’ సరికొత్త శిఖరాన్ని అధిరోహించింది. బి.ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’  282.48 పాయింట్లు దూసుకెళ్ళి 36,548.41 వద్ద ముగిసింది. విస్తృతమైనదిగా భావించే నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 75 పాయింట్ల అంగతో కీలకమైన 11,000 స్థాయిని తిరిగి సొంతం చేసుకుంది. చమురు నుంచి టెలికాం వరకు వివిధ రంగాల సమ్మేళన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.42 శాతం పెరుగుదలతో, ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిలో ముగిసి, 100 బిలియన్ అవెురికన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లబ్‌లోకి తిరిగి ప్రవేశించింది. ‘సెన్సెక్స్’ గైనర్లలో అది అగ్ర స్థానంలో నిలిచింది. డాలరుతో మారకం విలువలో రూపాయి బలపడడం, దేశ, విదేశీ మదుపు సంస్థల కొనుగోళ్ళు, కంపెనీల త్రైమాసిక ఫలితాల సీజన్  బోణీ బాగుండడం కొనుగోళ్ళ ఉధృతిని పెంచాయని బ్రోకర్లు చెప్పారు. 

బలమైన స్థితిలో మొదలైన ‘సెన్సెక్స్’ వేగాన్ని పెంచుకుని ఆల్-టైమ్ ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి 36,699.53ను అందుకుంది. లాభాల స్వీకరణతో అది కొన్ని పాయింట్లను వదులుకుని, చివరకు 282.48 పాయింట్ల లాభంతో 36,548.41 వద్ద ముగిసింది. ఆ విధంగా జనవరి 29 నాటి (36,283.25 పాయింట్ల) గత రికార్డును అది అధిగమించింది. దీనితో ‘సెన్సెక్స్’ ఐదు సెషన్లలో 973.86 పాయింట్లను పుంజుకున్నట్లయింది.  ‘నిఫ్టీ’ఒక దశలో 11,078.30 స్థాయిని తాకి, చివరకు 74.90 పాయింట్ల పెరుగుదలతో 11,023.20 వద్ద ముగిసింది. జనవరి 31 నాటి (11,027.70) తర్వాత  ‘నిఫ్టీ’కి ఇదే అత్యధిక ముగింపు. కాగా, విదేశీ ఫండ్లు బుధవారం రూ. 636.27 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 15.33 కోట్ల విలువ చేసే ఈక్విటీలను సొంతం చేసుకున్నాయని తాత్కాలిక డాటా సూచించింది. ‘‘కంపెనీల ఆదాయాల వృద్ధి, చమురు ధరల క్షీణతపై అంచనాతో మార్కెట్ ఎగువ గతి పయనాన్ని కొనసాగించింది. అవెురికా-చైనాల మధ్య వాణిజ్య సంబంధాలకున్న అవకాశాలు కూడా ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేసి, ఇటీవలి అమ్మకాల కుంగుబాటు నుంచి తిరిగి ఎగబాకేందుకు దోహదపడ్డాయి. చమరు ధర ఇటీవలి కాలంలో ఎరుగనంత తక్కువకి దిగి వచ్చింది. రూపాయి బలపడింది. దీంతో జూన్ తాలూకు రిటైల్ ద్రవ్యోల్బణం 5.29 శాతంగా ఉండగలదనే అంచనాపై బెంబేలును సడలింపజేశాయి’’ అని జియోజీత్  ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు. ముడి చమురు ధరలు రెండేళ్ళలో మొదటిసారిగా ఒకే రోజులో అత్యధిక తగ్గింపును కనబరచడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల, విమానయాన సంస్థల షేర్ల ధరలు ఊపందుకున్నాయి. 

Tags
English Title
Sensex on the new peak
Related News