ప్రారంభమైన బీజేపీయేతర పక్షాల సమావేశం

Anti BJP meeting, Parliament Annex building 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తొలిసారి బీజేపీయేతర పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముందుగా టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, ఎన్‌సీఏ నేత ఫరూక్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో 14 విపక్ష పార్టీలతో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మొత్తం 17 పార్టీలు హాజరుకావాల్సి ఉండగా... రెండు పార్టీలు ఎస్పీ, బీఎస్పీ డుమ్మా కొట్టాయి. 14 పార్టీలకు చెందిన నేతలు, ఆరు రాష్ట్రాల సీఎంలు మాత్రమే హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఈ సమావేశంలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌, తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌, ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా, బీజేపీ పాలనకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన చంద్రబాబు జాతీయ పార్టీలన్నింటిని ఏకతాటిపై తెచ్చేందుకు విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు