K Viswanath: తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎన్నో అపురూపమైన చిత్రాలను తెరకెక్కించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ (92) తిరిగిరాని లోకాలకు వెళ్లారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కే.విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె మండలం పులివర్రు గ్రామం. ఫిబ్రవరి 19, 1930 లో కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. విశ్వనాథ్ కి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో సౌండ్ రికార్డు ఆర్టిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.
Director K Viswanath Name, Biography, Age, Death
Advertisement
ఆత్మగౌరవం సినిమాతో దర్శకునిగా మారారు. ఎన్నో సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి ఎన్నో గొప్ప సినిమాలను తీశారు. ఎందరో అగ్రకథానాయకుల చిత్రాలకు ఆయన దర్వకత్వం వహించి ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీ రంగంలో ఆయన కృషికి 2016లో సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. 1992లో రఘుపతి వెంకయ్య, పద్మశ్రీ వంటి పురస్కారాలను అందుకున్నారు. కే.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎంతో పేరు సంపాదించిన ‘స్వాతిముత్యం’ చిత్రం ఆస్కార్ అవార్డుకు భారతదేశం తరుపున బరిలో నిలిచింది. ప్రధానంగా ఆసియా పసిఫిక్ చలన చిత్ర వేడుకలలో స్వాతిముత్యం, సాగరసంగమం, సిరివెన్నెల వంటి సినిమాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన సినీ వేడుకల్లో ‘స్వయంకృషి’ చిత్రం ప్రదర్శితమైంది. ‘స్వరాభిషేకం’ సినిమాకి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది.
Advertisement
కళాతపస్వి విశ్వనాథ్ తెరకెక్కించిన శృతిలయలు, స్వర్ణకమలం, సాగరసంగమం, శంకరాభరణం, స్వాతిముత్యం, స్వాతి కిరణం, సప్తపది, సిరివెన్నెల వంటి అద్భుతమైన చిత్రాలు ఎన్ని చూసినా ఇప్పటికీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయి. దాదాపు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, చిరంజీవి వంటి అగ్రహీరోల్లో దాగి ఉన్న టాలెంట్ వెలికి తీసిన దర్శకుడు కే.విశ్వనాథ్ అనే చెప్పవచ్చు. దర్శకుడిగా విశ్వనాథ్ చివరి చిత్రం శుభప్రదం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాకుండా.. నటుడిగా కూడా చాలా సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి ఆడియన్స్ ని మెప్పించారు. కే.విశ్వనాథ్ అకాల మరణం తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. కే.విశ్వనాథ్ అకాల మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read : రాఘవ కొడుకు మురారి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?