భలే భేటీ 

Updated By ManamWed, 06/13/2018 - 01:16
trump kim

imageభౌగోళిక రాజకీయ రంగస్థలంపై మరో నాటకీయ పరిణామం రక్తికట్టింది. కొరియన్ ద్వీపకల్పంలో సంపూర్ణ అణ్వాయుధ నిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా రాజ్యవ్యవహారాల కమిషన్ చైర్మన్ కిమ్ జోంగ్-ఉన్ ల మధ్య సింగపూర్‌లో జరిగిన చరిత్రాత్మక భేటీ విజయ వంతమైంది. సుమారు ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వైషమ్యాలు, ఉద్రిక్త తల నేపథ్యంలో కొరియన్ ద్వీపకల్పంలో శాంతి సుస్థిరతల స్థాపనపై ఇరు దేశాధి నేతలు సమావేశం కావడం ఇదే ప్రథమం. ఇరు దేశాల అధ్యక్షులు ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశారు. ‘శాంతి సౌభాగ్యాల సాధనలో ప్రజల ఆకాంక్ష లకు అనుగుణంగా అమెరికా, ఉత్తర కొరియాలు కొత్త సంబంధాలను నెల కొల్పు కుంటాయి; కొరియా ద్పీపకల్పంలో సుస్థిర శాంతి స్థాపనకు అమెరికా, ఉత్తర కొరియాలు కలసి పనిచేస్తాయి; 2018 ఏప్రిల్ 27నాటి పాన్ ముంగ్ జోమ్ ఒప్పందానికి అనుగుణంగా సంపూర్ణ అణు నిరాయుధీకరణకు ఉత్తరకొరియా కట్టుబడి ఉంటుంది; యుద్ధ ఖైదీలను తక్షణమే తిరిగి అప్పగించాలి’ అనే నాలుగు ప్రధాన అంశాల కేంద్రంగా ఒప్పందం రూపొందింది. ఈ ఒప్పందం ప్రకారం కొరియన్ ద్వీపకల్పంలో ఉత్తర కొరియా భద్రతకు అమెరికా హామీ పడవలసి ఉండగా, సంపూర్ణ, నిరూపణీయ, పునరుద్ధరణకు వీలుకాని రీతిలో అణు నిరా యుధీకరణకు ఉత్తరకొరియా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. సింగపూర్ భేటీని మీడి యా పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ, కిమ్-ట్రంప్ భేటీ ఎలాంటి ఆచరణా త్మక కార్యాచరణ ప్రణాళిక లేకుండానే అసందిగ్ధత స్థితిలో ముగిసింది.

సింగపూర్ సమావేశం ఊహించినట్లుగానే కొరియా ద్వీపకల్ప శాంతి స్థాపన కోసం ఇరు దేశాలు వేసిన ఒక ప్రాథమిక ప్రయత్నంగానే నిలిచింది. అణ్వస్త్ర తయారీలో ఇప్పటికీ తగిన సామర్థ్యాన్ని సంపాదించుకొని, సరిపడ్డ అణ్వస్త్రాలను తయారుచేసుకున్న ఉత్తర కొరియా తన అణ్వస్త్ర ప్రయోగశాల నెలకొల్పిన కొండ ప్రాంతాల్లో ‘టైర్డ్ మౌంటేన్ సిండ్రోమ్’కు గురికావడం వల్ల ప్రయోగశాలను ధ్వం సం చేయవలసి వచ్చింది. ఇక తాను అణు నిరాయుధీకరణ పాటించినా తనకు అదనంగా వచ్చే నష్టమేమీ లేదు. ఇలాంటి సందర్భంలోనే దక్షిణ కొరియాతో ఏప్రిల్‌లో అణ్వస్త్ర నిరోధక ఒప్పందాన్ని చేసుకుంది. అందువల్ల సింగపూర్ భేటీ తర్వాత ఉత్తర కొరియా కొత్తగా చేయవలసినదేమీ ఉండదు. కాకపోతే ఐక్యరాజ్య సమితి నిపుణుల పర్యవేక్షణకు ఉత్తర కొరియా సహకరించ వలసి వస్తుంది. దక్షిణ కొరియాలో సైనిక స్థావరాలను పటిష్టంచేస్తూ, ఉత్తర కొరియాను నిర్మూలిస్తానని అమెరికా చేసిన బెదిరింపుల కంటే అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న వాణిజ్య ఆంక్షల కారణంగా ఉత్తర కొరియా దశాబ్దాలుగా ఇబ్బం దులు పడుతోంది. సింగ పూర్ భేటీ వల్ల ఆ ఇబ్బందులు తొలగిపోగలవన్న హామీ అమెరికా నుంచి ఉత్తర కొరియా పొందలేదు సరికదా, ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాన్ని ఉప సంహరించుకోనంత వరకు (ప్రధాన కార్యక్రమాన్ని ఇప్పటికే నిలిపివేసింది) ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని, దక్షిణ కొరియాలో తిష్టవేసిన 28,500 మంది అమెరికా సైనిక బలగాలను ఎటువంటి పరిస్థితుల్లో ఉపసంహరించేది లేదని ట్రంప్ ఖరాఖండిగా మాట్లాడారు. నాటకీయంగా మారిన సింగపూర్ భేటీ లో ఉత్తరకొరియాకుగానీ, అమెరికాకుగానీ ప్రయోజనం చేకూర లేదు. ఒకరకంగా అంతుచూస్తానని బెదిరించిన అమెరికా అధ్యక్షుడు, కొరియా ద్వీపకల్పంలో తా ము నిర్వహిస్తున్న ఉమ్మడి సైనిక విన్యాసాల వల్ల ప్రాంతీయ ఉద్రిక్తలు పెరుగు తున్నాయని ఉత్తరకొరియా చేస్తున్న ఆరోపణలను ఒప్పుకోవడమే కాకుండా, ఆ విన్యాసాలను నిలిపివేస్తున్నామని ప్రకటించడంతో పాటు, భద్రతా హామీలు ఇవ్వ డంతో కిమ్ చాణక్యమే పై చేయి అయిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఉత్తరకొరియా నిర్వహిస్తున్న ప్లూటోనియం, యురేనియం కార్యక్రమాల నిలిపి వేత, ఖండాతర క్షిపణులను ధ్వంసంచేయడం, అణు పరీక్షా కేంద్రాలకు నిపుణుల పరిశీలనకు అనుమతించడం, ఉత్తరకొరియా అణు కార్యక్రమంపై పూర్తిస్థాయి ప్రక టన, కార్యాచరణ కాల ప్రణాళిక, వాటి అమలును పర్యవేక్షించే యంత్రాంగం తదితర అంశాలతో కూడిన సంపూర్ణ అణు నిరాయుధీకరణపై అస్పష్టత సింగ పూర్ ఒప్పందంలో చోటు చేసుకుంది. ఉత్తర కొరియా 1992 నుంచి కొరియన్ ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణ కోసం డిమాండ్ చేస్తున్న దానికి అదనంగా సమకాలీన అంశాలు ఈ ఒప్పందంలో చోటు చేసుకోక పోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1994లో ‘అగ్రీడ్ ఫ్రేమ్ వర్క్’లో కొరి యన్ యుద్ధంలో పట్టుబడిన అమెరికా సైనికులను అప్పగించాలన్న ఒప్పందాన్ని ఇప్పటికీ అమలు చేయలేదు. అదేవిధంగా మీడియా సమావేశంలో ‘అంతటా జరుగుతున్నట్లే ఉత్తరకొరియాలోనూ మానవహక్కుల హననం జరుగుతోందని’ ట్రంప్ వ్యాఖ్యానించడంతో కిమ్ పాలనను పరోక్షంగా సమర్థిస్తున్నట్లయింది. కొరియా ద్వీపకల్పంలో శాంతి ప్రక్రియను ప్రారంభించడంలో గతం నుంచి 11 అమెరికా అధ్యక్షులు విఫల ప్రయత్నం చేశారు. దాంతో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి అమెరికా పాలకులకు కొత్తేమీ కాదు. 1954లో జనీవా ఒప్పందంలో సోవి యట్ రష్యా, చైనా, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల చొరవతో కొరియన్ ద్వీప కల్పంలో (ఆనాడు ఇండోచైనా అని పిలిచేవారు) శాంతి స్థాపనకు ఒప్పందం చేసుకున్నప్పటికీ, తాత్కాలిక యుద్ధవిరమణ ఒప్పందంలోని 13(డి) అధికర ణాన్ని రద్దు చేస్తూ సైనిక స్థావరాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. దాంతో శాంతి వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు నెలకొల్పిన ‘న్యూట్రల్ నేషన్స్ సూపర్వైజరీ కమిషన్’ నిర్వీర్యమైంది. 1960లలో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 1968లో అమెరికా నేవీ ఇంటెలి జెన్స్ నౌక - యూఎస్‌ఎస్ ప్యూబ్లో-ను ఉత్తరకొరియా పట్టుకొంది. 1969లో అమెరికా గూఢ చారి విమానాన్ని కూల్చివేయగా 31 మంది సిబ్బంది మరణించారు. ఆర్థిక ఆంక్షలు, దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్థావరం నేపథ్యంలో భద్రతా కార ణాల రీత్యా 1970ల్లో ఉత్తర కొరియా తన బాణీని మార్చుకుని అమెరికాతో శాంతి ఒప్పందానికి చేయి చాచింది. ఉత్తర కొరియా ప్రతిపాదనను అమెరికా తిరస్కరించడమే కాకుండా, 1981లో అమెరికా అధ్యక్షుడు రీగన్ హయాంలో ఉమ్మడి సైనిక విన్యాసాల కారణంగా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. బిల్ క్లింటన్ హాయంలో 1994లో ‘అగ్రీడ్ ఫ్రేమ్‌వర్క్’, 2000లో ‘ఉమ్మడి ప్రకటన’ల రూపంలో ప్రాదేశిక శాంతి, సుస్థిరతల సాధన కోసం చారి త్రక ప్రయత్నాలు ప్రారంభమైనాయి. 2003 నాటికి కూడా ‘అగ్రీడ్ ఫ్రేమ్‌వర్క్’ ఆర్టికల్ 2 ప్రకారం ‘కొరియా ద్వీపకల్పంలో పూర్తిస్థాయి సాధారణ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు’ నెలకొల్పడంలో అమెరికా విఫలమైనందున ఉత్తర కొరియా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలిగింది.

అమెరికా వైఖరి వల్ల ఉత్తరకొరియా అంతర్జాతీయంగా ‘దుష్టరాజ్యం’గా ఆరోపణలు ఎదుర్కొనవలసి న స్థితికి చేరింది. అయితే కిమ్ జోంగ్ ఉన్ అధికారం చేపట్టిననాటి నుంచి ఉత్తర కొరియా కొత్త ఎత్తుగడలతో ముందుకొచ్చింది. ఒకవైపు అణ్వస్త్ర ప్రయోగాలు, ఖండాంతర క్షిపణుల ప్రయోగాలతో అమెరికా సహా ప్రపంచాన్ని భయాందో ళనలకు గురిచేస్తూ మరోపక్క 2012-16 మధ్య కాలంలో కనీసం 5 సార్లు శాంతి ఒప్పందం కోసం ప్రకటనలు చేసింది. ఉత్తర కొరియా అణు క్షిపణి ప్రయోగ దౌత్యం ఫలించి, ఎట్టకేలకు దక్షిణ కొరియాను, అమెరికాను ఒప్పందాలు చేసుకు నేట్లు చేసింది. అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలు, హామీల విషయంలో అమెరికా కుటిలత్వం ప్రపంచానికి చాలానే అనుభవం ఉంది. సింగపూర్ భేటీకి ముందు జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో అమెరికా వ్యవహారశైలి యావత్ ప్రపంచం చూసింది. ఈ నేపథ్యంలో సింగపూర్ ఒప్పందం పెద్దగా సాధించేదేమీ ఉండదని, ఎంత ఘనమైన ఒప్పందమైనా ఆచరణలోకి రాకపోతే దాని వల్ల ఒరిగే దేమీ ఉండదని చారిత్రక అనుభవాలు రుజువు చేస్తున్నాయి. కిమ్-ట్రంప్‌లిద్దరూ భవిష్యత్‌లో అనేకసార్లు తాము భేటీ అవ్వాల్సి ఉంటుందని మీడియా ముందు ప్రకటించారు. ఎన్ని భేటీలు వేశామన్నది కాదు, ఆచరణలో ఒక్క అడుగైనా వేశామా అన్నది అంతర్జాతీయ ఒప్పందాలకు గీటురాయిగా ఉంటుంది. 

English Title
meeting
Related News