రుణ మాఫీలతో ముప్పు

Updated By ManamThu, 07/12/2018 - 23:11
RBI
  • ద్రవ్య లోటు అదుపు తప్పుతోందని రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక

rbiముంబై: జీత భత్యాలకవుతున్న అధిక వ్యయం, వ్యవసాయ రుణాల మాఫీకి తోడు జి.ఎస్.టి అమలులో లోటుపాట్ల వల్ల రెవిన్యూలో ఏర్పడిన వెలితి అన్నీ కలసి 2017-18 సంవత్సరంలో  రాష్ట్రాల ద్రవ్య లోటు లక్ష్యాలు 0.35 శాతం తప్పి 3.1 శాతంగా నిలవడానికి కారణమయ్యాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) పేర్కొంది. రాష్ట్రాలు వాటి స్థూల ద్రవ్య లోటును అదుపులో ఉంచునే లక్ష్యాలను సాధించడంలో విఫలమవడం వరుసగా ఇది మూడవ ఏడాదని కేంద్ర బ్యాంక్ పేర్కొంది. వికేంద్రీకరణ వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగి, రాష్ట్రాల ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, వాటి నిర్వాకం ఇలా ఉందని తెలిపింది. సవరించిన అంచనాల ప్రకారం, 2019 ఆర్థిక సంవత్సరంలో 0.4 శాతం ద్రవ్య లోటుకు బదులు రెవిన్యూలలో 0.2 శాతం మిగులు చూడగలమని రాష్ట్రాలు ఆశిస్తున్నాయి. ఇది 2018 ఆర్థిక సంవత్సరంలో మొత్తంమీద స్థూల ద్రవ్య లోటు 3.1 శాతం బదులు 2.6 శాతానికి కట్టడి చేయడానికి సహాయపడవచ్చని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. దేశం మొత్తం మీద చూసినప్పుడు, ద్రవ్య లోటు అదుపు తప్పడానికి వ్యవసాయ రుణాల మాఫీ ఒక్కటే మూడోవంతు కారణంగా నిలిచిందని తెలిపింది. రాష్ట్రాల బడ్జెట్లను ఆధారం చేసుకుని, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఆర్.బి.ఐ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రుణాల మాఫీ వల్ల కలిగే ‘‘నైతిక ప్రమాదం’’ పై ఆందోళనలను సర్వోన్నత బ్యాంక్ పునరుద్ఘాటించింది. రుణాల మాఫీ వల్ల ఉత్పాదకత మెరుగుపడుతుందనే వాదనలో ‘‘నిజం లేదు’’ వాటి గత చరిత్ర చెప్పకనే చెబుతోందని పేర్కొంది. రుణ మాఫీలు జనం అనియత ఫినాన్స్ వనరుల వైపు మొగ్గేట్లు దారితీస్తున్నాయని, ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయని చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలు 2014లో రుణాల మాఫీకి దిగగా, తమిళ నాడు, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ పంజాబ్, ఇప్పుడు కర్ణాటకలతో సహా వివిధ రాష్ట్రాలు అదే బాటలో రుణ మాఫీ వరాలు ప్రకటించాయి. జి.డి.పిలో రుణ మాఫీ 0.27 శాతంగా ఉండగలదని బడ్జెట్ అంచనాలు కాగా, అది 2018 ఆర్థిక సంవత్సరంలో 0.32 శాతంగా నిలిచాయని ఆర్.బి.ఐ వెల్లడించింది. రుణ మాఫీ ప్రకటించిన రాష్ట్రాల మూలధన వ్యయం తగ్గిందని పేర్కొంది. ఫలితంగా, అభివృద్ధి దెబ్బతింటోందని చెప్పింది. రాష్ట్రాలు సిబ్బంది జీతభత్యాలు పెంచేయడం వల్ల వాటి రాబడి వ్యయం 0.09 శాతం మేర తగ్గిందని తెలిపింది. రాబడి లేకపోవడం వల్ల స్థూల ద్రవ్య లోటు 0.27 శాతం పెరిగిందని వివరించింది. అయితే, జి.ఎస్.టి స్థిరపడితే, రాష్ట్రాల రాబడి సామర్థ్యం పెంపొంది, ద్రవ్య లోటు కట్టడికి సహాయపడగలదని ఈ నివేదికకు రాసిన ముందు మాటలో ఆర్.బి.ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వైుకేల్ పాత్రా ఆశాభావం వ్యక్తపరచారు. 

Tags
English Title
The debt mafia is a threat
Related News