ధోనీని దాటేసిన పంత్

panth
  • పుజారాకు మూడో స్థానం జూఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్

దుబాయి: ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్  పుజారా మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అతడు 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే, ఆ సిరీస్‌లో 350 పరుగులు చేసిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక్కసారిగా 21 స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో నిలిచాడు. ధోనీ టెస్టు కెరీర్‌లో 19వ ర్యాంకే అత్యుత్తమ ర్యాంక్‌గా ఉంది. అతని రికార్డును పంత్ అధిగమించాడు. 1973లో టీమిండియా వికెట్ కీపర్ ఫరూఖ్ ఇంజినీర్ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానంలో నిలిచాడు. ఇప్పుడు ఆయన సరసన పంత్ నిలిచాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే ముందు పంత్  59వ స్థానంలో ఉన్నాడు. కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించిన రవీంద్ర జడేజా, మయాంక్ అగర్వాల్ కూడా బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. ఆరు స్థానాలు ఎగబాకిన భారత ఆల్‌రౌండర్ జడేజా 57వ స్థానంలో నిలవగా, మయాంక్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 62వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పలువురు టీమిండియా బౌలర్లు తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. కుల్‌దీప్ యాదవ్ ఏడు స్థానాలు ఎగబాకి 45వ స్థానంలో నిలవగా, జస్‌ప్రీత్ బుమ్రా 16,  షమీ 22వ స్థానాల్లో నిలిచారు. జడేజా ఒక స్థానం మెరుగుపర్చుకుని ఐదో స్థానంలో నిలిచాడు. ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో వరుసగా విరాట్ కోహ్లీ (భారత్), విలియమ్సన్ (న్యూజిలాండ్), పుజారా (భారత్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), రూట్స్ (ఇంగ్లండ్) ఉన్నారు. బౌలింగ్ టాప్-5లో వరుసగా రబాడా (దక్షిణాఫ్రికా), అండర్సన్ (ఇంగ్లాండ్), ఫిలాండర్ (దక్షిణాఫ్రికా), కమిన్స్ (ఆస్ట్రేలియా), జడేజా (భారత్) ఉన్నారు.

Tags

సంబంధిత వార్తలు