రాజ్యాంగం పరిహాసం

Updated By ManamThu, 05/17/2018 - 22:56
image
  • ఇది భారత ప్రజాస్వామ్య ఓటమి.. యడ్డి ప్రమాణం.. ప్రజాస్వామ్య అవహేళనే

  • మెజారిటీ ఉంది మాకే: సిద్దరామయ్య.. ఎమ్మెల్యేలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు

  • బెదిరించి లోబరుచుకోవాలని మోదీ యత్నం.. జేడీఎస్ నేత కుమారస్వామి మండిపాటు

  • విధాన సౌధ వద్ద కాంగ్రెస్-జేడీఎస్ ధర్నా.. పాల్గొన్న ఎమ్మెల్యేలు.. సీనియర్ నాయకులు

imageబెంగళూరు/న్యూఢిల్లీ/రాయ్‌పూర్: కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ ఉందని, కానీ ప్రధాని మోదీ తన అధికారాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని ఆ పార్టీల నేతలు మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు. మెజారిటీ లేని బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం, ఆ పార్టీ నేత యడ్యూరప్పతో ప్రమాణం చేయించడంపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం జేడీఎస్, కాంగ్రెస్ నేతలు కర్ణాటక విధాన సౌధ వద్ద ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, దేవెగౌడ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్దరామయ్య, మల్లికార్జున ఖర్గే, ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విధాన సౌధలోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి.. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, తమ ఎమ్మెల్యేలను భయపెట్టి బీజేపీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ  తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. ఈడీని ఎమ్మెల్యేలపైకి ఉసిగొల్పి బెదిరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌పై ఈడీని ఉసిగొల్పి బీజేపీ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ‘వారు ఈడీని ఉపయోగిస్తున్నారు. ఈడీలో నాకు వ్యతిరేకంగా కేసు ఉంది. ఆ కేసును తిరగదోడి నన్ను ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు. నన్ను క్షమించండి.. నా ప్రయోజనాలు నేను కాపాడుకోవాలి’ అని ఆనంద్ సింగ్ చెప్పినట్టు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనకు చెప్పారని కుమారస్వామి పేర్కొన్నారు. అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ.. గవర్నర్ బీజేపీ నేతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని అన్నారు. యడ్యూరప్పకు సంఖ్యాబలం లేదని, మెజారిటీ ఉంది జేడీఎస్-కాంగ్రెస్ కూటమికేనని చెప్పారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పార్టీతోనే ఉన్నారని, ఒక్క ఆనంద్‌సింగ్ మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ పిడికిలిలో బందీ అయ్యారని ఆ పార్టీ ఎంపీ డీకే సురేశ్ తెలిపారు. బుధవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష భేటీకి డుమ్మాకొట్టిన ఎమ్మెల్యేలు నాగేంద్ర, రాజశేఖర పాటిల్, ఆనంద్ సింగ్‌లలో ఇద్దరు తిరిగి ఇద్దరు తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చేశారని, ఒక్క ఆనంద్‌సింగ్ మాత్రమే బీజేపీకి ఆకర్షితుడయ్యారని చెప్పారు. మరో సీనియర్ నేత డీకే శివకుమార్ మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యేలంతా వంద శాతం తమ వెంటే ఉన్నారని, యడ్యూరప్ప ప్రభుత్వం స్వల్పకాలంలోనే కూలిపోతోందని అన్నారు. మెజారిటీ తమకే ఉందని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన తెలిపారు.

ప్రజాస్వామ్యానికి అవమానం: రాహుల్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రానప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది రాజ్యాంగాన్ని పరిహసించడమేనని ఆయన అన్నారు. బీజేపీ తమ అసంబద్ధ విజయంపై సంబరాలు చేసుకుంటోందని, ఇది భారత ప్రజాస్వామ్య ఓటమి అని, దీనిపై యావత్ దేశం కన్నీరుపెడుతోందని పేర్కొన్నారు. రాయ్‌పూర్‌లో జరిగిన 73, 74 రాజ్యాంగ సవరణల రజతోత్సవం సభ ‘జన స్వరాజ్ సమ్మేళన్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ, ఆరెస్సెస్ ఈ దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను తమ పిడికిట బందిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పాలనలో మీడియా, న్యాయవ్యవస్థ భయంతో నలిగిపోతున్నాయని, ఆఖరికి బీజేపీ ఎంపీలు కూడా మోదీ ఎదుట మాట్లాడేందుకు వణికిపోతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగంపై తీవ్రమైన దాడి జరుగుతోందని, ఎమ్మెల్యేలు ఒకవైపు ఉంటే.. గవర్నర్ మరోవైపు ఉన్నారని మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా బీజేపీపై నిప్పులు చెరిగారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా చట్టవిరుద్ధంగా యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించారని, రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ఇది భారత ప్రజాస్వామ్యంపై పడిన మచ్చ అని, దీన్ని చెరిపేస్తామని ఆయన ట్వీట్ చేశారు.

English Title
Constitution jokes
Related News